సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి పట్టణాల్లో ప్రతిపాదిత మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఎంఆర్‌టీఎస్) ప్రాజెక్టుకు ముఖ్య సలహాదారుగా ఇ.శ్రీధరన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈమేరకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి డి.సాంబశివరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంఆర్‌టీఎస్ కింద విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో చేపట్టబోయే మెట్రో రైలు ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసేందుకు శ్రీధరన్ సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయనకు సెప్టెంబర్ 1 నుంచే గౌరవ వేతనం కింద నెలకు రూ. 1.50 లక్షలు ఇస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో శ్రీధరన్ ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ ప్రాజెక్టు బాధ్యతలు నిర్వర్తించిన విషయం విదితమే.