తిరుమలలో శ్రీవారి దర్శనం కొందరికే పరిమితమైంది. తోపులాట లేకుండా మంచి దర్శనం కల్పిస్తామని చెప్పి టైంస్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన నాటి నుంచి నేటి వరకు శ్రీవారిని దర్శనం చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. గతంలో లక్ష మందికిపైగా భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుంటుంటే, ప్రస్తుతం 50 నుంచి 80 వేలకు పరిమితమైంది. దీంతో వేలాది మంది భక్తులు రోజుల తరబడి వేచి ఉండలేక, గదులు దొరక్క తిరుమలలోని అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించి, కొబ్బరికాయకొట్టి శ్రీవారికి నమస్కరించి వెనుదిరిగి వెళ్తున్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. – సాక్షి, తిరుపతి
వేసవి సెలవులు ముగుస్తుండడంతో వచ్చే నెల 11లోపు ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. పదిరోజులుగా తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. అయితే భక్తులకు సరిపడా గదులు అందుబాటులో లేవు. తిరుమలలో మొత్తం గదులు 6 వేలు, మఠాలు 16 వేలు అందుబాటులో ఉన్నాయి. రోజువారీ గదుల కేటాయింపు 500కి మించటం లేదు. దీంతో మఠాలు, గదులు నిండిపోగా, వేలాది మంది భక్తులు తిరుమలలోని షెడ్లు, చెట్లు, బస్టాండు ప్రాంతాల్లో సేదదీరుతున్నారు. మరికొందరు తిరుపతిలో ప్రైవేటు హోటళ్లలో గదులను అద్దెకు తీసుకుంటున్నారు. అవీ దొరకని వారు స్వామి దర్శనం చేసుకోకుండానే వెనుదిరుగుతున్నారు.
అందని అన్నప్రసాదాలు
అన్న ప్రసాదాలు కూడా భక్తులకు పూర్తిస్థాయిలో అందటం లేదని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ మాత్రం రోజుకు సుమారు 5 లక్షల మందికి అన్న ప్రసాదాలు అందజేస్తున్నట్లు చెబుతోంది. ఈ లెక్కన తిరుమలలో లక్షల మంది భక్తులు ఉండాలి. అయితే దర్శనం మాత్రం రోజుకి 50 వేల నుంచి 80 వేల మందికి మాత్రమే కల్పిస్తున్నారు. వారం రోజులుగా తిరుమలలో శ్రీవారి దర్శన సమయాలను పరిశీలిస్తే 36 గంటల నుంచి 58 గంటల సమయం పట్టేది. బుధవారం నాటికి 26 గంటలకు చేరింది.
అధ్వానం.. టైంస్లాట్
తోపులాటలు నివారించేందుకు టీటీడీ గతనెల మొదటి వారంలో టైంస్లాట్‌ను అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం కాలినడకన వెళ్లే భక్తులకు రోజుకు 20 వేల మందికి దివ్యదర్శనం టోకెట్లు ఇస్తున్నారు. తిరుపతి, తిరుమలలో మరో 60 వేల మంది భక్తులు సర్వదర్శనం చేసుకుంటున్నారు. సాంబశివరావు ఈవోగా ఉన్నప్పుడు రోజూ 1.05 లక్షల మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకునేవారు. క్యూలైన్‌ను నిరంతరం కొనసాగించేవారు. బ్రేక్ దర్శనాలు ఉన్నా.. సర్వదర్శనానికి ఆటంకం కలిగేది కాదని టీటీడీ సిబ్బంది అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం టైంస్లాట్ విధానం అమలులోకి వచ్చింది మొదలు రోజుకు 50 నుంచి 80 వేల మందికే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. క్యూలైన్‌పై పర్యవేక్షణ కొరవడిందనే ప్రచారం జరుగుతోంది. విచ్చలవిడిగా బ్రేక్‌దర్శనాలు ఇస్తూ.. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యానికి దూరం చేస్తున్నారని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంగప్రదక్షిణంపై ఆంక్షలు
శ్రీవారి ఆలయంలో రోజూ నిర్వహించే అంగప్రదక్షిణం మొక్కులపై టీటీడీ ఆంక్షలు విధించింది. ఇది వరకు రోజుకు 750 మంది భక్తులు ఆంగప్రదక్షిణ చేసుకునేవారు. ప్రతి శుక్రవారం అర్ధరాత్రి దాటాక శనివారం వేకువజామున అంగప్రదక్షిణ చేసుకుని స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేవారు. అయితే టీటీడీ తాజాగా ఒక భక్తుడు నెలలో ఒకసారి మాత్రమే అంగప్రదక్షిణకు రావాలన్న నిబంధన పెట్టారు. స్థానిక భక్తులు టీటీడీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానికులకు నెలలో రెండు పర్యాయాలు శ్రీవారి దర్శనాన్ని కల్పించాలన్న దశాబ్దాల డిమాండ్‌ను పక్కనపెట్టిన టీటీడీ.. స్వామి వారి అంగప్రదక్షిణ మొక్కుకూడా ఆంక్షలు విధించటమేమిటని భగ్గుమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment