
మున్సిపోల్స్‌పై ఈసీ కసరత్తు
నేడు ఉన్నతాధికారులతో రమాకాంత్‌రెడ్డి సమీక్ష.. రేపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలు సజావుగా, సాఫీగా నిర్వహించడానికి వీలుగా రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేపట్టింది. ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసిన నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమావేశమై శాంతిభద్రతలు, ఆర్థికాంశాలు, పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది తదితర అంశాలపై చర్చించేందుకు సమాయత్తమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి బుధవారం డీజీపీ బి.ప్రసాదరావు, ఆర్థిక, పురపాలక శాఖల ముఖ్యకార్యదర్శులు అజయ్ కల్లం, సమీర్‌శర్మ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డెరైక్టర్ జనార్దన్‌రెడ్డి, ఇతర అధికారులతో భేటీ అవుతున్నారు.
నామినేషన్లు, ప్రచారం, ఎన్నికల వ్యయం, మద్యం, నిఘా ఏర్పాట్లు, నియమావళి పకడ్బందీగా అమలు వంటి అంశాలపై చర్చిస్తారు. ఇదిలాఉండగా హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో రమాకాంతరెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఓటర్ల జాబితాల ప్రచురణ, పోలింగ్ కేంద్రాలు, మున్సిపల్ కార్పొరేషన్లలో రిటర్నింగ్ అధికారులు, మున్సిపాలిటీలకు ఎన్నికల అధికారుల నియామకం, ఈవీఎంల లభ్యత, ఎన్నికల మెటీరియల్ పంపిణీ తోపాటు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిధులు, పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ తదితర అంశాలను చర్చిస్తారు.
ఓటు వేసేందుకు 21 రకాల గుర్తింపు కార్డులు
మున్సిపల్ ఎన్నికల్లో 21 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించినా ఓటు వేయడానికి వీలు కల్పించనున్నారు. ఓటరు గుర్తింపుకార్డు లేనివారు పాస్‌పోర్టు, డ్రైవింగ్ లెసైన్స్, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులకు యాజమాన్యాలిచ్చిన గుర్తింపుకార్డులు, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఎస్సీ, ఎస్టీ సర్టిఫికెట్లు, ఫొటోతో కూడిన పింఛన్ కార్డులు, స్వాతంత్య్ర సమరయోధుల కార్డులు, ఫొటో ఉన్న ఏటీఎం కార్డులు, బార్ కౌన్సిల్ ఇచ్చిన గుర్తింపుకార్డులు, ఉపాధి హామీ పథకం గుర్తింపుకార్డులు, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, స్మార్ట్‌కార్డుల్లో ఏదో ఒకటి చూపించవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.