వైకుంఠ ఏకాదశికి తిరుమల ముస్తాబు | Tirumala Ready For Vaikunta Ekadasi | Sakshi
Sakshi News home page

వైకుంఠ ఏకాదశికి ముస్తాబు 

Published Sun, Jan 5 2020 10:18 AM | Last Updated on Sun, Jan 5 2020 12:27 PM

Tirumala Ready For Vaikunta Ekadasi - Sakshi

విద్యుద్దీపాలంకరణలో శ్రీవారి ఆలయం

కలియుగ వైకుంఠం తిరుమల వైకుంఠ ఏకాదశికి సిద్ధమైంది. సోమవారం వైకుంఠ ఏకాదశి, మంగళవారం ద్వాదశి దర్శనాలకు లక్షలాదిగా విచ్చేసే భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. సోమవారం వేకువజామున శ్రీవారికి ఏకాంతంగా పూజాది  కైంకర్యాలు నిర్వహించిన అనంతరం 2 గంటలకే దర్శనాన్ని ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏటా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలలో మాత్రమే తెరిచి ఉంచే వైకుంఠ ద్వార దర్శనానికి సామాన్యులు, వీఐపీలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. వైకుంఠ ఏకాదశికి టీటీడీ భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లు, వసతులపై  ప్రత్యేక కథనం..                

సాక్షి, తిరుమల: భక్తుల శరణాగతుడైన శ్రీనివాసుడు వెలసి ఉన్న పుణ్యక్షేత్రం తిరుమల కొండ. ఇలవైకుంఠంగా పేరుగాంచిన తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. వైకుంఠ ద్వారం ద్వారా వెళ్లి దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. మహావిష్ణువుకు ఏకాదశి, ద్వాదశి అతి ముఖ్యమైనవి. ధనుర్మాస నెలలో వచ్చే ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో దేవతల ద్వారంగా పేర్కొనే ఉత్తర ద్వారాన్ని వైష్ణవ ఆలయాల్లో తెరిచి ఉంచుతారు. ఆ రోజున స్వామివారు ప్రత్యేకంగా ఉత్తర ద్వారం ద్వారా వెలుపలికి వచ్చి భక్తులకు దర్శమిస్తారు.

ఇదే సమయంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో వైకుంఠ ద్వారం నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. వైకుంఠద్వార ప్రవేశంతో పాటు స్వామివారి గర్భాలయ ప్రాకారాన్ని స్పృశించే భాగ్యం భక్తులకు కలుగుతుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణ రథంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శమిస్తారు. ద్వాదశి పర్వదినాన వేకువజామున స్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. ద్వాదశి నాడు ముల్లోకాలలో ఉన్న పుణ్య నదులన్నీ స్వామివారి పుష్కరిణిలో కలుస్తాయని వరాహ పురాణం చెబుతోంది. ఆరోజు పుష్కరిణిలో స్నానమాచరిస్తే పుణ్యఫలాలు దక్కుతాయని భక్తుల విశ్వాసం. 

సర్వాంగ సుందరం..  
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దాదాపు 12టన్నుల పుష్పాలతో ఆలయం, అనుబంధ ఆలయాలను పరిమళభరిత పుష్పతోరణాలు, పలు రకాల పండ్ల తోరణాలతో శోభాయమానంగా అలంకరిస్తున్నారు. ఇల వైకుంఠాన్ని తలపించేలా విద్యుద్దీపాలంకరణలతో కొండ ప్రకాశిస్తోంది. ప్రధాన రహదారులన్నీ విద్యుత్‌ వెలుగులతో దేదీప్యమానంగా దర్శనమిస్తున్నాయి. వైకుంఠ ద్వారాలతో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గోవిందమాల భక్తులు ఇరుముడులను చెల్లించేందుకు ఆలయం వెలుపల హుండీలను ఏర్పాటు చేశారు. వాహన మండపంలో శ్రీదేవి,భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.


 

పటిష్ట బందోబస్తు 
వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 2500 మంది సిబ్బందితో బందోబస్తుకు నియమించారు.మరో 200మంది స్పెషల్‌ పార్టీ పోలీసులతో ప్రముఖులకు బందోబస్తును కల్పిస్తున్నారు. ఘాట్‌ రోడ్లలో నిరంతరాయంగా కూంబింగ్‌ నిర్వహించేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. దొంగతనాలను ఆరికట్టడానికి ప్రత్యేకంగా స్పెషల్‌ క్రైం టీంలను ఏర్పాటు చేసి   ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నిరంతరం సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేయనున్నారు.

4 రోజులు ఆర్జిత సేవలు రద్దు 
5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆర్జితసేవలు, ప్రత్యేక దర్శనాలు, టైమ్‌స్లాట్, దివ్యదర్శనాలను టీటీడీ పూర్తిగా రద్దు చేసింది. ద్వాదశి నాడు మాత్రం 2,500 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఇప్పటికే ఆన్‌లైన్‌లో భక్తులకు కేటాయించింది. ఈ రెండు రోజుల్లో కేవలం సర్వదర్శనం ద్వారానే భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. పూజాది కార్యక్రమాలు, నైవేద్యం, విశ్రాంతి, ప్రముఖుల దర్శనాలను మినహాయిస్తే దాదాపు 43గంటల పాటు సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వచ్చిన ప్రతి భక్తుడికి దర్శనం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.


 

వీఐపీలు నేరుగా వస్తేనే పాసులు 
వీఐపీల కోసం ప్రత్యేకంగా పద్మావతి అతిథి గృహం ప్రాంతంలోని రామరాజు, సీతా నిలయం వద్ద ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇక్కడే వసతి, దర్శన పాసులను జారీ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రోటోకాల్‌ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వస్తేనే 6 టిక్కెట్లు, అధికారులకు 4టిక్కెట్లను జారీ చేయనున్నారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఇప్పటికే దాదాపు 20 మందికి పైగా న్యాయమూర్తులతో పాటు  20మంది మంత్రులు, దాదాపు 150మందికి పైగా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు వస్తున్నట్లు టీటీడీకి సమాచారం అందింది.

సర్వదర్శనం ఇలా.. 
సర్వదర్శనం క్యూకు సంబంధించి ఎంబీసీ 26 వద్ద నుంచి ప్రవేశించే భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి వదులుతారు. క్యూ కాంప్లెక్స్‌ 1,2లోని 60 కంపార్ట్‌మెంట్లలో దాదాపు 30 వేల మంది భక్తులు వేచి ఉండే అవకాశం ఉంది. నారాయణగిరి ఉద్యానవనం, కల్యాణవేదిక కలిపి మొత్తం 85వేలమంది భక్తులు కూర్చునేలా షెడ్లు ఏర్పాటు చేశారు. వైకుంఠ ద్వార దర్శనానికి ముందు రోజు నుంచే భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. 5వ తేదీ ఉదయం నుంచే వీరిని కంపార్ట్‌మెంట్లలోకి వదులుతారు. వీరికి శ్రీవారి దర్శనం భాగ్యం 6 తేదీ ఉదయం 5గంటల నుంచి ప్రారంభం అవుతుంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement