393 సహాయక శిబిరాలు..21,025 మందికి వసతి | State-wide government arrangements for migrant workers | Sakshi
Sakshi News home page

393 సహాయక శిబిరాలు..21,025 మందికి వసతి

Published Tue, Apr 7 2020 4:23 AM | Last Updated on Tue, Apr 7 2020 4:23 AM

State-wide government arrangements for migrant workers - Sakshi

వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన క్యాంప్‌లను సందర్శించి వారితో మాట్లాడుతున్న నోడల్‌ అధికారి పీయూష్‌కుమార్‌

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ సమయంలో రాష్ట్రంలో పనుల్లేక చిక్కుకుపోయిన వలస కూలీలకు వసతి ఏర్పాట్లలో ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్‌ రోల్‌ మోడల్‌గా నిలుస్తోంది. రాష్ట్రానికి చెందిన వారే కాకుండా ఇతర రాష్ట్రానికి చెందిన వారికి కూడా జిల్లాల వారి గా ఎక్కడికక్కడ సహాయక శిబిరాలు ఏర్పాటుచేసి వారందరికీ పౌష్టికాహారం అందిస్తోంది. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా 393 సహాయక శిబిరాలను ఏర్పాటుచేసి మొత్తం 21,025 మందికి వసతి ఏర్పాట్లు కల్పించినట్లు రాష్ట్ర వాణిజ్య పన్నుల చీఫ్‌ కమిషనర్, సహాయక శిబిరాల నోడల్‌ ఆఫీసర్‌ పీయూష్‌ కుమార్‌ ‘సాక్షి’కి తెలిపారు.

ఇందులో 12,820 మంది ఇతర జిల్లాల నుంచి ఇక్కడకు పనుల మీద వచ్చి చిక్కుపోయిన వారు ఉండగా, ఇతర రాష్ట్రాల వారు 8,205 మంది ఉన్నట్లు తెలిపా రు. మొత్తం 23 రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు ఈ శిబిరాల్లో ఉన్నారు. ఇందులో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 1,334, తమిళనాడు 1,198, జార్ఖండ్‌ 918, బిహార్‌ 735 మంది ఉన్నారు. కాగా, రాష్ట్రంలో తమిళనాడు ప్రజలకు చేసిన ఏర్పాట్లపై సంతోషం వ్యక్తంచేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ట్విట్టర్‌ ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌కు అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. 

కృష్ణా జిల్లాలోనే 106 శిబిరాలు.. 
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 393 సహాయక శిబిరాలు ఏర్పాటుచేస్తే అందులో ఒక్క కృష్ణాజిల్లాలోనే 106 శిబిరాలు ఏర్పాటుచేశారు. ఇక్కడ అత్యధికంగా 7,061 మంది ఉన్నారు. అత్యల్పంగా వైఎస్సార్‌ జిల్లాలో నాలుగు శిబిరాలు ఏర్పాటుచేశారు. ఈ శిబిరాల్లో భౌతిక దూరం పాటించేలా పడకలు ఏర్పాటుచేశామని, అలాగే అల్పాహారం, భోజనంతోపాటు ఉడకపెట్టిన కోడిగుడ్లు వంటి పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు పీయూష్‌కుమార్‌ వివరించారు.

ఈ శిబిరాలను నిరంతరాయంగా పర్యవేక్షించడానికి అధికారులను నియమించామని.. వీరికి 49,758 మంది సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేవలం ప్రభుత్వమే కాకుండా 95 ఎన్‌జీవో సంస్థలు కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాయన్నారు. ఈ శిబిరాల్లో ఉండే వారికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పీయూష్‌కుమార్‌ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement