
అశ్వవాహనంపై ఊరేగిన శ్రీవారు
కదిరి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ ఖాద్రీ లక్ష్మి నరసింహస్వామి అలుకోత్సవం శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా, కనుల పండువగా జరిగింది. అనంతరం స్వామి వారు అశ్వవాహనంపై తిరువీధుల్లో తన భక్తులకు దర్శనమిచ్చారు. చతురంగ బలాలలో అత్యంత ప్రధాన మైనది అశ్వ బలం. కలియుగాంతంలో నారసింహుడు అశ్వ వాహనం మీద వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడని చాటి చెప్పడం కోసమే స్వామివారు అశ్వవాహనంపై ఊరేగుతారు. యాగశాలలో నిత్యహోమం గావించి శ్రీవారిని విశేషంగా అలంకరించి నృసింహాలయానికి సమీపంలోని రాఘవేంద్రస్వామి ఆలయం వద్ద అలుకోత్సవం మంటపం వద్దకు తీసుకొచ్చారు.
ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి అయిన పట్టెం గురుప్రసాద్ కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీవారికి సాంప్రదాయ బద్దంగా నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు బ్రహ్మోత్సవాలు, అలుకోత్సవ విశిష్టతను భక్తులకు వివరించారు. అలుకోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు అందుకున్నారు. అన్ని ఉత్సవాలకు ఉభయదారులుగా భక్తులు వ్యవహరిస్తే ఆనవాయితీ ప్రకారం అలుకోత్సవానికి మాత్రం ఆలయ సహాయ కమిషనర్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అలుకోత్సవంలో బీజేపీకి చెందిన మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారథి, బీజేవైఎం రాష్ట్ర అద్యక్షులు విష్ణువర్దన్‌రెడ్డి, ఆంద్రప్రగతి గ్రామీణ బ్యాంకు రీజనల్ మేనేజర్ ప్రతాప్‌రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త చెన్నరాయశెట్టి, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.