చెట్లకు కాసులు | Srinivasapuram forest Irregulars producing penny. | Sakshi
Sakshi News home page

చెట్లకు కాసులు

Published Fri, Nov 15 2013 3:31 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

Srinivasapuram forest Irregulars producing penny.

నాయుడుపేటటౌన్, న్యూస్‌లైన్: శ్రీనివాసపురం అటవీప్రాంతం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. దీనికి అటవీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. అడిగేవారు కరువు కావడంతో అటవీ భూముల్లోని జామాయిల్, సుబాబుల్ తదితర విలువైన చెట్లను అక్రమంగా నరికేస్తున్నారు. దీనికితోడు ఆ భూముల్లో టన్నులకొద్ది గ్రావెల్ తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. నాయుడుపేట మండల పరిధిలోని జువ్వలపాళెం పంచాయతీ పరిధిలో శ్రీనివాసపురం అటవీ ప్రాంతం ఉంది.
 
 జాతీయ రహదారి సమీపంలోని శ్రీనివాసపురంలో దాదాపు అందరూ గిరిజనులే నివాసం ఉంటున్నారు. సర్వేనంబర్ 112-15, 120 తదితర నంబర్లలోని 559 ఎకరాల్లో జామాయిల్, సుబాబుల్ తదితర రకాల చెట్లు ఏపుగా పెరిగి టన్నుల కొద్ది బరువుతో ఉన్నాయి. సామాజిక అటవీశాఖ అధికారుల ఉదాసీన వైఖరితో జామాయిల్ చెట్లు అక్రమార్కులకు కాసులు కురిపించే వృక్షాలగా మారాయి. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో పగలూరాత్రి తేడా లేకుండా అక్రమార్కులు జామాయిల్ చెట్లను తెగనరుకుతూ తరలిస్తున్నారు.
 
 అలాగే గ్రావెల్, మట్టిని యథేచ్ఛగా తరలిస్తుండటంతో చిన్నసైజు చెరువులను తలపించేలా గుంతలు ఏర్పడ్డాయి. అయినా అధికారుల్లో చలనం లేదు. జువ్వలపాళెం పంచాయతీ పరిధిలోని అటవీ భూమి కావడంతో దీని ఆదాయం సగం పంచాయతీకి దక్కాలి. భారీ వృక్షాలకు వేలం పాట నిర్వహించకపోవడంతో అటు పంచాయతీ, ఇటు అటవీశాఖకు లక్షల్లో ఆదాయానికి గండి పడుతోంది. ఆరేళ్లకు పైగా ఇదే తంతు సాగుతోంది. ఇటీవల కొత్తగా ఎన్నికైన పంచాయతీ పాలకవర్గం అటవీ ప్రాంతంలో గస్తీ ఏర్పాటు చేసి చెట్లను కొంత మేర రక్షిస్తోంది.
  వేలం పాటలు నిర్వహిస్తే
 పంచాయతీకి ఆదాయం
 - నాగిరెడ్డి కల్పన, సర్పంచ్
 
 జువ్వలపాళెం పంచాయతీ పరిధిలోని అడవిలోని జామాయిల్ చెట్లకు అటవీశాఖ అధికారులు వేలం పాటలు నిర్వహించి ఆదాయాన్ని గడించాలి. వేలం పాటల ద్వారా వచ్చే ఆదాయంతో గ్రామాన్ని అభివృద్ధి చేయవచ్చు. పంచాయతీలో ఇప్నటికే మా సొంత నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టాం.
 గిరిజనులకు పంపిణీ చేయాలి
 - వేటగిరి అంకమ్మ, శ్రీనివాసపురం
 
 శ్రీనివాసపురంలోని ఆటవీ భూములను ఇక్కడి నిరుపేద గిరిజనులకు పంపిణీ చేయాలి. అలాగే ప్రభుత్వం కొంత మంది గిరిజనులకు పంపిణీ చేసిన వ్యవసాయ భూములు బీళ్లుగా మారుతున్నాయి. వాటికి సాగునీరు అందేలా చూడాలి.
 
 ప్రతిపాదనలు రావాల్సి ఉంది
 - రమేష్, సామాజిక అటవీశాఖ
 డీఆర్వో, సూళ్లూరుపేట
 శ్రీనివాసపురం అటవీప్రాంతంలో ఏపుగా పెరిగిన చెట్లను పంచాయతీ అధికారులు, అటవీశాఖ వాచర్ పర్యవేక్షిస్తుంటారు. చెట్ల వేలం పాటలకు సంబంధించి పాలకవర్గ ఆమోదంతో జిల్లా పంచాయతీ అధికారి నుంచి ప్రతిపాదనలు అందాల్సి ఉంది. ప్రతిపాదనలు వచ్చిన వెంటనే అంచనాలు తయారు చేసి టెండర్లు నిర్వహిస్తాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement