బంజారాహిల్స్‌లో శ్రీవారి ఆలయం | sri vari temple sanctioned in banjara hills | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌లో శ్రీవారి ఆలయం

Published Sun, Dec 15 2013 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM

బంజారాహిల్స్‌లో శ్రీవారి ఆలయం

బంజారాహిల్స్‌లో శ్రీవారి ఆలయం

 రూ. 12 కోట్లతో నిర్మాణం
  హైదరాబాద్‌కు టీటీడీ వరాలు
 
 సాక్షి, తిరుమల: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న టీటీడీ స్థలంలో రూ.28 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఇందులో రూ.12 కోట్లతో శ్రీవారి ఆలయం, రూ.4.7 కోట్లతో వినాయకుడి ఆలయం, రూ.9.2 కోట్లతో పోటు, ప్రహరీ గోడ నిర్మాణం, శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ ఉప కార్యాలయం నిర్మించాలని తీర్మానించింది. చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో గిరిధర్ గోపాల్ నేతృత్వంలో శనివారం ఇక్కడి అన్నమయ్య భవన్ అతిథి గృహంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు.
 
     జనవరి 11న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా కాలినడకన వచ్చే భక్తులందరికీ ఉచితంగా ఒక్కో లడ్డూ పంపిణీ. అదే రోజు నుంచి తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం, విష్ణు నివాసంలో రెండు పూటలా ఉచిత అన్న ప్రసాదం పంపిణీ.
 
     వచ్చే ఏడాది 44 వేల ఆలయాల్లో ఐదో విడత మనగుడి కార్యక్రమం నిర్వహణ.
     రూ.12.63 కోట్లతో 4.5 లక్షల కిలోల ఆవు నెయ్యి, రూ.1.15 కోట్లతో 4.4 లక్షల కిలోల రవ్వ  కొనుగోలుకు అనుమతి.
 
     తిరుమలలో 30 ఎకరాల్లో విస్తరించిన శ్రీగంధం వనంలో రూ.5 కోట్లతో ప్రహరీ గోడ నిర్మాణం, డ్రిప్ ఇరిగేషన్ తదితర అభివృద్ధి పనులు.   
 
     తిరుమలలో నిత్యాన్న ప్రసాదానికిచ్చే బియ్యంపై మార్కెట్ రేటుకన్నా కిలోకు 50 పైసలు తక్కువగా అందిస్తామని ఏపీ రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ చెప్పడాన్ని సభ్యులు ప్రశంసించారు.
     చెన్నైలోని టీటీడీ లోకల్ అడ్వరుుజరీ కమిటీని మరో రెండేళ్లు  కొనసాగించేందుకు తీర్మానం.
 
 గంగాధర్‌కు రూ.40  లక్షల చెక్కు అందజేత
 సంపూర్ణ భగవద్గీతను ఆలపించిన భగవద్గీత ఫౌండేషన్ నిర్వాహకుడు, గాయకుడుగంగాధర్‌కు శనివారం రూ.40 లక్షల చెక్కును చైర్మన్, ఈవో అందజేశారు. దీనితో సీడీలు రూపొందించి ప్రచారం చేయాలని కోరారు. ఈ సందర్భంగా సీడీ పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు.
 
 లడ్డూ నాణ్యత పెంపు
 భక్తులు అత్యంత ప్రీతిపాత్రంగా స్వీకరించే తిరుమల లడ్డూ నాణ్యత పెరిగింది. 175 గ్రాముల బరువుండే లడ్డూ తయారీలో వాడే ముడి సరుకుల దిట్టాన్ని పెంచకుండానే వస్తువుల నాణ్యత, తయారీ విధానంలో మెరుగైన మార్పు చేశారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి, ముంతమామిడి, శనగపప్పు, ఎండుద్రాక్ష, యాలకులు, ఇతర ముడిసరుకులు వినియోగించేలా చర్యలు తీసుకున్నారు. ముడి సరుకులు నిల్వ చేసే పద్ధతుల్లో కూడా  మార్పులు చేశారు. దీనిని ధర్మకర్తల మండలి సమావేశంలో ప్రదర్శించారు. వాటిని రుచిచూసిన వారు లడ్డూలో నాణ్యత పెరిగిందని, రుచి కూడా మారిందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విధంగా తయారు చేసిన లక్ష లడ్డూలను భక్తులకు కూడా విక్రయించారు. కాగా, జనవరి 1, వైకుంఠ ఏకాదశి పర్వదినాన పరిమిత సంఖ్యలోనే వీఐపీ పాసులు కేటాయిస్తామని చైర్మన్, ఈవో తెలిపారు.
 
 సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు. కాగా, శ్రీవారి ఆలయంలో ఒకసారి 5,100 లడ్డూలు తయారు చేయడానికి మొత్తం 852 కేజీల ముడి సరుకుల్ని దిట్టం కింద వినియోగిస్తారు. ఇందులో 185 కిలోల ఆవు నెయ్యి, 200 కిలోల శనగపిండి , 400 కిలోల చక్కెర, 35 కిలోల ముంత మామిడిపప్పు, 17.5 కిలోల ఎండు ద్రాక్ష, 10 కిలోల కలకండ, ఐదు కిలోల యూలకులు వినియోగిస్తారు. శ్రీవారి లడ్డూ పోలిన లడ్డూను మరొకరు తయారు చేయకుండా ఉండేందుకు చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ చట్టం కింద తిరుమల లడ్డూకు ప్రత్యేకమైన భౌగోళిక గుర్తింపు నమోదు చేశారు. అయితే, పెరుగుతున్న ధరల వల్ల ముడిసరుకులు వినియోగంలో కచ్చితమైన దిట్టాన్ని వినియోగించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీనివల్ల లడ్డూ నాణ్యత, రుచి తగ్గిందని భక్తుల నుంచి ఆరోపణలు వచ్చారుు. ప్రత్యేక భౌగోళిక గుర్తింపు కింద నమోదు చేసిన  లడ్డూలో వినియోగించే ముడిసరుకుల దిట్టం కూడా పొందు పరచడంతో, ఆ దిట్టాన్ని మార్చితే సాంకేతిక సమస్యలు వస్తాయని టీటీడీ చెబుతోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement