మాట్లాడుతున్న తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి
అనంతపురం: భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ నిర్వాహకులు దగా చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆత్మకూరు మండలం పంపనూరు సమీపంలో ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ ప్రతినిధులను నష్టపరిహారం చెల్లించాలని అడిగేందుకు వెళ్లిన రైతులపై దౌర్జన్యానికి పాల్పడడాన్ని ఖండించారు. ఇందులో భాగంగానే రైతులతో కలిసి ఆదివారం సాయంత్రం అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డిని కలిసి ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్‌పై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... గత కొన్నేళ్లు వందల కోట్ల కాంట్రాక్టు పనులు దక్కించుకున్న ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ సంస్థ రైతులకు తీరని అన్యాయం చేస్తోందన్నారు. అనంతపురం–బళ్లారి రహదారి వెడల్పు పనుల్లో కూడా రాచానపల్లి, సిండికేట్ నగర్ తదితర గ్రామాల రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా సదరు కాంట్రాక్టు సంస్థ జారుకుందన్నారు. దీని వలన రైతులు వందల కోట్లు నష్టపోయారని తెలిపారు.
తాజాగా అనంతపురం– కళ్యాణదుర్గం రోడ్డు వెడల్పు పనులు కూడా పూర్తి చేసి ప్రభుత్వం నుంచి నిధులు కొల్లగొట్టి వెళ్లిపోయేందుకు యత్నాలు చేస్తోందని మండిపడ్డారు. తమకు నష్టపరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలని అడిగేందుకు ఆదివారం సాయంత్రం కొంతమంది రైతులు పంపనూరు సమీపంలో సదరు కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను అడిగేందుకు వెళ్లారన్నారు. అయితే సంస్థ వారు మాత్రం ఏకంగా రైతులను దాడికి పాల్పడ్డారన్నారన్నారు. పైగా రైతులే దాడి చేసినట్లు అక్రమ కేసులు బనాయించేందుకు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేసి రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు.
ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ ఫిర్యాదు
ఆత్మకూరు మండలం పంపనూరు సమీపంలో తమ ఆఫీసుపై కొంతమంది వైఎస్సార్‌సీపీ నాయకులు దాడి చేసి, తమ సిబ్బందిని కొట్టారని ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ ప్రతినిధి అవినాష్‌చౌదరి డీఎస్పీ వీరరాఘవరెడ్డికి ఫిర్యాదు చేశారు. దీనిపై డీఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని, కేసు విచారిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment