
గర్భిణులకు పెట్టిన భోజనం రుచి చూస్తున్న అవంతి శ్రీనివాస్, ద్రోణంరాజు శ్రీనివాస్
అది ప్రభుత్వ విక్టోరియా(ఘోషా)ఆస్పత్రి. సమయం మధ్యాహ్నం ఒంటిగంట. ఓపీ సేవలకు వచ్చేవారు.. ఇన్‌పేషెంట్లతో ఆస్పత్రి రద్దీగా ఉంది. ఇన్‌పేషెంట్లు(గర్భిణులు) భోజనం వద్ద కూర్చున్నారు. ఇంతలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆస్పత్రికి ఆకస్మిక తనిఖీకి వచ్చారు. ప్రాంగణాన్ని పరిశీలిస్తూ.. సూపరింటెండెంట్ ఎక్కడ? క్యాంటీన్ ఏది? ముందు భోజనం నాకు చూపించండి. అని ఆరా తీశారు. భోజనం రుచి చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడి అధికారుల పనితీరు బాగులేదంటూ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధికారులపై మండిపడ్డారు.
సాక్షి, విశాఖ దక్షిణ : ఘోషాసుపత్రి నిర్వహణపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. గర్భిణులకు పెట్టే భోజనం బాగులేదన్న విషయం తెలుసుకున్న మంత్రి శనివారం వీఎంఆర్‌డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్‌తో కలిసి ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సూపరింటెండెంట్ చాంబర్ వద్దకు వెళ్లారు. అక్కడ సూపరింటెండెంట్ కనిపించకపోవడంతో కింది స్థాయి అధికారులను పిలిపించారు. వంటశాలను పరిశీలించి అన్నం ఎక్కడుంది? గర్భిణులకు పెట్టే భోజనం తనకు చూపించాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు మోహం తేలేశారు. బయట వండి తెస్తున్నారని చెప్పడానికి కొంత ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత సూపరింటెండెంట్ వచ్చారు. అతనితో కలిసి నేరుగా గర్భిణుల వార్డుల వద్దకు వెళ్లారు. మీ సమస్యలు చెప్పండమ్మా..మీకు ఏం భోజనం పెడతున్నారు? భోజనం బాగుంటుందా? అని అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్ ద్వారా సరఫరా చేస్తున్న ఆహారాన్ని మంత్రి ముత్తంశెట్టి, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ భుజించారు. నాసిరకం భోజనం పెట్టడంపై అసంతృప్తి వ్యక్తపరిచారు. మంచి పోషకాహార విలువలతో కూడిన భోజనం పెట్టాల్సి ఉండగా..నాసిరకం భోజనం పెడతారా? అంటూ మండిపడ్డారు. ఈ వార్డు ఇన్‌చార్జ్ ఎవరు? భోజనం సరఫరా చేసే నిర్వాహకుడు ఏక్కడ? అంటూ ధ్వజమెత్తారు. నెల రోజుల్లో మరలా వస్తా..తీరు మారకపోతే సహించబోనంటూ హెచ్చరికలు జారీ చేశారు.
ఇది సంక్షేమ ప్రభుత్వం
ఇది చంద్రబాబు ప్రభుత్వం కాదు. పేద మధ్య తరగతి..బడుగు..బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆలోచిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావస్తున్నా ఇంకా చంద్రబాబు ..మాజీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ఫొటోలు పెట్టుకున్నావంటే..నీవు ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నావో అర్థమవుతోంది. ఆ ఫొటో చూడగానే ఒళ్లు మండిపోతుంది. ఇంత నిర్లక్ష్యంగా ఉన్నావంటే..ఇక పేషెంట్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతోందంటూ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సూపరింటెండెంట్‌పై మండిపడ్డారు. ఇక నుంచి ఆస్పత్రి ప్రాంగణంలోనే వంట చేసి మంచి భోజనం పెట్టాలని ఆదేశించారు. వంటశాల ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
విద్య, వైద్యానికి ప్రాధాన్యం
వీఎంఆర్‌డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ ఇది చారిత్రక నేపథ్యం ఉన్న ఆస్పత్రి. ఇక్కడి పేషెంట్లు బాగోగులు తెలుసుకోవడానికే వచ్చాం. భోజనం బాగులేక ఇబ్బంది పడతున్నారని మా దృష్టికి వచ్చింది. ఆస్పత్రిలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. అవసరమైన సదుపాయాలు కల్పిస్తారు. వైద్యులు, సిబ్బంది సామాజిక బాధ్యతగా పని చేసి రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. వారి వెంట వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా గురువులు, ఎస్సీ సెల్ నాయకుడు బోని శివరామకృష్ణ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment