తమ్ముళ్ల ఇసుక దోపిడీ | Brothers sand exploitation | Sakshi
Sakshi News home page

తమ్ముళ్ల ఇసుక దోపిడీ

Published Mon, Dec 15 2014 2:42 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

తమ్ముళ్ల ఇసుక దోపిడీ - Sakshi

తమ్ముళ్ల ఇసుక దోపిడీ

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  ప్రభుత్వం ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెంచడంతో పాటు మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని భావించింది. ఆ మేరకు ఇసుక అమ్మకాలను అధికారులు డ్వాక్రా సంఘాలకు అప్పగించారు. అక్రమాలు జరగకుండా ఉండేందుకు ఇసుక రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రీచ్‌ల వద్ద కెమెరాలు ఏర్పాటు చేయకపోగా డ్వాక్రా మహిళల ముసుగులో తెలుగు తమ్ముళ్లు ఇసుక రీచ్‌లను తమ గుప్పిట్లోకి తీసుకుని యథేచ్ఛగా వ్యాపారం చేసుకుంటున్నారు.
 
 ఇదిలా ఉంటే జిల్లాలో ఇసుక తోలుకుని జీవించే టైరు బండి కార్మికుల నుంచి ఒక్కో బండికి రూ.600 చొప్పున పన్ను రూపంలో వసూలు చేస్తున్నారు. దీంతో సుమారు నెల రోజులపై నుంచి కార్మికులు ఇసుక తోలకుండా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. వీరికి మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోరాడుతున్నారు. ఇసుక బండ్లకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారంలో ఉన్న టీడీపీ నేతలు నోరెత్తడం లేదు.  
 
 అనుమతులు ఆరింటికి, రవాణా 38 రీచ్‌ల నుంచి..
 జిల్లాలో పెన్నా, స్వర్ణముఖి, బొగ్గేరు పరిధిలో నాణ్యమైన ఇసుక ఉంది. ఈ ప్రాంతంలో  అధికారులు 80 రీచ్‌లను గుర్తించారు. వాటిలో 50 రీచ్‌ల్లో తవ్వకాలు జరపాలని నిర్ణయించారు. ప్రభుత్వం మాత్రం కేవలం ఆరు రీచ్‌లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. టీడీపీ నేతల ఒత్తిళ్ల కారణంగా అధికారులు ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి 38 రీచ్‌ల్లో ఇసుక తవ్వుకోవచ్చని అనధికారికంగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో టీడీపీకి చెందిన ముఖ్యనేతలు ఇసుకను అక్రమంగా తోడేస్తున్నారు. పర్మిట్లు లేకుండానే ఇసుకను తరలిస్తున్నారు. ఎక్కడైనా అధికారులు వాహనాలను ఆపి పర్మిట్లు చూపమంటే టీడీపీ నాయకులు ఫోన్‌చేసి వదిలిపెట్టమని బెదిరిస్తున్నారు. మరి కొన్నిచోట్ల ఐకేపీ అధికారులే ఇసుక మాఫీయా అవతారమెత్తి ఇసుకను తరలించి సొమ్ముచేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
 
 అంతా మాఫియా చేతుల్లోనే
 జిల్లాలో ఇసుక తవ్వకాలు, రవాణా అంతా తెలుగు తమ్ముళ్ల మాఫియా చేతుల మీదుగానే సాగుతోంది. ఒక ట్రాక్టర్‌కు మూడు క్యూబిక్ మీటర్ల చొప్పున రీచ్‌ల నుంచి ఇసుకను తరలించేందుకు అనుమతి ఉంది. అయితే ట్రాక్టర్ల యజమానులు మాఫియాతో చేతులు కలిపి ఐదు నుంచి ఆరు క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రీచ్‌లో మాత్రం క్యూబిక్ మీటర్‌కు రూ.600 చొప్పున మూడు క్యూబిక్ మీటర్లకు రూ.1800 రూపాయలు, కూలీలకు రూ.200 చెల్లిస్తున్నారు. ఇదే ఇసుకను బయట మార్కెట్‌లో సుమారు రూ.6 వేల చొప్పున వసూలు చేసుకుని జేబులు నింపుకుంటున్నారు. ముఖ్యంగా ఇందుకూరుపేట మండలంలోని ముదివర్తిపాళెం, పల్లిపాడు, నాగరాజుతోపు, కోవూరు మండలంలో జమ్మిపాళెం, వేగూరు, విడవలూరు మండలంలో సుబ్బారెడ్డిపాళెం, ముదివర్తి తదితర ప్రాంతాల్లో రీచ్‌ల నుంచి ఇసుక అక్రమ రవాణా వ్యవహారం రాత్రిళ్లు గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. ఐకేపీ అధికారులు తమ్ముళ్ల ఒత్తిడికి లొంగిపోయి సహకారం అందిస్తున్నట్లు విమర్శలున్నాయి.
 
 వెలుగులోకి అక్రమాలు
 జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఇటీవల కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఇటీవల సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఇసుక తరలిస్తున్న కొన్ని వాహనాలను ఆపి తనిఖీ నిర్వహించగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. 25 బిల్లులతో సుమారు 100 వాహనాలు వెళుతున్నట్లు గుర్తించారు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలో ఐకేపీ అధికారుల సహకారంతో ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. ట్రాక్టర్లకు చెక్కులు అమర్చి నాలుగు నుంచి ఐదు క్యూబిక్ మీటర్ల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు తహశీల్దార్ తనిఖీల్లో బయటపడింది. ఇదే మండలంలోని మినగల్లులో ఒకే బిల్లుపై రెండు రకాలుగా నమోదు చేసి రవాణా చేస్తుండటాన్ని గ్రామస్తులు గుర్తించారు. అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్టు చేశారు.
 
 పాపం టైరు బండి కార్మికులు
 తెలుగు తమ్ముళ్లు అక్రమంగా ఇసుకను తరలించి సొమ్ముచేసుకుంటుంటే జిల్లా అధికారులు అత్యుత్సాహంతో టైరు బండి కార్మికులు పొట్ట కొడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు వేల మంది టైరు బండి కార్మికులున్నారు. పెన్నా, స్వర్ణముఖి, బొగ్గేరు నుంచి ఇసుక తవ్వుకుని వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు జిల్లాలో మాత్రం  ఇసుక బండి కార్మికుల నుంచి అధికారులు పన్నురూపంలో బలవంతపు వసూళ్లు చేస్తున్నారు. టైరు బండ్లకు ఉచితంగా ఇసుక అందించాలని 2012లో ప్రభుత్వం 142 జీఓను ఇచ్చినప్పటికీ అధికారులు ఖాతరు చేయడం లేదు. ఇటీవల ప్రభుత్వం ఇసుక విధానంపై  విడుదల చేసిన 95 జీఓలో టైరు బళ్ల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అధికారుల తీరును నిరసిస్తూ నెల రోజుల నుంచి టైరు బండి కార్మికులు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నా ప్రభుత్వ పట్టించుకోవడం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement