ఐక్యతతో ముందుకు సాగాలి!
సింగపూర్‌లోని భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగం
సింగపూర్: సింగపూర్‌లోని భారతీయులకు ప్రధాని మోదీ ‘ఐక్యత, సమగ్రత’ మంత్రోపదేశం చేశారు. భారతదేశ ఘన ప్రతిష్టను నిలపడంలో ఐకమత్యం, సామరస్యత చాలా ముఖ్యమైన అంశాలన్నారు. సింగపూర్‌లోని భారతీయులనుద్దేశించి మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు. భారత్‌లో అసహనంపై పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ, తాజాగా ఆమిర్‌ఖాన్ వివాదం నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారత్‌లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, తన ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను మోదీ ప్రవాస భారతీయులకు వివరించారు. ‘భారతీయుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే దిశగా మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రజలందరి కన్నీళ్లను తుడవడం లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాం.’ అన్నారు.
పారిస్‌లో జరగనున్న వాతావరణ మార్పు సదస్సులో భారత్ సానుకూల పాత్ర పోషిస్తుందన్నారు. ‘మా అభివృద్ధికార్యక్రమాలకు భారీ మొత్తంలో ఇంధనం అవసరముంది. అయినా, ప్రపంచాన్ని ఒక కుటుంబంలా భావించి వాతావరణంపై పోరు లో సాధ్యమైనంత సానుకూలంగా వ్యవహరి స్తాం. సమస్యలు సృష్టించబోం’ అన్నారు. సౌర, అణు, పవన.. తదితర స్వచ్ఛమైన, పునరుత్పాదిత పద్ధతుల్లో విద్యుదుత్పత్తికి పెద్దపీట వెస్తున్నామన్నారు. ఇంధనవనరుగా బొగ్గుపై భారాన్ని తగ్గించేందుకు 175గిగావాట్ల స్వచ్ఛ విద్యుదుత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని, 2022 నాటికి దేశంలోని అన్ని గ్రామాలకు 24 గంటల విద్యుత్‌ను అందించగలమన్న విశ్వాసం ఉందన్నారు.
మహాత్మాగాంధీని ప్రస్తావిస్తూ.. భారత్‌లో పర్యావరణాన్ని పూజలు చేసే విషయాన్ని గుర్తు చేశారు. ప్రపంచ దేశాలతో భారత్ సమానత్వాన్ని మాత్రమే కోరుకుంటోందని, దేశ సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని సగర్వంగా ప్రకటించుకోవాలనుకుంటోందన్నారు. ‘యోగాను మోదీ తీసుకువచ్చాడా? లేదే.. అది అంతకుముందు నుంచే ఉంది. కానీ దాన్ని ప్రచారం చేయడంలో గత పాలకులు వెనుకంజ వేశారు. ప్రపంచ దేశాలు ఏమనుకుంటాయో అని భయపడ్డారు. కానీ మనకు ఆత్మవిశ్వాసంతో ఉంటే ప్రపంచమంతా మనతోనే ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. సింగపూర్ ప్రగతిలో భారతీయుల కృషి ఎంతో ఉందన్నారు. తన బ్రిటన్ పర్యటనతో భారతదేశ రూపాయి లండన్ స్టాక్ ఎక్సేంజ్‌లో స్థానం సంపాదించిదన్నారు. ‘నేను గుజరాత్ సీఎంగా ఉండగా.. విదేశీ వ్యవహారాల గురించి మీకేం తెలుసు? అని మీడియా నన్ను పదేపదే ప్రశ్నించేది. ఆ అంశంలో నేను బలహీనుడినని భావించింది కాబోలు’ అని మీడియాపైనా చురకలు వేశారు. అనంతరం, మలేసియా, సింగపూర్ పర్యటనను ముగించుకుని ప్రధాని మోదీ మంగళవారం స్వదేశానికి పయనమయ్యారు.
సింగపూర్‌తో పది ఒప్పందాలు
సింగపూర్: వ్యూహాత్మక భాగస్వామ్యం సహా రక్షణ, సైబర్ భద్రత, పౌర విమానయానం, నౌకాయానం తదితర రంగాల్లో భారత్ సింగపూ ర్‌లు 10 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ప్రధాని మోదీ మంగళవారం ప్రధాని లీ సీన్ లూంగ్, అధ్యక్షుడు టోనీ టాన్ కెంగ్‌తో సమావేశమయ్యారు. వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఇరుదేశాల ప్రధానులు సంయుక్త ప్రకటన చేశారు. ‘రక్షణ, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అయ్యే దిశగా పలు ఒప్పందాలు కుదిరాయి.’ అని అందులో పేర్కొన్నారు.
ఆసియాఆర్థిక సింహం: ప్రధాని మోదీ సింగపూర్‌ను ఆసియా ఆర్థిక సింహంగా అభివర్ణించారు. ఆ దేశ ప్రధాని లూంగ్ ఇచ్చిన గౌరవ విందులో మాట్లాడుతూ..‘ఆసియా జాతి సింహం ఇప్పుడు గుజరాత్‌లో మాత్రమే కనిపిస్తుంది. కానీ ఆసియా ఆర్థిక సింహం మాత్రం ఇక్కడే(సింగపూర్) ఉంది’ అని వ్యాఖ్యానించారు. 1842నాటి సింగపూర్ చిత్రపటాన్ని లూంగ్‌కు మోదీ బహూకరించారు.