‘మోడల్’కు మోక్షమేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి గత ఏడాది మంజూరైన మరో 234 మోడల్ స్కూళ్లకు మోక్షం లభించే పరిస్థితి కనిపించడం లేదు. ఆర్థిక భారం సాకుతో వాటి నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. 2009లో మంజూరైన 355 స్కూళ్ల నిర్మాణం, నిర్వహణ, వేతనాల్లో 75 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే భరించింది. అయితే గత ఏడాది మంజూరు చేసిన 234 స్కూళ్లకు మాత్రం 50 శాతం నిధులను మాత్రమే ఇస్తామని కేంద్రం పేర్కొంది. దీంతో మంజూరై ఏడాది కావస్తున్నా వాటి నిర్మాణాలపై రాష్ట్ర సర్కారు శ్రద్ధ చూపడం లేదు. సెకండరీ విద్యా శాఖ ప్రతిపాదనలు పంపినా.. వాటిని ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ స్కూళ్లను ప్రారంభించాలంటే ఇప్పటికిప్పుడు నిర్మాణాలు చేపడితే తప్ప సాధ్యం కాదు. ఇంకా ఆలస్యమైతే అసలు ఈ స్కూళ్ల ప్రారంభమే కుదిరే పరిస్థితి లేదు.
రాష్ట్రంలోని అన్ని మండలాలకు స్కూళ్లు..
రాష్ట్రంలో విద్యాపరంగా వెనుకబడిన మండలాలు 737 ఉన్నాయి. ఆ మండలాలు అన్నింటికి మోడల్ స్కూళ్లను మంజూరు చేసేందుకు కేంద్రం 2009 డిసెంబర్‌లోనే అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా అప్పుడే 355 స్కూళ్లను మంజూరు చేసింది. 2011 విద్యా సంవత్సరంలో ప్రారంభం కావాల్సిన ఈ స్కూళ్లు.. నిర్మాణాలు చేపట్టడంలో పాలకుల నిర్లక్ష్యంగా కారణంగా 2013లో మొదలయ్యాయి. అయినా ఇప్పటికీ అన్ని స్కూళ్ల నిర్మాణాలను పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అన్ని వసతులతో 150 స్కూళ్లు కూడా పని చేయడం లేదు. ఈ పరిస్థితుల్లోనే గత ఏడాది డిసెంబర్‌లో మరో 234 స్కూళ్లను మంజూరు చేసింది. అయినా ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు. ఇవి పూర్తి చేస్తే తప్ప మరో 148 స్కూళ్లను కేంద్రం మంజూరు చేసే అవకాశాలు కనిపించడం లేదు.
ఆర్థిక భారమనే ఉద్దేశంతోనే..
ఐదెకరాల స్థలంలో ఏర్పాటు చేయాల్సిన ఒక్కో మోడల్ స్కూల్‌ను రూ. 3.02 కోట్లతో నిర్మించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇలా 234 స్కూళ్లకు రూ. 706 కోట్లు అవసరం. ఇందులో 50 శాతం వాటా (రూ. 353 కోట్లు)ను రాష్ట్రం భరించాల్సిందే. ఇవే కాకుండా నిర్వహణ, టీచర్ల వేతనాల్లో కూడా 50 శాతం నిధులను రాష్ట్రం భరించాలి. అంతకుముందు స్కూళ్లకు 25 శాతం నిధులను మాత్రమే భరించిన రాష్ట్రం.. ఇపుడు 50 శాతం వెచ్చించాల్సి రావడంతో వెనుకడుగు వేస్తోంది. నిర్మాణాల్లోనే కాక స్కూళ్ల నిర్వహణ, వేతనాల్లో కూడా భారాన్ని భరించాల్సి ఉండటంతో రాష్ట్ర సర్కారు కొత్త స్కూళ్ల గురించి పట్టించుకోవడం లేదు.