సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం జరిగిన హత్యాయత్నం కేసులో దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. కీలకమైన ఆధారాలు సేకరించడంలో గాని, విచారణను వేగంగా నడిపించడంలో గాని అధికారులు చొరవ చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నత స్థాయి నుంచి వస్తున్న ఆదేశాల మేరకు పైపైన విచారణ చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేయాల్సిన ఈ కేసులో విచారణ జరుగుతున్న తీరు అనేక కీలక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
♦ నిందితుడు శ్రీనివాసరావు సోదరుడు సుబ్బరాజు తొలుత మీడియాతో మాట్లాడుతూ తాము టీడీపీలో ఉన్నట్టు వెల్లడించారు. ఆ తర్వాత వచ్చిన ఒత్తిళ్ల కారణంతో మాట మార్చారు. వైఎస్సార్ సీపీ అభిమానిగా చెప్పడం మొదలు పెట్టారు. దీనివెనకున్న ఆంతర్యమేంటి?
♦వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కత్తితో హత్యాయత్నం చేసిన వ్యక్తి జనిపెల్ల శ్రీనివాసరావు అని తెలియగానే టీడీపీ నేతలు నడింపల్లి శ్రీనివాసరాజు, మట్టపర్తి వెంకటేశ్వరావు, ఇసుకపట్ల వెంకటేశ్వరావు తదితరులు ఆయన ఇంటి వద్దకు వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వీరంతా కలిసి మాట్లాడాక వైఎస్ జగన్ అభిమానులమంటూ మీడియా ముందుకొచ్చి చెప్పడం ప్రారంభించారు. ఈ హత్యాయత్నం వ్యవహారం దావానంలా వ్యాపించడంతో నిందితుడి ఇంటి వైపు ఆ తర్వాత రావడం మానేశారు. ఇందులో మర్మమేంటి?
♦నిందితుడు శ్రీనివాసరావు ఏర్పాటు చేశారని ప్రభుత్వ పెద్దలు చెప్పుకొచ్చిన ఫ్లెక్సీ తొలి రోజు ఎక్కడా కన్పించలేదు. ఆ ఫ్లెక్సీ ఎప్పుడో పోయిందని, ఎక్కడుందో తెలియదని శ్రీనివాసరావు సోదరుడు చెప్పుకొచ్చారు. ఆ మరుసటి రోజున ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ప్రాంతంలో ఓ ఇంటి ముందు ఉన్న ఇసుక దిబ్బపై ఉందని చెప్పి బయటికి తీశారు. ఆ ఫ్లెక్సీపై గతంలో ప్రకటించిన దానికి భిన్నంగా గులాబీ పువ్వు బొమ్మ ఉంది. దీనివెనకున్న లోగుట్టు ఏంటీ?
♦ముమ్మిడివరం మండల పరిషత్ అధ్యక్షుడు పితాని సత్యనారాయణరావుతో శ్రీనివాసరావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. శ్రీనివాసరావు తండ్రి తాతా రావు కుటుంబీకులకు చెందిన భూములను సత్యనారాయణ కౌలు చేస్తున్నాడన్న సమాచారం ఉంది. ఆ దిశగా ఆరా తీసిన దాఖలాలు కన్పించడం లేదు.
♦ముమ్మిడివరం నియోజకవర్గంలో జరిగే కోడిపందేల్లో శ్రీనివాసరావు కత్తులు కడుతుంటాడు. ఓ టీడీపీ నేత తరుచూ తీసుకెళ్తుంటాడు. ఆయనతో ఉన్న సంబంధాలు ఎక్కడికి తీసుకెళ్లాయి?
♦నిందితుడు శ్రీనివాసరావు కుటుంబీకులు పందెం కోళ్లు పెంచుతారు. వాటిని పందేల కోసం విక్రయిస్తుంటారు. ఈ నేపథ్యంలో పెద్దవాళ్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. అవి ఏ రకమైన పరిచయాలు?
♦శ్రీనివాసరావుపై 2017లో కేసు నమోదైంది. ప్రస్తుతం ట్రయల్‌లో ఉంది. నేర చరిత్ర ఉన్న శ్రీనివాసరావుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎవరిచ్చారు. ప్రస్తుత ఎస్సై ప్రభాకర్ తన హయాంలో ఇవ్వలేదని చెప్పగా, పూర్వపు ఎస్సై అప్పలనాయుడు ఎన్‌ఓసీ ఇచ్చానా లేదా? అనేది తనకు గుర్తు లేదని చెబుతున్నారు. అసలు ఎన్‌ఓసీ ఎవరిచ్చారు?
♦సాధారణంగా హోటల్‌లో నియమించుకొనే చెఫ్‌ను నాలుగు రకాలుగా ఆరా తీసి ఉద్యోగంలోకి తీసుకుంటారు. అలాంటిది ముక్కూమొహం తెలియని శ్రీనివాసరావుకు ఎయిర్‌పోర్టులోని రెస్టారెంట్‌ను నడుపుతున్న టీడీపీ నేత హర్షవర్ధన్ చౌదరి ఎలా ఉద్యోగమిచ్చారు. ఆయన వద్దకు తీసుకెళ్లిందెవరు? మధ్యలో ఉన్న వ్యక్తులెవరు?
♦ఇటీవల తన స్వగ్రామానికొచ్చిన శ్రీనివాసరావు స్నేహితులకు, కుటుంబీకులకు భారీ పార్టీ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. లైఫ్ సెటిలైపోయిందని... కోటి రూపాయలతో భూమి కొంటానని....నాలుగు ఎకరాలు చూడండని తన స్నేహితులకు చెప్పాడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ దిశగా శోధన జరుగుతున్నదా?
♦శ్రీనివాసరావుకు గ్రామంలోనే కాకుండా పొరుగు గ్రామాల్లో కూడా స్నేహితులు ఉన్నారు. అలాగే, చుట్టుపక్కల గ్రామాల్లో బంధువులు ఉన్నారు. వారి బ్యాంకు ఖాతాలపై నిఘా పెట్టారా?
♦వైఎస్ జగన్‌ను హతమార్చేందుకు వినియోగించిన కోడి కత్తిని ఎక్కడ నుంచి తెచ్చాడు? కొనుగోలు చేసిందెక్కడ ? అనే దానిపై ప్రాథమిక విచారణ కూడా జరగడం లేదన్న వాదనలు ఉన్నాయి.
ఇవన్నీ సమాధానాలు దొరకని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. ఆ దిశగా విచారణ జరుగుతున్నట్టుగా కన్పించడం లేదు. కాల్‌డేటాలో ఉన్న సెల్‌ఫోన్ నంబర్ల ఆధారంగానే విచారణ జరుగుతున్నది. దానికి మించి వెళ్లడం లేదు. అసలు గ్రామంలో శ్రీనివాసరావు పరిస్థితేంటి? వారితో బంధుత్వం ఉన్న వారెవ్వరు? స్నేహితులుగా చెట్టాపట్టాలేసుకుని తిరిగే వారెవ్వరు? తదితర కోణాలలో విచారణ జరగడం లేదు. ఎవరో పై నుంచి డైరెక్షన్ ఇస్తున్నట్టుగా ఇక్కడికొచ్చిన అధికారులు విచారణ చేస్తున్నారు.
♦ఈ నెల 25వ తేదీ నుంచి విచారణ చేపడుతున్నా ప్రగతి కన్పించడం లేదు. నిందితుని ఇంటి వద్ద, పోలీసు స్టేషన్‌లోనే విచారణ ప్రక్రియ చేపడుతున్నారు. గ్రామంలోకి వచ్చాక అనేక విషయాలు విచారణ అధికారుల దృష్టికి వచ్చినా ఆ దిశగా ముందుకు వెళ్లడం లేదన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఎయిర్‌పోర్టు రెస్టారెంట్‌లో చేర్పించేందుకు ఇక్కడి నుంచి ఎవరు తీసుకెళ్లారన్న దానిపై కూడా కనీసం నిగ్గు తేల్చలేకపోయారని తెలుస్తున్నది. అనుమానితుల ఇళ్లల్లో తనిఖీలు చేయడం గాని, వారి కదలికలపై నిఘా పెట్టడం గాని జరగడం లేదు. కాల్ డేటా ఆధారంగా రోజుకి కొంతమందిని ముమ్మడివరం పోలీసుస్టేషన్‌కు పిలిపించుకుని విచారణ చేస్తున్నారే తప్ప క్షేత్రస్థా«యికి వెళ్లి లోతుగా విచారణ చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment