సాక్షి, తిరుపతి/తిరుమల: ఎట్టకేలకు టీటీడీ దిగొచ్చింది. భక్తుల ఒత్తిడితో మహాసంప్రోక్షణ జరిగే ఆరురోజులు పరిమిత సంఖ్యలో భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని పాలకమండలి నిర్ణయించింది. రోజుకు కొన్ని గంటలే శ్రీవారి దర్శన భాగ్యం కల్పించనున్నట్లు వెల్లడించింది. సర్వదర్శనం క్యూలో వచ్చే భక్తులకు మాత్రమే అవకాశం కల్పించనున్నట్లు ప్రకటించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టదిగ్బంధన బాలాలయ మహా సంప్రోక్షణ సందర్భంగా వచ్చే నెల 11 నుంచి 16 వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈనెల 14న పాలకమండలి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో టీటీడీ భక్తుల నుంచి అభిప్రాయాలు తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటామని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. దీనిలో భాగంగా మంగళవారం మరోసారి తిరుమల అన్నమయ్య భవన్‌లో టీటీడీ పాలకమండలి సమావేశమైంది.
మహా సంప్రోక్షణ సమయంలో పరిమిత సంఖ్యలో భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కల్పించనున్నట్లు టీటీడీ చైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రకటించారు. ఎంత మందికి అనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా వచ్చే భక్తులకు మాత్రమే స్వామి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. ఆరు రోజుల్లో రూ.300 ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవలు, టైంస్లాట్, దివ్యదర్శనం ప్రత్యేక దర్శనాలన్నీ రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆగస్టు 11న 9 గంటలు, 12వ తేదీన 4 గంటలు, 13న 4 గంటలు, 14వ తేదీ 6 గంటలు, 15వ తేదీ 6 గంటలు, 16వ తేదీ 4 గంటల సమయం మాత్రమే భక్తులకు శ్రీవారి దర్శనానికి అవకాశం ఉంటుంది. అభిప్రాయ సేకరణలో 33 శాతం మంది భక్తులు అవకాశం ఉన్న సమయంలో దర్శనం కల్పించమని కోరినట్లు వివరించారు.
సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలు..
- వరలక్ష్మీ వ్రతం, శ్రావణ పౌర్ణమి సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆగస్టు 23 నుంచి 26 వరకు ఏపీ, తెలంగాణలో మనగుడి కార్యక్రమం నిర్వహణ.
- హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణలో ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందించే జిల్లా, మండల ధర్మ ప్రచార మండలి సభ్యుల నిర్వాహక వర్గం పునర్వ్యవస్థీకరణకు ఆమోదం.
- తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో రెండేసి చొప్పున అర్చక పోస్టులు, శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మూడు, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామి ఆలయంలో రెండు చొప్పున అర్చక పోస్టుల భర్తీకి నిర్ణయం.
పరిమితంగా శ్రీవారి దర్శనం
Published Wed, Jul 25 2018 2:45 AM | Last Updated on Wed, Jul 25 2018 7:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment