
భూమాయ!
రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం 11వ శతాబ్దానికి చెందినదని చారిత్రక ఆధారాలనుబట్టి తెలుస్తోంది.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం 11వ శతాబ్దానికి చెందినదని చారిత్రక ఆధారాలనుబట్టి తెలుస్తోంది. పురాతన ఆలయం శిథిలావస్థకు చేరడంతో 1353లో ముమ్మిడి నాయకుడు అనే రాజు, లక్ష్మీదాసి అనే భక్తురాలు దాతల నుంచి విరాళాలు సేకరించి, ఆలయాన్ని పునర్నిర్మించారు. అదే సమయంలో రెడ్డి రాజులు, ముమ్మిడి నాయకుడు కలిసి స్వామివారికి ధూప, దీప, నైవేద్యాల కోసం సుమారు 1,616 ఎకరాల భూమిని దానం చేశారు. ఈ భూమిలో 900 ఎకరాలను స్వామివారికి నిత్యం సేవలందించే సుమారు 150 మందికి ఈనాముగా కేటాయించారు. మిగిలిన 700 ఎకరాలు కౌలుకు ఇచ్చారు. ఈ భూములు కోరుకొండ, గోకవరం మండలాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా పెద్దేవం తదితర గ్రామాల్లో ఉన్నాయి.
భూములను ఈనాముగా పొందినవారిలో అర్చకులు, కాపలాదార్లు, కులవృత్తులు చేసుకునేవారు తదితరులు ఉన్నారు. ఇది ఒకనాటి మాట. ప్రస్తుతం లక్ష్మీ నరసింహస్వామివారి పేరిట కేవలం 16 ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈనాముదారులు తమకు ఇచ్చిన భూములను అనధికారికంగా అమ్మేసుకుని లక్షలు వెనకేసుకోవమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇప్పటికే ఆ భూములు నలుగురైదుగురి చేతులు మారినట్టు తెలుస్తోంది. ఎకరం రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలకు అమ్మేసుకున్నట్టు ఆలయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈనాముగా ఇచ్చిన 900 ఎకరాల్లో 700 ఎకరాలకు సంబంధించి అసలు రికార్డులు కూడా లేవని చెబుతున్నారు.
ఈనాము భూములను 2013 గెజిట్ ప్రకారం కౌలు భూములుగా మార్చేందుకు సమాయత్తమైన సమయంలోనే ఈ భూ బాగోతం ఆలయ అధికారుల దృష్టికి వచ్చిందని చెబుతున్నారు. అప్పటినుంచీ ఈ భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయనే దానికోసం ప్రయత్నిస్తున్నా ప్రయోజనం లేదని అంటున్నారు. కోరుకొండ ఆలయ పర్యవేక్షణ బాధ్యతలను అన్నవరం దేవస్థానం అధికారులు నాలుగేళ్లుగా చూస్తున్నారు. అయినప్పటికీ ఈ విషయం కొలిక్కి రాలేదని చెబుతున్నారు. వేలాది ఎకరాలున్నప్పటికీ ఏటా స్వామివారికి మార్చి నెలలో ఐదు రోజులపాటు జరిగే కల్యాణోత్సవాలు, ఇతర కార్యక్రమాలకు అన్నవరం దేవస్థానంపై ఆధారపడటాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. స్వామివారి భూములు అన్యాక్రాంతమైన వ్యవహారంపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి, వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని భక్తులు కోరుతున్నారు.