ద్వారకాతిరుమల : శ్రీవారి ఆలయ ఉద్యోగుల సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దయ్యాయి. ఈ మేరకు ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు శుక్రవారం నిర్ణ యం తీసుకున్నారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారన్న ఆరోపణలతో ఆలయ ఏఈవో ఎం.దుర్గారావు, సూపరింటెండెంట్ వి.నగేష్, ఎలక్ట్రికల్ ఏఈ టి.సూర్యనారాయణ, ఈవో సీసీ ఎ.శ్రీనివాసరావు, ఈవో డ్రైవర్ వి.శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ ఆలయ పాలకవర్గ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు గురువారం సస్పెండ్ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తమకు అన్యాయం జరిగిందంటూ బాధిత ఉద్యో గులు ఆంధ్రప్రదేశ్ ధార్మిక చట్టం 30/87లో సెక్షన్ 37(3)(ఏ) ప్రకారం ఆలయ శుక్రవారం అప్పీల్ చేశారు. దీనిని పరిశీలించిన చైర్మన్ సుధాకరరావు సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దుచేస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారని ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఇదిలావుండగా, సస్పెన్షన్‌ను నిరసిస్తూ మూకుమ్మడి సెలవు పెట్టిన 127 మంది ఉద్యోగులు శుక్రవారం విధులకు హాజరుకాకపోవడంతో ఆలయ కార్యాలయం వెలవెలబోయింది. కాంట్రాక్టు ఉద్యోగులే భక్తులకు సేవలందించారు. రద్దీ పెద్దగా లేకపోవడంతో ఎవరికీ ఇబ్బందులు కలుగలేదు. ఆలయ చైర్మన్ తాజా నిర్ణయం నేపథ్యంలో ఉద్యోగులంతా శనివారం నుంచి యథావిధిగా విధులకు హాజరుకావాలని నిశ్చయించుకున్నారు.
ఈవోకు కాపు సంఘం వినతి
ఇదిలావుండగా, ఉద్యోగులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కాపు సంఘ నాయకులు శ్రీవారి ఆలయం వద్ద శుక్రవారం ఆందోళనకు దిగారు. రాజకీయ నాయకులు కక్షగట్టి ఉద్యోగులను సస్పెండ్ చేయించడం అన్యాయమని, ఉద్యోగులకు రాజకీయ రంగు పులమడం సరికాదని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ గతంలో ఎంతోమంది జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీలు పనిచేసినా ఎప్పుడూ ఇంత రాద్ధాంతం జరగలేదని, ఇప్పుడు మాత్రమే ఎందుకు జరుగుతోందో ఆ నాయకులు ఆలోచించుకోవాలని అన్నారు. వందలాది మంది ఉద్యోగులు ఆందోళన చేస్తే.. గిట్టనివారిని ఎంపిక చేసి సస్పెండ్ చేయించడం అన్యాయమన్నారు. అభివృద్ధి పనుల ద్వారా ప్రజల్లోకి వెళ్లాల్సిన నాయకులు వివాదాలతో ఇలా రచ్చకెక్కడం మంచిది కాదని హితవు పలికారు. అనంతరం ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావును కలసి బాధిత ఉద్యోగులకు న్యాయం చేయాలని వినతిపత్రం అందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాపు సంఘం మండల శాఖ అధ్యక్షుడు పుప్పాల మురళీధరరావు, నాయకులు రుద్ర వెంకట శివాజీ, చిలుకూరి చంద్రం, పెద్దిరెడ్డి నాగేశ్వరరావు, చిలుకూరి ధర్ములు, ఉక్కుర్తి వెంకట్రావు, రాజేష్, బాబి, శ్రీను, ఏసు తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ ఖండన
నాయకులు తమ ఆధిపత్యం కోసం ఆలయాల్లో రాజకీయాలను చొప్పించడం తగదని సీఐటీయూ నాయకులు పేర్కొన్నారు. సీఐటీయూ బృందం శుక్రవారం ఇక్కడకు చేరుకుని ఆలయంలో చోటుచేసుకున్న పరిణామాలపై ఆరా తీసింది.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.లింగరాజు, రైతు సంఘ నాయకుడు కట్టా భాస్కరరావు మాట్లాడుతూ రాజకీయ ఆధిపత్యం కోసం ఆలయ ఉద్యోగులను బలి చేయడం దారుణమన్నారు. ఉద్యోగులు, కార్మికులు ఐక్యంగా ఉంటూ ఇలాంటి ఘటనలను ఎదుర్కోవాలన్నారు. సస్పెన్షన్లను ఎత్తివేయడంపై హర్షం వ్యక్తం చేశారు.
సస్పెన్షన్లు ఎత్తివేత
Published Sat, Sep 26 2015 1:41 AM | Last Updated on Sun, Sep 3 2017 9:58 AM
Advertisement
Advertisement