విభజన రాజకీయ కుట్ర: గొల్ల బాబురావు | State division is part of political conspiracy, says Golla Babu rao | Sakshi
Sakshi News home page

విభజన రాజకీయ కుట్ర: గొల్ల బాబురావు

Published Wed, Jan 22 2014 3:52 AM | Last Updated on Mon, Sep 17 2018 4:52 PM

విభజన రాజకీయ కుట్ర: గొల్ల బాబురావు - Sakshi

విభజన రాజకీయ కుట్ర: గొల్ల బాబురావు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని విభజించాలన్నది రాజకీయ కుట్రలో భాగమేనని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు మండిపడ్డారు. ఎన్నికల ముంగిట్లో హడావుడిగా విభజన బిల్లు తీసుకుని రావాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు- 2013’పై తమ పార్టీ చర్చలో పాల్గొంటే విభజన బిల్లుకు సహకరించినట్లేనని, అందుకే తాను అభిప్రాయం మాత్రమే చెప్తానని అన్నారు.
 
 రాష్ట్ర ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. సమైక్య తీర్మానం చేయాలని స్పీకర్‌ను, ముఖ్యమంత్రిని పలుమార్లు కోరినా వారు పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్ర సరిహద్దులు తెలియని వారు రాష్ట్ర విభజన చేశారని ఆరోపించారు. ఇంట్లో దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడన్నట్లు... ఈ విభజనకు సహకరిస్తున్న పెద్దలు చాలా మంది ఉన్నారని వివరించారు. ‘‘కేంద్రంలో యూపీఏ రెండుసార్లు అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ సహకరిస్తే.. ఇప్పుడు వారి గొంతు కోస్తూ, తెలుగుజాతిని నిలువునా నరికేస్తున్నారు. ఆర్టికల్ 3ను సవరించాల్సిన అవసరం ఉంది. ఇదే అంశంపై మా పార్టీ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోని పలు రాజకీయ పార్టీల నాయకులను కలసి విజ్ఞప్తి చేశారు.  
 
 రాష్ట్రాలు ఏర్పడాలంటే.. ఎస్సార్సీ లేదా జ్యుడీషియల్ కమిషన్ లేదా శాసనసభ తీర్మానం ద్వారా మాత్రమే ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇంతకుముందు రెండో ఎస్సార్సీ వేయాలన్న కాంగ్రెస్ ఇప్పుడు మాట ఎందుకు మార్చింది? ఏ లబ్ధి కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారు? తెలంగాణ వాదం ఎలా ఉందో.. సమైక్యవాదం అంతే బలంగా ఉంది. సమైక్యాంధ్ర ముసుగులో రాష్ట్ర పాలకులు డూడూ బసవన్న అంటున్నారు. తెలంగాణలో ఎన్ని ఇబ్బందులున్నా మేము సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నాం. పాలకులు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు మాత్రం రాజకీయ లబ్ధి, అధికార దాహంతో ప్రజల గురించి పట్టించుకోవడం లేదు. వైఎస్ జగన్ సమైక్యాంధ్ర పేరిట ప్రజల్లో చైతన్యం తీసుకుని వస్తున్నారు. విభజన బిల్లును ఆపాలంటే ఓటింగ్‌కు పట్టుపడాల్సిందే. అలా జరిగితేనే రాష్ట్రపతికి, కేంద్ర ప్రభుత్వానికి విషయం బోధపడుతుంది. రాష్ట్రంలో విభజన రాజకీయం, భజన రాజకీయం, చీకటి రాజకీయాలు నడుస్తున్నాయి. రాజశేఖరరెడ్డి వంటి సమర్థుడైన నాయకుడు లేకే విభజన ఉద్యమాలు వచ్చాయి. 2014 ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయ’’ని అన్నారు.  
 
 ఓటింగ్‌కు పట్టుబట్టిన వైఎస్సార్ సీపీ
 సభ ప్రారంభం కాగానే వైఎస్సార్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దీంతో ఆ పార్టీ సభ్యులు ఓటింగ్ జరపాలన్న డిమాండ్‌తో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో సభను స్పీకర్ పావుగంట పాటు వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement