ఉదయగిరి : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చెక్‌డ్యాంలు, అడ్డుకట్టల మరమ్మతుల కోసం ప్రభుత్వం ఇటీవల జిల్లాకు రూ.2.53 కోట్లు నిధులు విడుదల చేసింది. గతంలో వివిధ పథకాల ద్వారా ఏర్పాటు చేసిన చెక్‌డ్యాంలు, అడ్డుకట్టలు పాక్షికంగా
దెబ్బతిని ఉంటే వాటికి మరమ్మతులు చేసి నీటిని నిల్వ చేయాలని రాష్ట్రప్రభుత్వ ఆదేశాలిచ్చింది. ఆ మేరకు జిల్లా అధికారులు ఇలాంటి వాటిని గుర్తించి నివేదికలు ఇవ్వవలసినదిగా గత ఏడాది సెప్టెంబర్‌లో పంచాయతీ అధికారులకు సూచించింది. జిల్లాలో ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో చెక్‌డ్యాంల నిర్మాణం జరిగిన నేపథ్యంలో కావలి పంచాయతీరాజ్ డివిజన్‌లోఎక్కువ పనులకు ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనల్లో అవసరం లేకున్నా ఎక్కువ ఎస్టిమేషన్లు తయారుచేసి ఆమోదం పొందారు. మంజూరైన ఈ పనులను తూతూమంత్రంగా చేసి నిధులు స్వాహా చేసేందుకు అధికార పార్టీ నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నామినేషన్ల ప్రాతిపదికన జరిగే ఈ పనులకు వర్క్ ఆర్డర్లు కూడా అధికారులు చకచకా ఇచ్చేస్తున్నారు.
నిధులు మంజూరు జిల్లాలో మొత్తం 257 పనులకు సంబంధించి రూ.236.93 లక్షలు నిధులు విడుదల చేశారు. మొదటి విడత కింద 156 చెక్‌డ్యాంలకు గాను రూ.152.35 లక్షల నిధులు మంజూరయ్యాయి.
అలాగే రెండో విడత కింద 99 చెక్‌డ్యాంలు, రెండు అడ్డుకట్టలకు రూ.89.58 లక్షలు నిధులు మంజూరయ్యాయి. ఈ రెండు విడతల్లో కూడా ఎక్కువ పనులు ఉదయగిరి నియోజకవర్గానికి మంజూరయ్యాయి. ఇక్కడే భారీ ఎత్తున నిధులు స్వాహా చేసేందుకు అవసరం లేని పనులకు సైతం మరమ్మతులు అవసరమని ఎస్టిమేషన్లు తయారుచేసి తూతూమంత్రంగా పనులు చేసి స్వాహా చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని మండలాల్లో పనులు ప్రారంభమయ్యాయి.
నిబంధనలివి
ప్రభుత్వం గతంలో వివిధ పథకాల ద్వారా భూగర్భజలాలను పెంపొందించే ఉద్దేశంతో అక్కడక్కడ వాగులు, వంకలను ఎంపికచేసుకొని చెక్‌డ్యాంలు, కుంటలు నిర్మించింది. వర్షాలు పడినప్పుడు వీటిలో నీరు చేరి భూమిలో ఇంకి సమీప ప్రాంతాల్లోని భూగర్భజలం పుష్కళంగా ఉంటుంది. ముఖ్యంగా వాటర్‌షెడ్ కార్యక్రమంలో వీటిని నిర్మించారు.
జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభమైన తర్వాత మూడేళ్ల క్రితం అవసరమైన చోట చెక్‌డ్యాంలు, అడ్డుకట్టలు నిర్మించారు. వీటి ఉద్దేశంకూడా నీటిని నిల్వ ఉంచి భూగర్భజలాలను పెంచటమే.
ఉదయగిరి నియోజకవర్గంలోని వివిధ మండలాలలో గత పదేళ్ల నుంచి వివిధ గ్రామాల్లో వాటర్‌షెడ్ పథకాలు అమలుజరిగాయి. ఇందులో రూ.2 లక్షలు చొప్పున ఖర్చుచేసి చెక్‌డ్యాంలు నిర్మించారు. కొన్ని చెక్‌డ్యాంలు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. బాగా దెబ్బతిన్న చెక్‌డ్యాంలు కూడా రూ.20 నుంచి 30 వేలు వెచ్చిస్తే పూర్తిగా మరమ్మతులు చేసే అవకాశముంది. కానీ అందుకు భిన్నంగా అంచనాలు రూపొందించారు.
జరుగుతోందిలా...
మరమ్మతులు పేరుతో చెక్‌డ్యాంల్లో భారీస్థాయిలో నిధులు స్వాహా చేసేందుకు తమ్ముళ్లు ప్రణాళిక సిద్ధం చేసుకొని పీఆర్ అధికారులతో కలిసి అంచనాల్లోనే ఎక్కువ మొత్తం వేయించుకున్నారు. తూతూమంత్రంగా పనులు చేసి స్వాహా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
నిబంధనల మేరకు ఒక చెక్‌డ్యాంకు మరమ్మతులు కోసం ఆ చెక్‌డ్యాం మొత్తం వ్యయంలో 20 శాతమే కేటాయించాలి. అంటే ఒక చెక్‌డ్యాం రూ.2 లక్షలతో నిర్మించివుంటే రూ.40 వేలు లోపు మాత్రమే మరమ్మతులకు అంచనాలు రూపొందించాలి. కానీ ఈ నిబంధనలను గాలికొదిలేశారు. రూ.2 లక్షల వ్యయంతో నిర్మించిన చెక్‌డ్యాంకు మరమ్మతుల కోసం రూ.2 లక్షల వరకు అంచనాలు వేశారు. కొన్ని చెక్‌డ్యాంలు రూ.20, 30 వేలతో పూర్తిచేసే అవకాశం ఉన్నప్పటికీ, రూ.1.50 లక్షలుపైగా అంచనాలు వేయటం వెనుక ఆంతర్యం ఏమిటో పంచాయతీరాజ్ అధికారులకే తెలియాలి. తూతూమంత్రంగా పనులు చేసి నిధులు స్వాహా చేసేందుకు ఈ తతంగం నడిపారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ పనులన్నీ కూడా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరిగేవి కావడంతో అధికారులు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారు. ఈ నిధులు పంచాయతీ సర్పంచ్‌ల అకౌంట్‌లో నుంచి డ్రా చేయవలసి ఉన్నందున తమకు అనుకూలంగా లేని సర్పంచ్‌లను అధికారపార్టీ నేతలు బెదిరించి నయానో, భయానో దారికి తెచ్చుకుంటున్నారు. తమ దారికిరాని సర్పంచ్‌లు ఉన్న గ్రామాల్లో పనులే జరగనీయకుండా నిలిపివేస్తున్నారు. మొత్తమ్మీద లక్షలాది ప్రజాధనం పక్కదారి పట్టించి స్వాహా చేసేందుకు అధికారుల సాయంతో అధికార పార్టీ నేతలు ప్రయత్నాల్లో ఉన్నారు.
తమ్ముళ్లకు నిధుల పండగ
Published Mon, Mar 9 2015 2:47 AM | Last Updated on Mon, Oct 8 2018 7:53 PM
Advertisement
Advertisement