వర్షాలు కురుస్తాయనుకున్న రైతుల ఆశల మబ్బులపై నీలినీడలు కమ్ముకున్నాయి. రుతుపవనాలు వస్తాయనికళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న రైతన్న ఆశలు ఆవిరైపోయాయి. వర్షాలు వస్తాయని పొలాలు, దుక్కులు దున్ని అదను కోసం ఎదురు చూస్తున్న కర్షకులకు ఖరీఫ్ కష్టాలు తప్పేటట్టు లేవు. గుండ్లకమ్మ ఒడ్డున లక్షల్లో వరినారు వ్యాపారం జరిగేది. ఈ ఏడాది ఆ భూముల్లో పిచ్చిచెట్లు కూడా మొలవని పరిస్థితి. ఇలాగైతే తిండిగింజలకు కూడా కష్టమే. ఈ నేపథ్యంలో వరుణుడి కరుణ కోసం కర్షకులు ప్రార్థిస్తున్నారు.
నూజెండ్ల,న్యూస్‌లైన్: ఖరీఫ్ సీజన్ రైతులకు కష్టాలను మిగిల్చే సూచనలు కన్పిస్తుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఎక్కడ చూసినా చుక్కనీరు కానరాకపోవడంతో ఖరీఫ్‌లో సాగు కష్టమేనని రైతులంటున్నారు. రుతుపవనాలు వెనుకకుపోవడం, గుండ్లకమ్మ నదిలో నీరు అడుగంటడంతో సాగు ప్రశ్నార్ధకంగా మారింది. ఖరీఫ్‌లో 2400 హెక్టార్లు సాగుబడి కావాల్సి ఉండగా ఇప్పటికి ఒక ఎకరా కూడా సాగు చేసిన దాఖలాలు లేవు విపరీతమైన ఎండలు, వర్షాలు లేక పోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
గతేడాది ఈ సమయానికే గుండ్లకమ్మ నదీ పరివాహక ప్రాంతాలైన తెల్లబాడు, పాతనాగిరెడ్డిపల్లి, జంగాలపల్లి, ఉప్పలపాడు, ములకలూరు, త్రిపురాపురం, ఐనవోలు ప్రాంతాలలో గుండ్లకమ్మ నది కింద బిబిటి 5204 వరిని సాగు చేసేవారు. గుండ్లకమ్మ ఎండిపోయే దశకు చేరుకోవడంతో కనీసం నార్లు కూడా పోయలేని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.
ఐనవోలు గ్రామంలో గుండ్లకమ్మ నది ఒడ్డున లక్షల రూపాయల వరినారు వ్యాపారం జరిగేది. ప్రస్తుతం అక్కడ భూముల్లో పిచ్చి చెట్లు కూడా మొలవని పరిస్థితులు నెలకొన్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు, బావుల కింద కూడా వ్యవసాయం కష్ట తరంగా మారిందని రైతులు వాపోతున్నారు. కనుచూపు మేరలో వర్షాలు పడే అవకాశం లేక రైతులు దిగాలు పడుతున్నారు. గతేడాది ఈ పాటికి పెసర, జీలుగ విత్తనాలు అందుబాటులోకి వచ్చేవి. ప్రస్తుత సీజన్‌లో నేటివరకు విత్తనాలు ఎప్పుడు ఇస్తారనే సందేహాలు రైతులను వేధిస్తున్నాయి. ఒకవైపు విపరీతమైన ఎండలు పెరిగిన ఉష్ణోగ్రతలతో సాగు అనుకూలంగా లేక పొలాలను బీడు భూములుగా వదిలివేయక తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది తిండి గింజలు పండించడం కష్టమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతుల రుణాల మాఫీపై స్పష్టమైన విధానం లేకపోవడంతో చేసిన అప్పులు ఎలా తీరుతాయనే అనుమానాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పాడి పరిశ్రమ పైన ఆధారపడదామనుకుంటే కనీసం పచ్చిగడ్డి వేసేందుకు కూడా వాతావరణం అనుకూలించకపోవడంతో బెంబేలెత్తిపోతున్నారు. వరుణుడు కరుణిస్తే తప్ప తమకు గత్యంతరం లేదంటూ రైతులు దేవుడిని ప్రార్ధిస్తున్నారు.
రైతుల ఆశలు ఆవిరి
Published Sat, May 31 2014 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 AM
Advertisement