
‘తుఫాన్’సినిమాకు విభజన సెగ
చిత్ర ప్రదర్శనను అడ్డుకున్న ఉద్యమకారులు
సాక్షి నెట్‌వర్క్: కేంద్రమంత్రి చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ తేజ నటించిన ‘తుఫాన్’ చిత్ర ప్రదర్శనకు విభజన సెగ అంటుకుంది. చిరంజీవి తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ తెలంగాణలోనూ, సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయలేదంటూ సీమాంధ్రలోనూ పలు ప్రాంతాల్లో ఆ చిత్ర ప్రదర్శనను అడ్డుకున్నారు. సినిమా పోస్టర్లను దగ్ధం చేశారు. కొన్ని ప్రాంతాల్లో థియేటర్లపై దాడిచేసిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వికారాబాద్‌లోని సినీమాక్స్, శైలజ థియేటర్లలో శుక్రవారం ఉదయం 11 గంటలకు మార్నింగ్ షో ప్రారంభం కాగానే తెలంగాణవాదులు థియేటర్‌లోకి దూసుకుపోయారు. వారు తెరకు అడ్డుగా నిలవడంతో ప్రేక్షకులంతా బయటకు వచ్చారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని శకుంతల థియేటర్ వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో కొందరు థియేటర్ అద్దాలను ధ్వంసం చేశారు. రాష్ర్టంలోని పలు జిల్లాలలో సినిమా ప్రదర్శనను నిరసనకారులు అడ్డుకున్నారు.