అందరి సలహాలతో.. ముందుకు సాగుతా
శ్రీకాకుళం పాతబస్టాండ్: ‘జిల్లాపై కొద్దిపాటి అనుభవమే ఉంది.. అందరి సహకారం, సమన్వయంతో జిల్లాను ప్రగతి బాట పట్టించేందుకు కృషి చేస్తాను’.. అని కొత్త కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం అన్నారు. సోమవారం శ్రీకాకుళం వచ్చిన ఆయన జిల్లా 28వ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తన ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ తన అనుభవాలను వివరించడంతోపాటు జిల్లా పరిస్థితులు, ప్రధాన సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాపై కొద్దిపాటి అనుభవం ఉందని, ఇటీవల హుద్‌హుద్ తుపాను సమయంలో పాలకొండ డివిజన్‌లో వారం రోజులపాటు సహాయ పునరావాస పనులను పర్యవేక్షించానని వివరించారు.
గతంలో ఇక్కడ పలువురు మంచి కలెక్టర్లు పని చేశారని, వారి స్థాయిలో జిల్లాకు మంచి చేసేందుకు ప్రయత్నిస్తానన్నారు. ప్రభుత్వ పథకాలు, సేవలు గ్రామీణులకు సక్రమంగా అందాలని, ఆ దిశగా సరైన సలహాలు ఇవ్వాలని కోరారు. జిల్లాలో ప్రకృతి సంపదకు కొదవలేదని, ఆరోగ్యవంతమైన జీవనం గడిపేందుకు అనువైన వాతావరణం ఉందని వ్యాఖ్యానించారు. అయితే మౌలిక వసతులు, విద్య, వైద్య, ఉపాధి, ఆర్థిక రంగాల్లో ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. బయోమెట్రిక్ వంటి విధానాల వల్ల ఉద్యోగులు, వైద్యుల్లో మార్పురాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నిర్బంధ విధానాల వల్ల సమస్యలు మరింత పెరుగుతాయన్నారు. నైతిక విలువలు, పని పట్ల శ్రద్ధాశక్తులు పెంపొందించడం ద్వారా మార్పు తీసుకురావాలన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయని, ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి సమస్య ఉందని అంటూ వీటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
మధ్యాహ్న భోజన పథకాన్ని సామాజిక బాధ్యతగా నిర్వర్తించినప్పుడే బడి పిల్లలకు నాణ్యమైన భోజనం అందుతుందని అభిప్రాయపడ్డారు. బెల్టు షాపుల గురించి మాట్లాడుతూ ఇది క్లిష్టమైన సమస్య అని, దీనిపై మహిళల్లో అవగాహన అవసరమని అన్నారు. ప్రజలు పొదుపుపై దృష్టి సారించాలని సూచించారు. చెత్త, ఇతర వ్యర్థ పదార్థాలతో కంపోస్టు ఎరువు, బయోగ్యాస్ వంటి వి తయారు చేస్తే ఇంధన కొరత తీరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ బి.హేమసుందర వెంకట్రావు పాల్గొన్నారు.