=అంతర్జాతీయ క్రికెట్‌ను అడ్డుకుంటామని గంటా హెచ్చరికలు
=సినీ తారల క్రికెట్ మ్యాచ్‌కు పచ్చజెండా
=మంత్రి తీరుపై సొంత పార్టీలోనే పెదవి విరుపు
‘బోడి గుండుకు మోకాలికి ముడిపెట్టినట్లు’ అన్న సామెతను కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. ప్రపంచ క్రికెట్ పోటీలకు, రాష్ట్ర విభజనకు లింకు పెట్టి వీర ప్రగల్భాలు పలికిన ఆయన సినిమా తారల క్రికెట్ మ్యాచ్ ప్రారంభోత్సవానికి హాజరవడం జిల్లా వాసులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విశాఖ జిల్లా సమైక్యాంధ్ర ఉద్యమ వీరుడిని తానేనని చూపించుకోవడానికి అడుగడుగునా తాపత్రయ పడుతున్న ఆయన క్రికెట్ మ్యాచ్‌ల విషయంలో తనకు తానే సెల్ఫ్ గోల్ వేసుకున్నారు.
విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుంటే కేబినెట్ నుంచి తొలి రాజీనామా తనదే ఉంటుందని గతంలో మంత్రి గంటా శ్రీనివాసరావు గట్టిగా గర్జించారు. కారణాలేమైనా ఒట్టు తీసి గట్టున పెట్టారు. ఆమోదం పొందని రాజీనామా చేసిన ఆయన మంత్రిగా అధికార హోదా అనుభవిస్తున్నారు. సమైక్య ఉద్యమం నడుస్తున్న సమయంలోనే సీఎంను విశాఖకు రప్పించి ఫ్లై ఓవర్, తెలుగుతల్లి విగ్రహాల ప్రారంభం, బహిరంగ సభ నిర్వహించేందుకు గట్టిగానే ప్రయత్నించారు.
ఉద్యమాన్ని నీరుగార్చేందుకే సీఎం పర్యటన ఏర్పాటు చేశారనే విమర్శలు వచ్చినా లెక్క పెట్టకుండా ముందడుగు వేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనకు సీఎం వచ్చిన సందర్భంలో ఆయనతో పాటు అనకాపల్లి, యలమంచిలి నియోజక వర్గాల్లో పర్యటించారు. ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు వారిని పరామర్శించడం, ధైర్యం చెప్పడం ఏ మాత్రం తప్పు కాదు. దీనికి రాజకీయాలతోనో, మరే ఇతర సమస్యలతోనో ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఈ కారణంగానే సీఎం, మంత్రుల వరద ప్రభావిత ప్రాంతాల పర్యటను ఎవరూ తప్పు పట్టలేదు.
కానీ ఈ నెల 24న విశాఖలో జరిగే ఇండియా- వెస్టిండీస్ క్రికెట్ మ్యాచ్ అడ్డుకుంటామని గంటా ప్రకటించారు. సమైక్య ఉద్యమం జరుగుతున్న సందర్భంలో మ్యాచ్ నిర్వహించడం సరైంది కాదని, ఒక వేళ మ్యాచ్ జరిగితే సమైక్యవాదులు అడ్డుకుంటారని హెచ్చరికలు చేశారు. మ్యాచ్‌ను రద్దు చేయాలని కోరుతూ బీసీసీఐకి లేఖ రాయాలని కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చారు. సమైక్య ఉద్యమానికి, క్రికెట్ మ్యాచ్‌కు సంబంధం ఏమిటని క్రీడాకారులే కాకుండా, జిల్లాలోని వివిధ వర్గాలకు చెందిన వారు విమర్శల బాణాలు వదిలారు.
మంత్రి తీరుపై అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ క్రికెట్ మ్యాచ్‌ను అడ్డుకోవడం సరైంది కాదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. క్రీడాకారులు రౌండ్ టేబుల్ సమావేశం జరిపి మంత్రి తీరును తూర్పారబట్టారు. మంత్రి గంటాకు సమైక్య ఉద్యమం మీద చిత్తశుద్ధి నిజమే అయితే, సోమవారం నుంచి ప్రారంభమయ్యే రచ్చబండను ఎందుకు అడ్డుకోవడం లేదనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. రచ్చబండ కాంగ్రెస్‌కు ఓట్లు రాబట్టేందుకు ఉద్దేశించింది అయినందువల్లే మంత్రి దీనిపై నోరు మెదపక పోగా, సీఎంను కూడా ఆహ్వానించారనే విమర్శలు రేగుతున్నాయి.
ఒక వైపు ఈ వివాదం నడుస్తుండగానే శనివారం హైదరాబాద్‌లో జరిగిన సినీ తారల క్రికెట్ పోటీలను దగ్గరుండి ప్రారంభింపజేశారు. ఈ మ్యాచ్ వచ్చే నెల 21న విశాఖలోనే నిర్వహిస్తారు. భారత్- వెస్టిండీస్ క్రికెట్ మ్యాచ్‌ను అడ్డుకుంటామని ప్రకటించిన మంత్రి... సినీ తారల క్రికెట్ మ్యాచ్ ప్రారంభానికి హాజరు కావడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. సినీ తారల క్రికెట్ మ్యాచ్‌ను రద్దు చేయించడం మంత్రికి సులువైన విషయం.
దీనికి పచ్చ జెండా ఊపి, బీసీసీఐ నిర్వహణలోని మ్యాచ్‌ను అడ్డుకుంటామని ప్రకటించడం వెనుక ఏ రాజకీయ పరమార్థం దాగి ఉందో అంతు చిక్కడం లేదు. క్రికెట్ మ్యాచ్ విషయంలో మంత్రి గంటా తన పరస్పర విరుద్ధ వైఖరిని ఏ విధంగా సమర్ధించుకుంటారు?, ఆయన చెప్పబోయే కారణం ఏమిటి? అనేది ఆసక్తికరంగా మారింది.