
వైకుంఠాన్ని తాకిన ఆగ్రహం
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఏడుగేట్లు విరగ్గొట్టిన భక్తులు
దర్శనం ఆలస్యంపై టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు
సర్వదర్శనం క్యూల్లో కిక్కిరిసిన భక్తులు
సాక్షి, తిరుమల : వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దర్శనం, బస కోసం తిరుమలలో అష్టకష్టాలు పడిన సామాన్య భక్తులు ద్వాదశి రోజు ఏకంగా కంపార్ట్‌మెంట్ల గేట్లను విరిచి టీటీడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు దర్శనం ఆలస్యమవుతోందని అరుపులు కేకలు వేస్తూ రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని ఏడు కంపార్ట్‌మెంట్ల గేట్లను విరిచేశారు. శనివారం పోటెత్తిన భక్తుల రద్దీతో ఏకాదశి నాటి వైఫల్యాలను సవరించుకున్న టీటీడీ అధికారులు ఆదివారం ద్వాదశి రోజున సామాన్య భక్తుల దర్శనానికి తొలి ప్రాధాన్యం ఇచ్చారు. కాలిబాటలో నడచివచ్చిన భక్తులు, సర్వదర్శనంలో వేచి ఉండే భక్తుల క్యూలు వేగంగా కదిలేలా చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ, తమకు దర్శనం ఆలస్యమవుతోందని రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మూకుమ్మడిగా గేట్లను నెట్టివేయటంతో పాట్‌లాక్‌లు, గడియలు ఊడిపోయాయి. తొలుత 9వ నంబర్ కంపార్ట్‌మెంట్‌లో పరిస్థితి అదుపు తప్పింది. భక్తులు ఆ కంపార్ట్‌మెంట్ గేట్‌ను విరగ్గొట్టారు. ఆ తర్వాత 10, 14, 15, 22, 23, 24 .. ఇలా ఏడు కంపార్ట్‌మెంట్ల గేట్లను విరగ్గొట్టి తలుపులు పక్కకు తొలగించి దర్శనం కోసం పరుగులు తీశారు. దీనివల్ల పక్కనే ఉన్న ఇతర కంపార్ట్‌మెంట్లలోని భక్తులు కూడా అరుపులు కేకలు వేశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని భక్తులను వారించారు. వరుస క్రమంలో కంపార్ట్‌మెంట్లను అనుమతిస్తున్నప్పటికీ భక్తులు కొందరు గేట్లు విరిచి ఇతర భక్తులకు ఇబ్బంది కలిగించారని అక్కడి టీటీడీ సిబ్బంది తెలిపారు. తర్వాత విరిగిన ఏడు కంపార్ట్‌మెంట్ల గేట్లకు అప్పటికప్పుడే వెల్డింగ్ చేశారు.
శాస్త్రోక్తంగా శ్రీవారి చక్రస్నానం
వైకుంఠ ద్వాదశి పర్వదినం పురస్కరించుకుని ఆదివారం శ్రీవారి చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఏడాదిలో బ్రహ్మోత్సవాల ఆఖరి రోజు, అనంత పద్మనాభస్వామి వ్రతం, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి రోజున పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా వేకువజామున 4.30 గంటలకు సుదర్శన చక్రతాళ్వారు ఆలయం నుంచి ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ పుష్కరిణికి తరలివచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి సుదర్శన చక్రతాళ్వారుకు పవిత్ర స్నానం చేశారు. టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో గిరిధర్ గోపాల్ దంపతులు పుణ్యస్నానాలు చేశారు.