ఎయిమ్స్‌ తరహాలో విమ్స్‌ అభివృద్ధి  | Steps To Develop The Vishakha Institute Of Medical Sciences (VIMS) | Sakshi
Sakshi News home page

ఎయిమ్స్‌ తరహాలో విమ్స్‌ అభివృద్ధి 

Published Fri, Jul 5 2019 11:33 AM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM

Steps To Develop The Vishakha Institute Of Medical Sciences (VIMS) - Sakshi

వైద్య నిపుణులతో మాట్లాడుతున్న వైద్య కమిటీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ సుజాతారావు

సాక్షి, ఆరిలోవ(విశాఖతూర్పు): కొత్త ప్రభుత్వం ఆలోచన మేరకు ఎయిమ్స్‌ తరహాలో విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(విమ్స్‌)ను త్వరితగతిన అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర వైద్య సంస్కరణల నిపుణుల కమిటీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ సుజాతారావు తెలిపారు. గురువారం సాయంత్రం ఆమె ఆధ్వర్యంలో విమ్స్‌ను కమిటీ సందర్శించింది. సభ్యులు డాక్టర్‌ భూమారెడ్డి చంద్రశేఖర్, డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖరరావు, డాక్టర్‌ బి.సాంబశివరెడ్డి, డాక్టర్‌ కాశిరెడ్డి సతీస్‌కుమార్‌రెడ్డి, డాక్టర్‌ దుత్త రామచంద్రరావు, చెంగపల్లి వెంకట్‌ సందర్శించారు.

విమ్స్‌ను పరిశీలించిన అనంతరం ఇక్కడ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.సత్యవరప్రసాద్, కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అర్జున్, ఏఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.వి సుధాకర్, జీవీఎంసీ డీఎంహెచ్‌వో తదితరులతో నిర్వహించిన కమిటీ సమావేశంలో ఎయిమ్స్‌ తరహాలో విమ్స్‌ను తీర్చిదిద్దడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం కేజీహెచ్, విమ్స్‌ వైద్య నిపుణులు, జీవీఎంసీ హెల్త్‌ విభాగం, హెల్త్‌ సిటీ ప్రతినిధులు, జిల్లాలో పలు స్వచ్ఛంద సేవా సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వైద్య నిపుణుల నుంచి ప్రజలకు మెరుగైన వైద్య వైద్య సేవలు అందించడానికి కావాల్సిన సలహాలు, సూచనలు సేకరించారు. 

వైద్యుల సూచనలు..
కేజీహెచ్‌లో మెరుగైన వైద్య సేవల కోసం ప్రభుత్వం దృషిపెట్టాలి.
► ఆంధ్రా మెడికల్‌ కాలేజీలో విద్యార్థులకు సదుపాయాలు కల్పించి, కొరతగా ఉన్న ప్రొఫెసర్ల నియామాకం చేపట్టాలి.
విమ్స్‌లో త్వరలో అన్ని సూపర్‌ స్పెషాలిటీలతో పేదలకు వైద్య సేవలు అందించడానికి సన్నాహాలు చేపట్టాలి.
అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు లేక రోగులు కేజీహెచ్‌కు తరలివస్తున్నారు. అనకాపల్లిలో వెంటిలేటర్ల సదుపాయం ప్రభుత్వ ఆస్పత్రిలో లేదు. ఆ సౌకర్యం అక్కడ మెరుగుపడాలి.
శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో నివసిస్తున్న ప్రజల్లో కిడ్నీ బాధితులు 40 శాతం మంది ఉన్నారు. వారికి మెరుగైన సదుపాయాలు ఇంతవరకు కల్పించ లేదు. అక్కడే డయాలసిస్‌ సెంటర్లు, పరీక్ష కేంద్రాలు, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేయాలి.
30 ఏళ్లుగా సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందిస్తున్న వైద్య నిపుణులకు పదోన్నతులు కల్పించ లేదు. ఇటీవల నియామకమైన జూనియర్‌ వైద్యులతో సమాన కేడర్‌తో పని చేయాల్సి వస్తుంది. పదోన్నతులు కల్పించి ఉత్సాహంగా పనిచేసే వాతావరణం వైద్యుల్లో కల్పించాలి.
పేద రోగులకు అతి తక్కువ ఫీజులతో స్వచ్ఛంద సంఘాలు నిర్వహిస్తున్న ఆస్పత్రులకు ప్రభుత్వం నుంచి సహకారం అందించాలి. అలాంటి వాటిని గుర్తించి ఆరోగ్యశ్రీలో నిబంధనలు సడలించితే బాగుంటుంది.
విశాఖలో డెంటల్‌ కేర్‌కు సంబధించి ప్రభుత్వ వైద్య విభాగాన్ని అందుబాటులోకి తేవాలి.
నగరంలో అందిస్తున్న ఐఎంఏకు ప్రత్యేకంగా శాశ్వత భవనం లేదు. దానికోసం విమ్స్‌లో ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించగలిగితే మేలు జరుగుతుంది.

వినతులు..
విమ్స్‌లో శాశ్వత వైద్యులను నియమించాలని, వారి పదోన్నతులు తదితర వాటిపై ఇక్కడ వైద్యులు వైద్య సంస్కరణల నిపుణుల కమిటీకి వినతిపత్రం అందించారు. దీనికి స్పందించిన కమిటీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ సుజాతారావు ఈ విషయం కమిటీ పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానన్నారు. విమ్స్‌లో పనిచేస్తున్న శానిటరీ వర్కర్లు ఆమెకు వినతిపత్రం ఇచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న 75 మంది వర్కర్లు ఆమెతో మాట్లాడి కాంట్రాక్టర్‌ నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వలేదని, అవి కూడా చాలీచాలని వేతనాలే చెల్లిస్తున్నారని గోడు వెల్లబుచ్చారు. దీనిపై స్పందించిన చైర్‌పర్సన్‌ విమ్స్‌ డైరెక్టర్‌ను విషయం అడిగి తెలుసుకొన్నారు. వారి సమస్య వెంటనే పరిష్కరించాలని సూచించారు.


సమావేశంలో పాల్గొన్న వివిధ విభాగాల వైద్యులు 

ఆరోగ్య సంస్కరణలపై సీఎం దృష్టి..
వైద్యుల సమావేశంలో డాక్టర్‌ సుజాతారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ఆరోగ్య సంస్కరణలపై దృష్టి చారించారని తెలిపారు. నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఉన్నారన్నారు. వైద్య, ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తేడానికి వైద్య సంస్కరణల నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ మార్పుల కోసం ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య నిపుణులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు సహకరించాలని ఆమె కోరారు. వారంతా ఇచ్చిన సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని నివేదిక తయారు చేస్తామన్నారు. దానిని ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా విశాఖలో సమావేశం నిర్వహించినట్లు ఆమె వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement