నెల్లూరు(అగ్రికల్చర్) : మత్స్యకారుల అభివృద్ధికి పలు సంక్షేమ పథకాలను రూపొందించిన ప్రభుత్వాలు వాటికి సరిపడా నిధులను కూడా విడుదల చేశాయి. అయితే జిల్లా మత్స్య శాఖకు కేటాయించిన సంక్షేమ పథకాల నిధులు మూలుగుతున్నాయి. నిధులు పుష్కలంగా ఉన్నా వినియోగించుకోవడం లేదు. ఆ శాఖ ఉన్నతాధికారులు సంక్షేమాన్ని పట్టిం చుకోకుండా కమీషన్లు తెచ్చిపెట్టే పనులకే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి.
అధికారుల అలసత్వానికి నిదర్శనం జెడ్పీ మత్య్స శాఖకు కేటాయించిన రూ.2.07 కోట్లు మూడేళ్లుగా అలాగే ఉండటం. ఈ నిధులను ఎస్టీ, ఎస్సీ మత్స్యకారులకు ఖర్చు పెట్టాలని జెడ్పీ అధికారులు పలుమార్లు సూచించినా మత్స్యశాఖ స్పందించిన దాఖలాలు లేవు. ఇటీవల నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఈ నిధులను ఎందుకు ఖర్చు పెట్టలేదంటూ జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినా వారి తీరు మారలేదు. దీనిని బట్టి చూస్తే ఆ శాఖ అధికారులు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో అర్థమవుతోందంటూ మత్స్యకారులు అంటున్నారు.
మత్స్యశాఖలో ఏమి పనులు చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడంలేదు. నిత్యం ఎంతో మంది పేద మత్స్యకారులు తమకు వలలు, సైకిళ్లు కావాలని ఏళ్ల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. తీరప్రాంతంలో నివసించే మత్స్యకారులు వేట లేని సమయంలో ఆ శాఖ ఆదుకోవాల్సి ఉంది. వారికి అవసరమైన సౌకర్యాలను కల్పించడంలోనూ పూర్తిగా విఫలమైంది.
మూడేళ్లుగా రెగ్యులర్ జాయింట్ డెరైక్టర్ లేక పోవడంతో సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయడం లేదని, రెగ్యులర్ జేడీని నియమించాలని మత్స్యకారుల సంక్షేమ జిల్లా సమితి పలుమార్లు ఆందోళన నిర్వహించింది. ఇటీవల రెగ్యులర్ జేడీని నియమించినా పనితీరు మారలేదని సమితి నేతలు ఆరోపిస్తున్నారు. కమీషన్లు ఎక్కువగా వచ్చే పనులకే అధికారులు ప్రాధాన్యం ఇస్తారనే ఆరోపణలున్నాయి. ఇటీవల మత్సకారులకు 1000 టీవీఎస్ మోపెడ్లు, ఐస్ బాక్సులు సబ్సిడీపై అందించారు. ఇందుకోసం టెండర్లు నిర్వహించాల్సి ఉంది. ఇందుకు భిన్నంగా ఆ శాఖ ఉన్నతాధికారి ఒకే కంపెనీ ద్వారా మోపెడ్లు, ఐస్‌బాక్సులు సరఫరా చేసేందుకు లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భారీ స్థాయిలో లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా హేచరీలకు అనధికార అనుమతులు ఇస్తూ, వారి నుంచి ప్రతి నెలా భారీ మొత్తంలో మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సముద్ర ఉత్పత్తుల ఎగుమతి, అభివృద్ధి సంస్థ(ఎంపెడా) అధికారులు ప్రత్యేక దాడులు నిర్వహించి అక్రమంగా నిర్వహిస్తున్న ఏడు హేచరీస్‌లను సీజ్ చేయడంతో వీరి డొల్లతనం బయట పడింది.
మత్స్యకారులకు సంక్షేమ ఫలాలు దక్కడం లేదు. అధికారుల అండదండలతో బినామీలే సంక్షేమ ఫలాలను దక్కించుకుంటున్నారు. అధికారులకు ముడుపులు ఇచ్చిన వారికే సంక్షేమ ఫలాలను విడుదల చేయడం అలవాటుగా మారిందనే విమర్శలున్నాయి. ఇలాంటి పనులకు అలవాటు పడిన ఆ శాఖ అధికారులు ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలో మత్స్యకారులకు సాయం అందిస్తామంటే ముందుకు రావడం లేదు.
జెడ్పీకి వచ్చే ఆదాయంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, క్రీడలు, మత్స్యశాఖ, వైద్యరంగం, తాగునీటికి ఇలా పలు శాఖలకు నిధులను గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు చేసేందుకు వాటా ఇవ్వాలి. అదే క్రమంలో మత్స్య శాఖకు కూడా నిధుల వాటా కేటాయించారు. ఈ నిధులను మత్య్సకారుల సంక్షేమానికి ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలో ఖర్చు చేయాలి. 2012-13, 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాల్లో జెడ్పీ రూ.2.07 కోట్లు కేటాయించింది.
ఈ నిధుల ఖర్చులో అధికారులకు సొంత ప్రయోజనాలు నెరవేరే అవకాశాలు లేనందున మూడేళ్లుగా అలాగే మూలుగుతున్నాయి. ఈ విషయమై జనరల్‌బాడీ సమావేశంలో చైర్మన్ మత్స్యశాఖ అధికారులను మందలించినా అధికారులు ఒక్క అడుగు ముందుకు వేయలేదు. దాంతో మళ్లీ చైర్మన్ ఈ నెల 12వ తేదీ మత్స్యశాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి నిధులు ఇస్తామంటే ఎందుకు ఖర్చు పెట్టడం లేదంటూ మందలించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ నిధులతో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఎస్సీ, ఎస్టీ మత్స్యకారులకు సైకిల్‌తోపాటు వలను అందించాలని కోరుతున్నారు.
సైకిళ్లు, వలల పంపిణీకి చర్యలు :
జెడ్పీ నిధులతో ఎస్సీ, ఎస్టీ మత్స్యకారులకు రూ.6వేలతో సైకిల్, వల పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఒక యూనిట్‌గా రూ.3700 సైకిల్‌కు, రూ.2300 వలకు ఖర్చు చేస్తాం. ఇందులో 90 శాతం రాయితీ, 10 శాతం లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. జెడ్పీ నిధుల్లో 50 శాతం సొసైటీల సభ్యులను, మరో 50 శాతం సొసైటీల్లో సభ్యులుగాని, కాలువల్లో చేపలు పట్టుకునే వారికి ప్రాధాన్యం ఇస్తాం. జిల్లా వ్యాపితంగా మూడు వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
-కల్యాణం, జాయింట్ డెరైక్టర్, మత్స్యశాఖ
అవినీతికి కేరాఫ్ మత్స్యశాఖ
Published Mon, Apr 20 2015 4:14 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement