సాక్షి, విశాఖపట్నం : సందర్శకులను ఆకట్టుకునేందుకు ఏపీ టూరిజం శాఖ విశ్వప్రయత్నాలు చేస్తోంది. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంతో పాటు గతంలో ఆ శాఖ సిబ్బందే ఆందోళనలకు దిగడంతో పర్యాటకశాఖ విపరీతంగా నష్టపోయింది. ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు సమైక్యాంధ్ర సమ్మె కాలంలోనే గదుల అద్దెలో 30 శాతం రాయితీ ప్రకటించి టూరిస్టులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
తాజాగా ఏపీటీడీసీ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి చందనాఖాన్ మరో ఉత్తర్వు జారీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీటీడీసీ పరిధిలో రెస్టారెంట్లు, హోటళ్లలో బసకు దిగితే 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించారు. నిబంధనలు వర్తిస్తాయన్నారు. ఇలా ప్రకటించడం ఆ శాఖ చరిత్రలోనే మొదటిసారి అని సిబ్బంది చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, కుటుంబసభ్యులతో సంతోషంగా ఉండేందుకు వారాంతాల్లో 30 శాతం, మిగతా రోజుల్లో 50శాతం రాయితీపై సౌకర్యం పొందవచ్చని సిబ్బంది చెబుతున్నారు.
ఏపీటీడీసీ పరిధిలో అరకు, రుషికొండ, యాత్రి నివాస్‌లలో త్రీస్టార్ స్థాయి సౌకర్యాలున్నాయి. ఉద్యోగులు తమ ప్రాజెక్టుల్ని సందర్శించే సమయంలో వారి గుర్తింపు కార్డుల్ని కచ్చితంగా చూపించాలన్నారు. వాస్తవానికి ఆగస్టు నుంచి టూరిస్టుల సీజన్ కొనసాగుతుంది. ఇటీవల సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో రెండు నెలల పాటు గదులన్నీ ఖాళీగానే ఉండిపోయాయి. ఇతర ప్రాంతాలనుంచి రావాల్సిన సందర్శకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వోద్యోగులకు రాయితీ ఇవ్వడం ద్వారా వ్యాపారాన్ని మరింత పెంచుకోవచ్చునని ఏపీటీడీసీ భావిస్తోంది.
సిటీ టూర్‌లో థింసా : సందర్శకులకు సిటీ టూర్ ప్యాకేజీలో భాగంగా రుషికొండలోని నిత్యం మధ్యాహ్న భోజన సమయంలో థింసా నృత్యం ప్రదర్శించనున్నారు. గతంలో అరకు (ఆర్‌ఆర్ ప్యాకేజీ)తోపాటు రుషికొండ ప్రాజెక్టు వద్ద వారాంతాల్లో మాత్రమే ఈ ప్రదర్శన ఉండేది. దీనికి భారీగా స్పందన రావడంతో ఇక నుంచి సిటీ టూర్ ప్యాకేజీలో కూడా థింసా నృత్యం ప్రదర్శించనున్నట్టు ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ భీమశంకరరావు తెలిపారు. ఇందుకు ఎలాంటి అదనపు రుసుం వసూలు చేయడం లేదన్నారు. సీజన్‌లోనూ ఈ తరహా ఆఫర్ ఏపీటీడీసీ ప్రకటించడం గమనార్హం.
ప్రభుత్వోద్యోగులకు బంపర్ ఆఫర్
Published Tue, Oct 22 2013 1:43 AM | Last Updated on Sat, Aug 18 2018 8:53 PM
Advertisement
Advertisement