
తిరుమల: ఈ నెల 25న సూర్యగ్రహణం, నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా ఆయా రోజుల్లో 12 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు మూసివేస్తారు. 25న సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ కారణంగా ఉదయం 8.11 నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేస్తారు. అలాగే, నవంబర్ 8న మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉన్న కారణంగా ఉదయం 8.40 నుండి రాత్రి 7.20 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు.
ఈ రెండు రోజులూ ఆలయ తలుపులు తెరిచిన తరువాత సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులను మాత్రమే స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ రెండు రోజులూ బ్రేక్ దర్శనం, శ్రీవాణి, రూ.300 దర్శనం, ఇతర ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. గ్రహణం రోజుల్లో తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇతర ప్రాంతాల్లో కూడా అన్నప్రసాద వితరణ ఉండదు. హోటళ్లు కూడా గ్రహణం పూర్తయ్యే వరకు మూసి ఉంచుతారు. దీనికనుగుణంగా తిరుమల యాత్రను రూపొందించుకోవాలని భక్తులను టీటీడీ కోరింది.
శ్రీవారి దర్శనానికి 30 గంటలు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. 32 క్యూ కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 83,223 మంది శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోగా.. 36,658 మంది భక్తులు తలనీలాలు ఇచ్చారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.4.73 కోట్లు సమర్పించారు. దర్శనానికి 30 గంటలు.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.
తిరుమలేశుని సేవలో ప్రముఖులు
శ్రీవారిని మంగళవారం పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్, విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటాలతో సత్కరించారు.