సాక్షి, విజయవాడ: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావుని వారం రోజులు ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగించాలని రాష్ట్రపోలీస్‌శాఖను విజయవాడ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. నిందితుడికి వైద్య పరీక్షలు చేయించిన తర్వాతే ఎన్‌ఐఏకు అప్పగించాలని, ప్రతి మూడు రోజులకు ఒకసారి వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది. శ్రీనివాస్ కోరితే న్యాయవాది సమక్షంలోనే విచారణ చేపట్టాలని, విచారణలో భాగంగా నిందితుడిపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించరాదని స్పష్టం చేసింది.
విశాఖ విమానాశ్రయంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన కేసును ఇటీవల కేంద్ర హోం శాఖ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కి అప్పగించిన సంగతి తెలిసిందే. వెంటనే రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ అధికారులు విచారణ మొదలుపెట్టారు. నిందితుడు శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగిన సమయంలో విశాఖ పోలీసులు ఎన్‌ఐఏ అధికారులకు రికార్డులు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఎన్‌ఐఏ అధికారులు నిందితుడు శ్రీనివాస్‌రావును తమకు అప్పగించాలని విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment