కాంగ్రెస్ వల్లే రాష్ట్రం అగ్నిగుండమైంది
Published Sun, Sep 1 2013 2:19 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM
జంగారెడ్డిగూడెం రూరల్/ ద్వారకాతిరుమల, న్యూస్‌లైన్ :మహనీయుల ప్రాణత్యాగాలతో ఏర్పడిన రాష్ట్రాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ముక్కలు చేయాలని నిర్ణయించి అగ్నిగుండంలా మార్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు ధ్వజమెత్తారు. సమైక్యాంధ్ర సాధనకై, పదవులు పట్టుకుని వేలాడుతున్న కాంగ్రెస్ నేతలకు కనువిప్పు కలగాలని కోరుతూ జంగారెడ్డిగూడెం నుంచి ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయం వరకు మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన కనువిప్పు పాదయాత్రను ఆయన జంగారెడ్డిగూడెంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ ఈ పాదయాత్రతో ఢిల్లీ పెద్దలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కనువిప్పు కలగాలన్నారు.
ఆసుపత్రిలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం, పోలీసులు గోప్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మద్దాల రాజేష్‌కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు చేపట్టనున్న బస్సుయాత్రకు తెలుగు ప్రజల ఆత్మవంచన యాత్రగా పేరుపెట్టి ప్రారంభించాలన్నారు. బస్సుయాత్రతో జనాల్లోకి వస్తే సీమాంధ్ర ప్రజలు రాళ్లతో తరిమికొడతారన్నారు. పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. గ్రామగ్రామానా సమైక్యవాదులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు మద్దతు తెలిపారు. 500 మంది కార్యకర్తలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాస్కులను ధరించి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు.
తొలుత జంగారెడ్డిగూడెం గంగానమ్మ గుడి సెంటర్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి బాలరాజు, రాజేష్‌కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాదయాత్ర జంగారెడ్డిగూడెం, దేవులపల్లి, కామవరపుకోట తాడిచర్ల మీదుగా 28 కిలోమీటర్లు ప్రయాణించి ద్వారకాతిరుమల చేరింది. చినవెంకన్న ఆలయంలో జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం కుదుటపడాలని, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ స్వామివారికి పూజలు నిర్వహించారు. పార్టీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ పాశం రామకృష్ణ, మండల, పట్టణ కన్వీనర్లు నుల కాని వీరాస్వామి నాయుడు, పాల్గొన్నారు.
అస్వస్థతకు గురైన రాజేష్ ద్వారకాతిరుమల : జంగారెడ్డిగూడెం నుంచి ద్వారకాతిరుమలకు పాదయాత్ర చేసిన రాజేష్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.స్వామివార్ల దర్శనం అనంతరం కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులతో జ్వరానికి గురయ్యారు. దీంతో ఆయన్ను పార్టీ నేతలు ద్వారకాతిరుమల పీహెచ్‌సీ తరలించగా వైద్యులు ప్రథమ చికిత్స చేసి 108 ద్వారా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Advertisement
Advertisement