బిహార్‌లోనూ మహారాష్ట్ర తరహా రసవత్తర రాజకీయ క్రీడకు తెర లేవనుందా? తద్వారా ఉత్తరాదిన కొరకరాని కొయ్యగా మారిన ఏకైక రాష్ట్రాన్నీ బీజేపీ గుప్పిట పట్టజూస్తోందా? అందుకోసం నితీశ్ పార్టీ జేడీ(యూ)ను చీల్చి నిర్వీర్యం దిశగా పావులు కదుపుతోందా...? పరిస్థితులను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది...
మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలిక ఆశ్చర్యకరమేమీ కాదు. అనుకోనిది అసలే కాదు. శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్ ఏకంగా మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలతో కలిసి అధికార బీజేపీ–శివసేన (షిండే) కూటమికి జై కొట్టి షాకిచ్చారు. గాలివాటును బట్టి రాజకీయ వైఖరి మార్చడంలో చిన్నాన్న కంటే రెండాకులు ఎక్కువే చదివానని నిరూపించుకున్నారు. ఏడాది క్రితమే ఏక్‌నాథ్ షిండే ద్వారా శివసేనను బీజేపీ నిలువునా చీల్చి బలహీనపరచడం తెలిసిందే.
అందుకు బదులుగా షిండేకు సీఎం పీఠం దక్కితే తాజాగా ఎన్సీపీని చీలి్చనందుకు అజిత్‌కు డిప్యూటీ సీఎం పోస్టు దక్కింది. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నాటికో, తదనంతరమో ఈ రెండు చీలిక వర్గాలూ కమల దళంలో విలీనమైపోతాయని భావిస్తున్నారు. తద్వారా శివసేన, ఎన్సీపీలను నామమాత్రంగా మార్చేసి బలమైన విపక్షమన్నదే లేకుండా చేసుకోవడం బీజేపీ వ్యూహంగా కన్పిస్తోంది.
అయితే మహారాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీకి మించిన బలమున్నా ఎన్సీపీని చీల్చడం ఆసక్తికరమైన పరిణామమే. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టే ప్రయత్నాల్లో కొంతకాలంగా కీలకంగా వ్యవహరిస్తున్న శరద్ పవార్‌కు ఈ రూపంలో కమలనాథులు కోలుకోలేని షాకిచ్చినట్టు కనిపిస్తోంది. పిలవడమే తడవుగా రెక్కలు కట్టుకుని తన గూటిలోకి వచ్చి వాలేందుకు అజిత్ ఎప్పట్నుంచో సిద్ధంగా ఉన్నా పనిగట్టుకుని ఇప్పుడే ఎన్సీపీని బీజేపీ దెబ్బ కొట్టడం వెనక ఇదే ప్రధాన కారణమన్నది పరిశీలకుల అభిప్రాయం. పవార్ ప్రస్తుతం విపక్ష నేతల సానుభూతి వెల్లువలో ఉక్కిరిబిక్కిరవుతున్నారు!
నాలుగేళ్ల నాడు ఇలాగే శివసేనతో జట్టు కట్టిన అజిత్‌ను అతికష్టమ్మీద దారికి తెచ్చుకోగలిగిన ఆయనకు తాజా దెబ్బ నుంచి కోలుకోవడం పవార్‌కు కష్టమే కావచ్చు. ఆయనకు నమ్మినబంటైన ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ వంటి నేతలు కూడా అజిత్ పంచన చేరడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. పవార్ కూతురు సుప్రియా సులే సమర్థురాలే అయినా ఎన్సీపీకి ఉద్దవ్ పార్టీ గతి పట్టకుండా కాచుకోవడం శక్తిని మించిన పనేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిణామం ఇతర విపక్షాలనూ ఆలోచనలో పడేసింది. జూలై 13–14 తేదీల్లో బెంగళూరులో తలపెట్టిన తదుపరి మేధోమథన భేటీ కూడా నాలుగు రోజుల పాటు వాయిదా పడింది! ఇలా బీజేపీ ఒకే దెబ్బతో ఒకటికి మించిన లక్ష్యాలను తాత్కాలికంగానైనా సాధించినట్టేనన్న భావన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్–ఆప్ విభేదాలతో ఇప్పటికే డీలా పడ్డ విపక్షాల ఐక్యతా యత్నాలకు ఈ పరిణామం గట్టి దెబ్బేనంటున్నారు.
తదుపరి టార్గెట్ నితీశే...!
మహారాష్ట్ర అనంతరం ఇప్పుడిక బీజేపీ దృష్టి బిహార్‌పైకి మళ్లినట్టు కని్పస్తోంది. అందుకు కారణాలూ లేకపోలేదు. తొమ్మిదేళ్లుగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు, పలు రాష్ట్రాల్లో స్థానిక విపక్షాలకు చుక్కలు చూపుతున్న బీజేపీకి ఉత్తరాదిన బిహార్ మాత్రం ఓ పట్టాన కొరుకుడు పడటం లేదు. నిజానికి ఏడాది క్రితం షిండే శివసేనను చీలి్చనప్పుడే బిహార్‌లోనూ అలాంటిదేదో జరుగుతుందని చాలామంది ఊహించారు. ఒకరకంగా దానికి భయపడే బీజేపీకి అవకాశమివ్వకుండా అప్పట్లో నితీశ్ కుమార్ తానే తొలి ఎత్తు వేశారు. బీజేపీకి గుడ్‌బై చెప్పి, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు తదితరాలన్నింటినీ కలుపుకోవడం ద్వారా అధికారాన్ని నిలుపుకుని రాజకీయ చతురత ప్రదర్శించారు. కానీ బీజేపీ మాత్రం ప్రయత్నాలు మానలేదు.
జేడీ(యూ) బలాన్ని కొద్దికొద్దిగా తగ్గిస్తూ వస్తోంది. నితీశ్‌కు నమ్మకస్తుడైన ఉపేంద్ర కుషా్వహా జేడీ(యూ)కు గుడ్‌బై చెప్పి సొంత కుంపటి పెట్టుకోవడం, జితిన్‌రామ్ మాంఝీ సారథ్యంలోని హిందూస్తానీ అవామ్ మోర్చా అధికార కూటమిని వీడటం వంటివన్నీ దాని ఫలితమేనంటారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి వీరంతా బీజేపీ తీర్థం పుచ్చుకున్నా ఆశ్చర్యం లేదు. జేడీ(యూ)కూ సేన, ఎన్సీపీ గతి తప్పదంటూ కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథావాలే, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మోదీ వంటివారు ఇప్పటికే మాటల దాడికి దిగుతున్నారు. ఇదంతా బీజేపీ మైండ్‌గేమ్‌లో భాగమేనని భావిస్తున్నారు.
నితీశ్ కరిష్మా క్రమంగా తగ్గుతుండటం, ప్రధాని మోదీ మేనియా నానాటికీ విస్తరిస్తుండటం జేడీ(యూ) నేతలు, ఎమ్మెల్యేల్లో చాలామందిని ‘ఆలోచన’లో పడేస్తోందన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ. ఏళ్ల తరబడి బీజేపీ మిత్రపక్షంగా కొనసాగిన జేడీ(యూ) ప్రభ తగ్గుతూ వస్తోంది. ఇలాంటప్పుడే ఆ పార్టీని వీలైనంత గట్టి దెబ్బ తీస్తే మరో కీలక రాష్ట్రమూ చిక్కినట్టేనన్నది కమలనాథుల వైఖరిగా కని్పస్తోంది. ఈ తాజా దాడిని కాచుకునేందుకు నితీశ్ ఇప్పటికే రంగంలోకి దిగారు. పార్టీ ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమవడం తదితరాల ద్వారా వారి విధేయత సడలకుండా చూసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఎత్తులూ పై ఎత్తులతో రంజుగా సాగుతున్న బిహార్ రాజకీయ చదరంగంలో చివరికి ఎవరిది పై చేయి అవుతుందన్నది ఆసక్తికరం.
Comments
Please login to add a commentAdd a comment