
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో కరోనా వైరస్ అడుగుపెట్టకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా జిల్లా యంత్రాంగం రోజుకో సరికొత్త ఆలోచనతో ముందుకు సాగుతుంది. అనేక రకాలుగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ.. కరోనా రహితంగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే జిల్లాలోని ప్రముఖ జానపద కళాకారులు బాడ సూరన్నతో ప్రత్యేకంగా ఒక జానపద గీతాన్ని పాడించారు.
జిల్లా కలెక్టర్ జే నివాస్ సమర్పించిన ఈ గీతాన్ని ఎల్‌ఐసీలో ఐటీ మేనేజర్‌గా పనిచేస్తున్న బల్లా విజయకుమార్ రచించారు. కరోనా వైరస్ నియంత్రణకు, అవగాహనకు పొందుపరిచిన సమాచారంతో ఈ పాటకు సాహిత్యం అందించారు. డాక్టర్ దానేటి శ్రీధర్ సౌజన్యంతో రూపొందించిన ఈ గీతానికి పి సుగుణాకరరావు, దుప్పల వెంకటరావు పర్యవేక్షణ చేశారు. లీలామోహన్ సంగీతం సమకూర్చారు. కాగా, ఇటీవల తెలుగు ప్రజల ఆదరణ పొందిన ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రంలో సిత్తరాల సిరపడు పాటకు బల్లా విజయ్‌కుమార్ సాహిత్యం అందించగా, బాడ సూరన్న తన గాత్రంతో పాటకు ఊపు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
పాట..
కరోనా గొప్ప హైరానా
అమ్మో అదొక రాకాసిరో
తిప్పుకోకు దాన్ని నీకాసిరో
నీ ఊపిరితిత్తిని సీకేసిరో
ఊపిరితీసేసి పోతాదిరో
కరోనా గొప్ప హైరానా
వేరన్నా దాని తీరన్నా
మేలన్నా ఉంటే దూరాన. // కరోనా//
నువ్వు కోరకుండా సెంత సేరదురో
ఒద్దంటే దూరాన ఉండేనురో
మూడుమూరల దూరముండాలిరో
ఎడమెడమ లేకుంటే తంటాలురో
తుంటరి పనులు మానెయ్యరో
ఒంటరి ఔతుంది మహమ్మారి రో // కరోనా//
నీ ఒళ్లు సుబ్బరంగ ఉండాలిరో
మనసు నిబ్బరంగ మసలాలిరో
మునియేళ్ళ నుండి మోసేతిదాక
మురికిని సబ్బుతో కడిగేసిపోరో
కాసింత శుద్దిని పాటించరో
మట్టికరిసి పోవు మహమ్మారిరో // కరోనా//
కుటుమానలొగ్గేసి పోలీసులు
కునుకు లేకుండా డాక్టర్లు , నర్సులు
కష్టాలకెదురీది సర్కారు సిబ్బంది
నెత్తికెత్తుకుంటె బాదరబంది
ఒత్తిడి పెంచి విసిగించకోరె
ఓపికపట్టి గడపదాటకోరె
ఓరుపు వుంటే విజయం మనదోరె
ముందు ముందు మంచి కాలముందోరె
Comments
Please login to add a commentAdd a comment