దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించానని తమిళనాడులోని కంచికామ కోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అన్నారు.
- కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి
తిరుమల: దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించానని తమిళనాడులోని కంచికామ కోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అన్నారు. ఆదివారం ఉదయం ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయ అనంతరం ఆలయానికి వచ్చిన పీఠాధిపతికి ఆలయ అధికారులు ఇస్తికఫాల్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
ఆలయంలో తొలుత ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. తర్వాత శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా అర్చకులు జయేంద్ర సరస్వతిని వస్త్రంతో సత్కరించారు. తర్వాత వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా పీఠాధిపతికి టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు ప్రత్యేక మర్యాదలు చేసి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం జయేంద్ర సరస్వతి మీడియాతో మాట్లాడుతూ మహిమాన్వితమైన శ్రీవేంకటేశ్వరుడుని దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. వారి వెంట ఆలయ డెప్యూటీ ఈవో కోదండ రామారావు, బోర్డు సభ్యులు పసుపులేటి హరిప్రసాద్, కృష్ణమూర్తి ఉన్నారు.