స్టీరింగ్ కమిటీయే
సాక్షి, హైదరాబాద్: స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తేనే హెల్త్‌కార్డుల సంబంధిత సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశారుు. హెల్త్‌కార్డుల పథకంలో ఉన్న లోపాలు సవరించకుంటే తమకు హెల్త్‌కార్డులే అక్కర్లేదని ప్రభుత్వానికి తేల్చి చెప్పాయి. ఇప్పటివరకు 27 సమావేశాలు జరిగినా ఫలితం లేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. హెల్త్‌కార్డుల పథకంలో ఉన్న లోపాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఆదివారం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. ఆర్థిక, జీఏడీ, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు, దాదాపు 25 సంఘాల నేతలు పాల్గొన్నారు. కేవలం సమావేశాలతో కాలం గడిపేయకుండా సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు కోరారుు. స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నాయి.
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని భాగస్వామ్య సంఘాలతో పాటు ఇరుప్రాంతాల గెజిటెడ్ అధికారులు, పెన్షనర్ల సంఘాలకూ స్టీరింగ్ కమిటీలో చోటు కల్పించాలని సూచించాయి. కమిటీలో 60 శాతం ఉద్యోగులు, 40 శాతం అధికారులు ఉండే విధంగా కూర్పు ఉండాలన్నాయి. స్టీరింగ్ కమిటీ ఏర్పాటుకు సీఎస్ సూత్రప్రాయంగా అంగీకరించారు. అన్ని విషయాలను ముఖ్యమంత్రికి వివరించిన తర్వాత స్పష్టమైన ప్రకటన చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పీఆర్టీయూ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి కత్తి నరసింహారెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, టీజీవో అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరావు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, కార్యదర్శి పద్మాచారి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. రెండు గంటలకుపైగా ఈ భేటీ కొనసాగింది.
ఇదీ చర్చల తీరు..
ఉద్యోగ సంఘాలు: అన్ని రెఫరల్ ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ (ఓపీ) సౌకర్యం కల్పించాలి. అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు మందులు ఇవ్వాలి.
సీఎస్: ఓపీ సౌకర్యం కల్పించడం వల్ల ప్రైవేటు ఆసుపత్రుల్లో అనవసర పరీక్షలు చేసి భారీగా బిల్లులు సమర్పిస్తారు. అందుకనే కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఓపీ సౌకర్యం కల్పించాం. అత్యవసర పరిస్థితుల్లో ఏ రెఫరల్ ఆసుపత్రిలో అయినా వైద్యం చేయించుకోవడానికి అవకాశం ఉంది. 25 దీర్ఘకాలిక వ్యాధులకు మందులు ఇస్తేనే ఏటా రూ.70 కోట్లకుపైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతకు మించితే భారం ఎక్కువవుతుంది. అన్ని జబ్బులకు మందులు ఇవ్వడం సాధ్యం కాదు.
సంఘాలు: 750 రెఫరెల్ ఆసుపత్రుల్లో చికిత్సకు అవకాశం కల్పిస్తామని గతంలో పలు సమావేశాల్లో అధికారులు చెప్పారు. తీరా పథకం అమల్లోకి వచ్చే సమయంలో 457 ఆసుపత్రులే జాబితాలో ఉన్నాయి. అందులో 152 ప్రభుత్వాసుపత్రులే. 347 రకాల చికిత్సలను ప్రభుత్వాసుపత్రుల్లోనే చేయించుకోవాలనే నిబంధన పెట్టారు. కాన్పులు కూడా అక్కడే చేయించుకోవాలనడం అన్యాయం.
సీఎస్: రెఫరల్ ఆసుపత్రుల సంఖ్య పెంచడానికి చర్యలు చేపడతాం. 23 ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులు ప్యాకేజీలు నచ్చక ఈ పథకంలో చేరలేదు. వాటితో చర్చిస్తున్నాం.
సంఘాలు: ఉద్యోగుల డేటా నమోదుకు ఆరోగ్యశ్రీ, ఆర్థిక శాఖ వేర్వేరుగా పోర్టల్స్ ఏర్పాటు చేశాయి. దేంట్లో నమోదు చేసుకోవాలనే విషయంలో ఉద్యోగుల్లో అయోమయం ఉంది. ఆరోగ్యశ్రీ పోర్టల్‌లో ఎస్‌ఆర్ స్కాన్ కాపీలను జత చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులను ప్రభుత్వం దొంగలుగా చూస్తోంది.
సీఎస్: ఏ పోర్టల్‌లో అయినా నమోదు చేసుకోవచ్చు. డేటా బదిలీ చేసుకొనే అవకాశం ఉంది.
సంఘాలు: దంపతులు ఇద్దరూ ఉద్యోగులైతే తల్లిదండ్రులతో పాటు అత్తమామలకూ పథకం వర్తిస్తుందని 174 జీవోలో పేర్కొన్నారు. ఆర్థిక శాఖ జారీ చేసిన 331, 334 జీవోల్లో ఒకరి తల్లిదండ్రులకే అవకాశం అని పేర్కొన్నారు. అత్తమామలకూ వర్తింపజేయాలి.
సీఎస్: ఇద్దరూ ప్రీమియం చెల్లిస్తే వారికీ వర్తింపజేస్తాం.
సంఘాలు: హెల్త్‌కార్డుల పథకం పూర్తిస్థాయిలో అమలయ్యే వరకు మెడికల్ రీయింబర్స్‌మెంట్‌నూ కొనసాగించాలి.
సీఎస్: రీయింబర్స్‌మెంట్ కొనసాగుతుంది.
సంఘాలు: డిప్యుటేషన్, సస్పెన్షన్‌లో ఉన్న ఉద్యోగుల డేటా నమోదుకు అవకాశం లేదు. ఈ ఏడాది మార్చి తర్వాత పదవీ విరమణ చేసిన ఉద్యోగుల డేటా నమోదు కూడా సాధ్యం కావడం లేదు. సర్వీసు రిజిస్టర్‌లో ఉన్న పేరు కంటే ఆధార్ కార్డులో భిన్నంగా ఉంటే డేటా తీసుకోవడం లేదు. పలు జిల్లాల్లో డీడీవో కోడ్స్ పోర్టల్‌లో కనిపించడం లేదు.
సీఎస్: అన్ని రకాల సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాం.