ఖరీఫ్ కష్టం!
అన్నదాతకు కష్టకాలమొచ్చింది. ఓ వైపు భానుడు ఇప్పటికీ చండ ప్రచండంగా విరుచుకుపడుతుండ గా, మరోవైపు వరుణుడు కరుణించకపోవటంతో ఖరీఫ్ పంటల పరిస్థితి అగమ్య గోచరంగా తయూరైంది. జూన్ ముగుస్తున్నా.. చుక్క చినుకైనా రాలకపోవటంతో వ్యవసాయ పనులు ముందుకు సాగటం లేదు. సాగునీటి లభ్యతపై అనుమానాల కారణంగా జిల్లాలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయే పరిస్థితి నెలకొంది. ఫలితంగా రానున్న రోజుల్లో సాధారణ జనానికీ ఇబ్బందులు తప్పేలా లేవు.
కొరిటెపాడు(గుంటూరు): ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే కష్టాలెదురవటంతో జిల్లాలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తనాల ధరలు పెరగటం.. బ్యాంకు రుణాల మాఫీపైనా.. కొత్త రుణాల మంజూరుపైనా సందిగ్ధత నెలకొనటంతో ఇప్పటికే తల్లడిల్లుతున్న అన్నదాతలకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు కలవరం కలిగిస్తోంది. మరోవైపు.. వేళాపాళా లేని విద్యుత్ కోతలు భయపెడుతున్నారుు.
సాధారణంగా ఈ సమయానికి రైతులు పొలం పనుల్లో క్షణం తీరిక లేకుండా ఉంటారు. అలాంటిది ఈ ఏడాది ఇప్పటివరకు చిన్న చినుకు కూడా రాలకపోవడంతో వ్యవసాయ పనులు ప్రారంభించలేదు. జూలైలోగా ఖరీఫ్ పంటల సాగు ప్రారంభం కాకపోతే రబీలో కూడా ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఆలస్యమైతే ఖరీఫ్ పంటల దిగుబడి వచ్చే సమయూనికి తుపాన్ల బారిన పడి నష్టపోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. అలాగే రబీలో పెసర, మినుము, జొన్న, మొక్కజొన్న వంటి పంటల ద్వారా వచ్చే ఆదాయం కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ వర్షపాతం పరిస్థితి.. జిల్లాలో జూన్ నెల సాధారణ వర్షపాతం 8.64 సెంటీ మీటర్లు కాగా గతేడాది 11.08 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క మిల్లీమీటరు వర్షం కూడా పడలేదు.
ఆందోళన కలిగిస్తున్న సాగు విస్తీర్ణం.. సాగునీరు అందదేమోనన్న భయం కారణంగా ఈ ఏడాది ఖరీఫ్ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే పరిస్థితి నెలకొనటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 13.85 లక్షల ఎకరాలు కాగా ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 25,778 ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు వేశారు. పత్తి 12,500 ఎకరాలు, నువ్వులు 8,000, ఆముదం 1560, చెరుకు 263, పెసలు 40, ఇతర పంటలు 3,415 ఎకరాల్లో సాగవుతున్నారుు. గత ఏడాది ఇదే సమయానికి 37,500 ఎకరాల్లో వివిధ పంటలు వేశారు.