విద్యుత్‌కాంతులతో ధగధగలాడుతున్న తిరుమల శ్రీవారి ఆలయం
ఉదయం: 4 గంటలు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలంగాణ మంత్రి హరీష్ రావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆంద్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్రా, కర్ణాటక సీజే రితురాజ్ అవస్థి, త్రిపురా హైకోర్టు సీజే జస్టిస్ అమర్‌నాథ్ గౌడ్, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, గృహనిర్మాణ శాఖ మంత్రి రంగనాధ్ రాజు, మంత్రి గౌతమ్ రెడ్డి, కార్మిక శాఖమంత్రి గుమ్మనూరి జయరామ్, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, అప్పల్ రాజు, అనీల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎమ్మెల్యేలు రోజా, సంజీవయ్య, ఎంపీలు మార్గాని భారత్, కొత్త ప్రభాకర్, వెంకటేష్, సత్యవతి, గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, మాజీ మంత్రి సునీత లక్ష్మా రెడ్డి, తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తులు
తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్‌ఉమేష్ లలిత్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్రశర్మ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనార్థం బుధవారం రాత్రి తిరుమల చేరుకున్న కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు.
తిరుమల/సాక్షి, అమరావతి: వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) పర్వదినానికి తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దాదాపు 12 టన్నుల పుష్ప తోరణాలు, వివిధ రకాల పండ్లతో శ్రీవారి ఆలయం, అనుబంధ ఆలయాలు, పరిసరాలను శోభాయమానంగా అలంకరించారు. వైకుంఠాన్ని తలపించేలా విద్యుద్దీప కాంతులతో తిరుమల ప్రకాశిస్తోంది. వైకుంఠద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్‌ఉమేష్ లలిత్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్రశర్మ, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థి తిరుమల చేరుకున్నారు.
బుధవారం అర్ధరాత్రి తరువాత 1.45 గంటల నుంచి..
బుధవారం అర్ధరాత్రి తరువాత 1.45 గంటల నుంచి ఆలయంలోని వైకుంఠద్వారాలు (ఉత్తర ద్వారాలు) తెరుచుకోనున్నాయి. కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ 10 రోజులపాటు భక్తులకు ఉత్తరద్వారం నుంచి శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగా గురువారం వేకువన తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి ఏకాంతంగా ధనుర్మాస కైంకర్యాన్ని నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అనంతరం ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తారు.
సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు సహస్ర దీపాలంకరణ సేవ జరగనుంది. అనంతరం స్వామి ఉభయ దేవేరులతో కలిసి తిరుచ్చిపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. శుక్రవారం ద్వాదశి రోజున ఏకాంతంగా చక్రస్నానం నిర్వహిస్తారు. ఉదయం 4.30 నుంచి 5.30 గంటల వరకు శ్రీచక్రత్తాళ్వారును మాడవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి వరాహస్వామి ఆలయం వద్ద కొలువుదీర్చి విశేష పూజలు చేస్తారు. అనంతరం పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. కోవిడ్ నిబంధనల మేరకు భక్తులను పుష్కరిణిలోకి అనుమతించడం లేదని టీటీడీ ప్రకటించింది.
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పుష్పాలతో అలంకరించిన శ్రీవారి ఆలయ ధ్వజస్తంభం
శ్రీవారి ఏకాంతసేవలో సుప్రీంకోర్టు సీజే
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ బుధవారం రాత్రి తిరుమల శ్రీవారిని ఏకాంతసేవలో దర్శించుకున్నారు. అంతకుముందు తిరుమలకు చేరుకున్న ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద పుష్పగుచ్ఛంతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి తదితరులు స్వాగతం పలికారు. ఆయన వెంట ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా తదితరులున్నారు. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయంలో జస్టిస్ ఎన్వీ రమణకు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, కలెక్టర్ హరినారాయణన్, అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి స్వాగతం పలికారు.
పద్మావతి అతిథి గృహంలో జస్టిస్ ఎన్వీ రమణతో మాట్లాడుతున్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ,ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి
వైష్ణవాలయాలు ముస్తాబు
ముక్కోటి ఏకాదశి వేడుకలకు రాష్ట్రంలోని వైష్ణవాలయాలన్నీ ముస్తాబయ్యాయి. శ్రీవేంకటేశ్వరస్వామి, లక్ష్మీనరసింహస్వామి తదితర వైష్ణవ సంప్రదాయ ఆలయాల్లో ముక్కోటి ఏకాదశిని పెద్ద పండుగగా నిర్వహించడం సంప్రదాయం. అన్ని వైష్ణవ ఆలయాల్లోను గురువారం వేకువజాము నుంచి ఉత్తరద్వార దర్శనాలకు దేవదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. తిరుమలతోపాటు ద్వారకా తిరుమల, సింహాచలం, వేదాద్రి, అంతర్వేది, అప్పనపల్లి, నరసాపురంలోని జగన్నాథస్వామి ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment