అండగా ఉంటా | Specific support | Sakshi
Sakshi News home page

అండగా ఉంటా

Published Sun, Nov 23 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM

అండగా ఉంటా

అండగా ఉంటా

ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు...
 
 అది జిల్లా కేంద్రమైన కడప నగరంలోని గౌస్‌నగర్ ప్రాంతం. అక్కడ నివసిస్తున్న వారంతా కష్టాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. మురికి నీటి మధ్య దుర్భర జీవితాన్ని వెల్లదీస్తున్నారు. దినసరి కూలీలుగా కొందరు, భవన నిర్మాణ కార్మికులుగా మరికొందరు బతుకులు వెళ్లదీస్తున్నారు. శ్రమనే నమ్ముకుని జీవిస్తున్న బడుగుల కాలనీలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు అశ్రద్ధ వహిస్తున్నాయి.

పేరుకు జిల్లా కేంద్రమైనా కనీస వసతులు సమకూరక అల్లాడిపోతున్నారు. తల్లి గర్భంలో ఉన్నంత వరకూ రక్షణ కవచంలో ఉండే పసిబిడ్డలు ఆ తర్వాత మురుగుతో సహవాసం చేయాల్సిన దుస్థితి పడుతోంది.గౌస్ నగర్‌లోని బడుగు జీవులను  పలకరించేందుకు కడప ఎమ్మెల్యే ఎస్‌బి అంజాద్‌బాష ‘సాక్షి’ తరపున వీఐపీ రిపోర్టర్‌గా మారారు. వారి ఆవేదనను స్వయంగా తెలుసుకున్నారు.
 
 
కడప కార్పొరేషన్ పాలకమండలితో చర్చించి ప్రాధాన్యత పరంగా అభివృద్ధి పనులు చేపడతాం. ప్రభుత్వం నుంచి ఆశించిన మేరకు నిధులు దక్కకపోయినా, ఎమ్మెల్యే నిధుల నుంచి కాలనీలను అభివృద్ధి చేస్తాం.  గౌస్‌నగర్‌లో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. వర్షం వస్తే మురుగు నీటిలోనే దినచర్య ఉంటోంది. ఇప్పటికీ  రోడ్డు సౌకర్యం సక్రమంగా లేకపోవడం విచారకరం. సత్వరమే సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుడుతా. రూ.10లక్షలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపడుతా.

పింఛన్ల జాబితా నుంచి తొలగించడంతో అర్హులైన వారు  తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఉండేందుకు ఇళ్లు లేకపోయినా పొలం ఉందంటూ పింఛన్లు తొలగించారు. మాసాపేటలో కాలువలు, విద్యుత్ స్తంభాల సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటాం, గౌస్‌నగర్‌లో చౌకదుకాణం ఏర్పాటు చేసేందుకు తహసీల్దార్‌తో మాట్లాడి కృషి చేస్తా. బడుగులకు అండగా ఉంటా.  పింఛన్ రాలేదని ఓ అవ్వ కన్నీరు.. మురుగు కాలువలో నీరు పోలేదని ఓ వ్యక్తి బేజారు..

సొంత ఇల్లు లేదని ఓ మహిళ ఆవేదన.. రేషన్ తగ్గించేశారంటూ వృద్ధురాలి నివేదన..  ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా కడప ఎమ్మెల్యే అంజద్ బాషా చేసిన ఇంటర్వ్యూలో పేదల ఆక్రందనలకు అక్షర రూపాలు ఇవి. వీఐపీ రిపోర్టర్‌గా ఆయన పేదల బాధలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని.. మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
 
 ఎమ్మెల్యే: నీ పేరేంటవ్వా?
 వృద్ధురాలు:  కనకమ్మ సార్..
 ఎమ్మెల్యే: నీ సమస్య ఏంటి?
 వృద్ధురాలు: నాకు మూడునెలలుగా పింఛన్ రాలేదు సార్, వైఎస్ ఉన్నప్పుడు బాగా వచ్చేది, ఇప్పుడు రావడం లేదు.
 ఎమ్మెల్యే: ఎందుకు రాలేదని అడగలేదా?
 వృద్ధురాలు: అడిగాను సార్, నాగోడు వినేదెవ్వరూ..
 ఎమ్మెల్యే: అయ్యో! నీకు పింఛన్ వచ్చేలాగున అధికారులతో మాట్లాడుతాలే, ఫించన్ ఎందుకు రాలేదో మీ తరపున అడుగుతాను.
 
 ఎమ్మెల్యే: నీ సమస్య ఏంటమ్మా?
 వెంకటసుబ్బమ్మ: సార్, భర్త చనిపోయి చాలా ఏళ్లైంది, నాకు పింఛన్ ఇవ్వడంలేదు. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా ఇవ్వడంలేదు.
 ఎమ్మెల్యే: జన్మభూమిలో అడగలేదా?
 వెంకటసుబ్బమ్మ: అడిగాను సార్, ఇవ్వలా. జన్మభూమిలో మా సమస్యలు అస్సలు విన్లేదు సార్.
 ఎమ్మెల్యే: ఎందుకు రాలేదో కనుక్కొని న్యాయం చేద్దాంలేమ్మా..
 
 పాడుబడిన బోద కొట్టంలో ఉన్నమహిళ వద్దకు పోయి
 ఎమ్మెల్యే:  ఇది నీ సొంత ఇల్లేనా.. తల్లీ?
 భాగ్యమ్మ:  కాదు సార్, బాడుగ ఇల్లు.
 ఎమ్మెల్యే: వైఎస్‌ఆర్ ఉన్నప్పుడు ఇంటి స్థలానికి పెట్టుకోలేదామ్మా.?
 భాగ్యమ్మ: లేదు సార్, ఆయన పోయినాక ఎన్నిసార్లు పెట్టినా ఇవ్వడం లేదు, వానొచ్చినా, వంగడొచ్చినా ఈ ఇంటిలో ఉండలేకున్నాం సారూ..
 ఎమ్మెల్యే: ఈ ప్రభుత్వం ఇళ్లస్థలాలు ఇస్తే నీకు తప్పక ఇప్పించే ఏర్పాటు చేస్తానమ్మా, భయపడకు.
 
 (ఒక ముసలావిడ వద్దకు వెళ్లి)
 ఎమ్మెల్యే:  ఏమవ్వా.. బాగున్నావా..?
 ముసలావిడ: సైగలు చేసింది,(పక్కనున్న మహిళ కల్పించుకుంటూ ఆమెకు చెవుడు సార్, వినపడదు)
 ఎమ్మెల్యే: అయ్యో, ఆమె సమస్య ఏమి?
 మహిళ: ఈమెకు ఈ నెల నుంచి 35 కేజీలు బియ్యం ఇవ్వడం లేదు సార్, అదే విషయం ఆమె చెప్తోంది.
 ఎమ్మెల్యే: అవునా..! ఎందుకు ఇవ్వలేదని డీలర్‌ను అడగలేదా..కారణం ఏంటంటా..?
 మహిళ: ఆమెను సాకడానికి బిడ్డలు కూడా లేరు, ఎట్టా బతుకుతుంది సార్.. మీరే చెప్పండి
 ఎమ్మెల్యే: నిజమే, తహశీల్దార్‌తో మాట్లాడి ఆమెకు రేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటా..
 
 ఎమ్మెల్యే: నీ పేరేంటమ్మా? ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి?
 మహిళ: నాపేరు చంద్రలీల సార్.. ఇక్కడ కాలువలు సరిగా తీయడం లేదు, తాగేనీళ్లు నల్లగా వస్తున్నాయి,
 ఎమ్మెల్యే: కార్పొరేషన్ వారికి చెప్పలేదా?
 మహిళ: చెప్పాం సార్,
 
 వారానికో రెండు వారాలకో వ చ్చి పైపైన తీసిపోతారంతే...
 ఎమ్మెల్యే: నేను అధికారులతో మాట్లాడుతాలేమ్మా...కాలువల్లో పూడిక తీయించి, తాగునీటిలో వస్తున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు చ ర్యలు చేపడదాం.
 మహిళ: కె నరా బ్యాంకు వాళ్లు మా సంఘం పొదుపు లెక్క రూ. 40 వేలు తీసుకున్నారు సార్..
 ఎమ్మెల్యే: అన్నిచోట్లా అలాగే ఉందమ్మా..ఈ ప్రభుత్వం అబద్ధపు హామీలతో ముందుకు సాగుతోంది. ఆ హామీల అమలుకు అందరం కలిసి పోరాటం చేద్దాం
 
 ఎమ్మెల్యే: ఏమయ్యా, ఏంటి సమస్య?
 సుబ్బయ్య: (ఇంటిముందున్న  కాలువను చూపుతూ) ఈ కాలువలో నీళ్లు పోవు, కసువు ఎత్తరు, వాసన భరించలేకున్నాం, అందరికీ జొరాలు వస్తున్నాయి.
 ఎమ్మెల్యే: నిజమే, చాలా దుర్భరంగా ఉంది. అధికారులకు చెప్పలేదా..
 సుబ్బయ్య: చెప్పాం సార్, నీళ్లు మాత్రం పోవు.
 ఎమ్మెల్యే: కాలువలు శుభ్రం చేయిస్తానని చెబుతూ (మేస్త్రి శివకు ఫోన్ చేసి వెంటనే కాలువలు శుభ్రం చేయాలని ఆదేశించారు)
 
 ఇంటి వద్ద నిలబడి ఉన్న వ్యక్తి దగ్గరకు పోయి
 ఎమ్మెల్యే: ఏమన్నా, బాగున్నావా..?
 మురళి: బాగున్నా సార్, ఇక్కడ కాలువ పక్కనే ఉన్న పబ్లిక్ కొళాయి విరిగిపోయింది. నీళ్లు పట్టుకునేందుకు కూడా వీలులేకుండా ఉంది.
 ఎమ్మెల్యే: అవును కదా ఇలాగుంటే ఎలా పట్టుకొంటారు.. అధికారులకు చెప్పి వెంటనే కొళాయిని బాగుచేయిస్తాలేన్నా.
 
 (పూరి గుడిసెలో ఉన్న వృద్దురాలి వద్దకు పోయి)

 ఎమ్మెల్యే: ఏమవ్వా, బోదకొట్టంలో ఉన్నావే..నీకు ఇళ్లు రాలేదా?
 లక్షుమ్మ: రాలేదయ్యా..
 ఎమ్మెల్యే: అర్జీ పెట్టలేదా?
 లక్షుమ్మ: పెట్టానయ్యా...రాలేదు, వస్తున్న పింఛన్ కూడా తీసేశారు.
 ఎమ్మెల్యే: అయ్యో, అలాగా..నీకు పింఛన్ ఇప్పించేందుకు కృషి చేస్తాలే అవ్వా, బాధపడకు.
 
 ఎమ్మెల్యే: నీపేరేంటయ్యా?
 సంపత్: పబ్లిక్ ట్యాప్ విరిగిపోయింది సార్, (పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని చూపుతూ) ఈ స్తంభం ఎప్పుడు పడిపోతుందో తెలియదు, ఒకవైపుకు వంగి ఉంది. స్తంభం, కొళాయి పక్కపక్కనే ఉండటం వల్ల కరెంటు వస్తుందేమోనని స్థానికులు భయపడుతున్నారు.
 ఎమ్మెల్యే: విద్యుత్ శాఖ అధికారులకు చెప్పలేదా..?
 సంపత్: ఎవరికి చెప్పినా పట్టించుకోలేదు సార్..కరెంటు కూడా అప్ అండ్ డౌన్ వస్తూ ఉంటుంది. దీనివల్ల లైట్లు, ఫ్యాన్లు, టీవీలు కాలిపోతున్నాయి.
 ఎమ్మెల్యే: అలాగా..విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కషిచేస్తా.
 
 (రోడ్డుపై ఎదురుగా వస్తున్న వృద్ధురాలితో)
 ఎమ్మెల్యే: ఏమవ్వా, నీకు పింఛన్ వస్తోందా?
 వృద్ధురాలు: రాలేదు సామీ, మూడునెలల నుంచి ఇవ్వడం లేదు
 ఎమ్మెల్యే: నీ పేరేమి, ఎందుకు ఇవ్వలేదంటా..?
 వృద్ధురాలు:  నా పేరు రసూల్ బీ సార్..ఐదెకరాలు భూమి ఉందని ఇవ్వలేదంట.
 ఎమ్మెల్యే: నీకు నిజంగా భూమి ఉందా?
 వృద్ధురాలు:  తినడానికి తిండే సరిగా లేదు, భూమి ఎక్కడిది సార్?
 ఎమ్మెల్యే: చూశారా..ఇలాంటి వారికి కూడా భూమి ఉందని పింఛన్ తొలగించడం అన్యాయం, నీకు తప్పకుండా న్యాయం చేసేలా ప్రయత్నిస్తానమ్మా.
 
 అరుగుపై విశ్రాంతి తీసుకొంటున్న వృద్ధురాలి పక్కన కూర్చొని
 ఎమ్మెల్యే: ఏమవ్వా.. బాగున్నావా?
 ఖాసింబీ: ఏదో ఇలాగున్నా నాయనా..
 ఎమ్మెల్యే: ఏమైంది..?
 ఖాసీంబీ: మూడు నెలలుగా పింఛన్ రావడం లేదు. బతుకు కష్టంగా ఉంది.
 ఎమ్మెల్యే: అయ్యో, ఎందుకు తీసేశారవ్వా..
 ఖాసింబీ: నాకు యభై ఏడేళ్లేనట, అందుకే పింఛన్ నిలిపేశారు
 ఎమ్మెల్యే: అధికారులు చేసిన తప్పుకు మీరు శిక్ష అనుభవిస్తున్నారు, ఈ ముసలవ్వకు యాభై ఏడేళ్లంటే ఎవరైన నమ్ముతారా... నేను అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తాలే అవ్వా.
 
 మహిళ: సార్....సార్...
 ఎమ్మెల్యే: ఏమమ్మా...చెప్పు
 మహిళ: నాపేరు మల్లికాబేగం సార్, మాకు స్టోర్ చాలా దూరంగా ఉంది. మాసాపేటకు పోయి రేషన్ తెచ్చుకోవాలంటే కష్టంగా ఉంది. చాలామందికి రేషన్‌కార్డులు తీసేశారు.
 ఎమ్మెల్యే: తహశీల్దార్‌తో మాట్లాడి చౌకదుకాణం ఈ ఏరియాలోనే ఏర్పాటు చేయిస్తా, రేషన్‌కార్డులు ఎందుకు తొలగించారో కనుక్కొని న్యాయం చేస్తాలేమ్మా,..
 
 పొంగిపొర్లుతున్న కాలువను చూపిస్తున్న మహిళతో
 ఎమ్మెల్యే: నీపేరెంటమ్మా
 మహిళ: నాపేరు భాను సార్..
 ఎమ్మెల్యే: ఎందుకు ఈ కాలువ ఇలా ఉంది
 భాను: ఈ కాలువలో నీరు సరిగా పోదు సార్, వర్షం వస్తే ఈ రోడ్డంతా నీళ్లే ఉంటాయి, నడవాలన్నా సాధ్యం కాదు. పాములు కూడా వస్తున్నాయి. అధికారులకు చాలాసార్లు చెప్పాము సార్, వారు చేయలేదు
 ఎమ్మెల్యే: నాకు వచ్చే నిధులతో ఈ కాలువ బాగుచేయిస్తాలే తల్లీ..
 
 సార్...సార్ ఇక్కడ చూడండి సార్..అని చెబుతున్న వ్యక్తితో
 ఎమ్మెల్యే: ఆ..,చెప్పు,
 నబీరసూల్: వర్షం వస్తే ఇక్కడ మోకాలి లోతు మురికి నీళ్లు నిలుస్తాయి, ఈ నీళ్లలో దిగనిదే ఎక్కడికీ పోలేము, అనేక ఏళ్లుగా ఈ సమస్యను ఎవరూ పట్టించుకోలేదు.
 ఎమ్మెల్యే: గతంలో ఉన్న మంత్రికి చెప్పారా...
 నబీరసూల్: చెప్పాం సార్, పట్టించుకోలేదు.
 ఎమ్మెల్యే: ఇక్కడ ఇంత దారుణంగా ఉంటే నివసించేదెట్టా....నా నిధుల నుంచిగానీ, కార్పొరేషన్ నిధుల నుంచిగానీ ఇక్కడ కల్వర్టు నిర్మించేందుకు కృషి చేస్తా.
 
 ఇంటిముందు దిగాలుగా కూర్చొన్న వృద్ధుడి దగ్గరకు పోయి
 ఎమ్మెల్యే: ఏం తాతా, అలా కూర్చొన్నావు?
 మహబూబ్ సాహెబ్: నాకు పింఛన్ రావడం లేదయ్యా, ఇల్లు కూడా లేదు, బాడుగ ఇంట్లో ఉంటున్నా..
 ఎమ్మెల్యే: అయ్యో..ఇంత ముసలి వయసులో పింఛన్ కూడా రాకపోతే బతకడం ఎలా, నీకు పింఛన్ ఇప్పించేందుకు నావంతు ప్రయత్నం చే స్తానులే, ఆందోళన పడొద్దు.
 
 గుడిసెలో ఉన్న మహిళ వద్దకు పోయి మంచం మీద కూర్చొని
 ఎమ్మెల్యే: మీ ప్రాంతానికి రోడ్డు లేదు, కాలువులు లేవు, ఎలా చేస్తున్నారమ్మా
 మస్తాన్‌బీ: అవును సార్, అందరినీ అడిగినాం, ఎవరూ పట్టించుకోలేదు.
 ఎమ్మెల్యే: నీకు ఇళ్లు లేదా..
 మస్తాన్ బీ: లేదు సార్, అందుకే ఈ గుడిసెలో ఉంటున్నా, దోమలు, ఈగలతో చాలా ఇబ్బందిగా ఉంటుంది.
 ఎమ్మెల్యే: ఈ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తే నీకు తప్పక ఇల్లు వచ్చేలా చేస్తా, ఆలోపు ఈ వీధికి నా నిధుల నుంచి రోడ్డు ఏర్పాటు చేయిస్తా.  
 
 ఎవరైతే సమస్యలు చెప్పారో వారందరి పేర్లు, పింఛన్ పాసుపుస్తకాల నెంబర్లు నోట్ చేసుకొమ్మని స్థానిక కార్పొరేటర్ సోదరుడు జహీర్‌కు అంజద్‌కు చెప్పారు. వారి సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అందరికీ న్యాయం జరిగేలా పోరాడుతానని హామీ ఇచ్చారు.
 
 ఎమ్మెల్యే ఏం చెప్పారంటే....
 జిల్లా కేంద్రంలో నివాసం ఉండారనే మాట తప్పా, కనీస వసతులు కూడ సమకూరలేదు. నిద్ర లేస్తునే మురుగునీటితోనే సావాసం చేయాల్సిన దుస్థితి ఇక్కడి ప్రజానీకానికి ఏర్పడింది. గత ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పటికీ వెనుకబడ్డ ప్రాంతాన్ని ప్రత్యేక చొరవతో అభివృద్ధి చేయలేదు. గౌస్‌నగర్, మాసాపేట ప్రజలు అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో  జీవిస్తున్నారు. పసిబిడ్డలు మురుగుకాలువలల్లో ఆడుకోవాల్సిన పరిస్థితి ఉంది.

 ఏ మారుమూల ప్రాంతంలో కూడ ఇంతటి అద్వాన్నమైన పరిస్థితులు లేవు. ప్రచార ఆర్భాటాలకు పోతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వసతులు సమకూర్చాల్సిన బాధ్యతల్ని విస్మరిస్తున్నాయి.ఎన్నికల ముందు టీడీపీ ఎన్నో హామీలు ఇచ్చింది. ఆర్నెళ్లు కావొస్తున్నా వాటిలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు.

అనేక ఏళ్లుగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తీసుకొంటున్న పింఛన్లను నిష్కారణంగా తొలగించారు. ఆధార్, రేషన్ కార్డుల్లో తప్పులను సాకుగా చూపకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులకు  చెప్పాం.  మీ సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించేందుకు కృషి చేస్తానని మాట ఇస్తున్నా...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement