చిన్న శేష వాహనంపై మురళీకృష్ణుని విహారం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామి చిన్న శేష వాహనంపై శ్రీకృష్ణావతారంలో భక్తులను కటాక్షించారు. పట్టు పీతాంబరాలు, మరకత మాణిక్యాదుల విశేషాభరణాలు, పరిమళాలు వెదజల్లే పుష్పమాలలు ధరించి ఐదు శిరస్సుల శేషుని నీడన వేణువు చేతబట్టి మురళీకృష్ణుడి రూపంలో తిరువీధుల్లో విహరించారు. ఊరేగింపు ముందు గజరాజులు, అశ్వాలు, నందులు కదులుతుండగా.. జీయర్ స్వాములు దివ్య ప్రబంధ గానం ఆలపిస్తుండగా.. భజన, కళాబృందాలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచి 11వరకు వాహన సేవ జరిగింది. అశేష భక్తుల గోవిందనామస్మరణతో తిరువీధులు మార్మోగాయి. రాత్రి హంస వాహనంపై సరస్వతీదేవి అలంకారంలో స్వామివారు కొలువుదీరి భక్తులను అనుగ్రహించారు. –సాక్షి, తిరుమల
నేటి వాహన సేవలు
ఉదయం : సింహ వాహనం
బ్రహ్మోత్సవాలలో మూడోరోజు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు సింహ వాహనంపై శ్రీవేంకటేశ్వరుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు. జంతువులకు రాజైన సింహం తానేనంటూ మనుషులలో జంతు స్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని స్వామివారు లోకానికి చాటుతారు. యోగశాస్త్రంలో సింహ వాహన శక్తికి, గమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు. శ్రీవేంకటేశ్వరుడు తనలోని పరాక్రమాన్ని ప్రపంచానికి చాటడానికి ఈ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారని ఆర్యోక్తి.
రాత్రి : ముత్యపు పందిరి వాహనం
రాత్రి ముత్యపుపందిరి వాహనంపై శ్రీవారు విహరించనున్నారు. సుకుమారసేవగా ముత్యపు పందిరి వాహనాన్ని చెప్పవచ్చు. ముక్తి సాధనకు ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈవాహనం ద్వారా స్వామి వారు చాటి చెబుతారు. శ్రీనివాసుడు ముత్యపు పందిరిపై మనోరంజకంగా దర్శనమిస్తారు.రాత్రి 9గంటలకు తిరువీధుల్లో ఈ వాహన సేవ ప్రారంభమై 11వరకు సాగుతుంది.
భక్త వాణి
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ కల్పిస్తున్న వసతులు వారి మాటల్లో.. తిరుపతి (అలిపిరి)/అర్బన్
కనులారా దర్శించుకున్నాం
తిరుమల శ్రీవారిని కనులారా దర్శించుకున్నాం. బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు అద్భుతంగా ఉన్నాయి. హరినామ సంకీర్తన , సాంస్కృతిక ప్రదర్శనల నడుమ వాహన సేవలు కట్టిపడేస్తున్నాయి. టీటీడీ భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసింది. – శ్రీనివాస్, వేలూరు, తమిళనాడు
వాహన సేవలో తరించాం
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం చిన్నశేష వాహన సేవలో పాల్గొన్నా.. గోవిందనామ స్మరణ మధ్య వాహన సేవలో శ్రీనివాసున్ని దర్శించుకున్నాం. గత బ్రహ్మోత్సవాలకు వచ్చాం. కానీ వాహన సేవను కనులారా చూడలేకపోయాం. ఈ సారి శ్రీవారిని దగ్గర నుంచి చూసే భాగ్యం కలిగింది. – వైఎస్ దేవేంద్ర, రాణిపేట, తమిళనాడు
ఆర్జిత సేవలకు లాటరీ సరికాదు
తిరుమలలో ఆర్జిత సేవలకు లాటరీ విధానం రద్దు చేయాలి. ఆన్‌లైన్ విధానంలో ఆర్జిత సేవలను భక్తలకు అందించాలి. క్యూలైన్లలో తోపులాట జరుగుతోంది, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తులు రెండు లైన్లలో క్యూలో వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకునే ఏర్పాటు చేస్తే బాగుంటుంది.– గౌరీదేవి, హైదరాబాద్
మెరుగైన వసతులు కల్పించాలి
భక్తులకు మెరుగైన సేవలందించేలా టీటీడీ చర్యలు తీసుకోవాలి. తిరుమలకు వచ్చే భక్తులకు సులభంగా వసతి కల్పించాలి. చంటి బిడ్డలతో తిరుమలకు వచ్చే వారికి మంచి సౌకర్యాలు కల్పించాలి. – పుష్పావతి, విజయవాడ
విద్దుదీపాలంకరణ చాలాæ బాగుంది
తిరుమల క్షేత్రంలో విద్యుద్దీపాలంకరణ బాగుంది. రాత్రివేళల్లో శ్రీవారి నమూనాలు, కటౌట్లు, ఆర్చిలు దేదీప్యమానంగా వెలుగుతూ కనువిందు చేస్తున్నాయి. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం అంటే తిరుమల గిరుల్లోనే చూసి తరలించాలి. అందుకే ఏటా బ్రహ్మోత్సవాలకు వస్తున్నాం – శిరీష, అమలాపురం