ఆశల రెక్కలతో... రాజధానికి చక్కర్లు
Published Thu, Apr 10 2014 2:41 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ టిక్కెట్ల కోసం గట్టి పోటీ ఏర్పడింది. ఆ టిక్కెట్ల ఎంపిక ప్రక్రియ చివరి దశకొచ్చింది. టిక్కెట్ల ఖరారు చేయడంలో వైఎస్సార్‌సీపీ ఇప్పటికే ముందంజలో ఉంది. మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా అన్నింటిని దాదాపు ఖరారు చేసింది. టీడీపీ ఆశావహుల్లో మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు ఒక్క ఎంపీ, ఒక ఎమ్మెల్యే స్థానానికి మాత్రమే ఆ పార్టీ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. మిగతా ఎనిమిది నియోజకవర్గాల అభ్యర్థిత్వాలపై సందిగ్ధత నెలకొంది. దీంతో వారంతా పైరవీల్లో నిమగ్నమయ్యారు. హైదరాబాద్ పరుగులు తీస్తున్నారు. ఉదయం విమానమెక్కి సాయంత్రానికి నియోజకవర్గానికొస్తున్న పరిస్థితి నెలకొంది. పార్టీ డబ్బుకు దాసోహమవడంతో ఎప్పుడే నిర్ణయం తీసుకుంటారోనన్న భయంతో అన్ని రకాల శక్తియుక్తులను వినియోగిస్తున్నారు.
టీడీపీ అభ్యర్థుల కసరత్తు కీలక దశలో ఉంది. ఇప్పటికే విజయనగరం ఎంపీ అభ్యర్థిగా పూసపాటి అశోక్‌గజపతిరాజును, నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా పతివాడ నారాయణస్వామినాయుడ్ని ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. కానీ, మిగతా నియోజకవర్గాల అభ్యర్థులను ఎంపిక చేయడంలో తలపట్టుకుంది. గత సంప్రదాయం మాదిరిగానే నామినేషన్లు వేసేంత వరకు అభ్యర్థులను ఖరారు చేయలేని దుస్థితిని ఎదుర్కొంటోంది. మూలిగే నక్కపై తాటి పండు పడినట్టు బీజేపీతో కుదుర్చుకున్న పొత్తులో భాగంగా ఆ పార్టీకి కేటాయించిన గజపతినగరం నియోజకవర్గం వ్యవహారం మరింత తలనొప్పిగా మారింది.
నెల్లిమర్ల తప్ప మిగతా ఏ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ అభ్యర్థులను ప్రకటించలేదు. గజపతినగరం బీజేపీకి కేటాయించకపోతే కొండపల్లి అప్పలనాయుడు, పడాల అరుణ, కరణం శివరామకృష్ణలో ఒకర్ని ఎంపిక చేయాల్సి ఉంది. సాలూరులోగుమ్మడి సంధ్యారాణి, ఆర్.పి.భంజ్‌దేవ్, డీవీజీ శంకరరావు మధ్య పోటీ నెలకొంది. పార్వతీపురంలో బొబ్బిలి చిరంజీవులు,
పేమ్‌బాబు, కొయ్యాన శ్రీవాణి, అలజంగి జోగారావు ప్రధాన ఆశావహులుగా ఉన్నారు. కురుపాంకు సంబంధించి నిమ్మక జయరాజ్, వి.టి.జనార్దన్ థాట్రాజ్ ప్రధాన ఆశావహులు. విజయనగరంలో మీసాల గీత, డాక్టర్ వి.ఎస్.ప్రసాద్, సిటీ కేబుల్ ఎండీ శ్రీనివాసరావు, కర్రోతు నర్సింగరావు పోటీ పడుతున్నారు. శృంగవరపుకోట నియోజకవర్గంలో కోళ్ల లలితకుమారి, రంధి మార్కండేయుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. చీపురుపల్లిలో కె.త్రిమూర్తులరాజు, గద్దే బాబూరావు, కిమిడి మృణాళిని పోటీ పడుతున్నారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఒకరికి మించి టిక్కెట్ ఆశించడంతో ఒకర్ని ఖరారు చేస్తే మిగతా వారంతా ఏం చేస్తారోనన్న భయం టీడీపీ అధిష్టానానికి పట్టుకుంది. కసరత్తు చివరి దశకు రావడంతో స్థానికంగా ఉంటే పని జరిగేది కాదని హైదరాబాద్‌కు పరుగులు తీస్తున్నారు.
సూట్‌కేసులు పట్టుకుని వెళ్లి తమ గాడ్‌ఫాదర్లతో పైరవీలు చేసుకుంటున్నారు. బుధవారం వరకు ఉదయం ప్రచారం, సాయంత్రం హైదరాబాద్ జర్నీ చేస్తూ కనిపించారు. విమానమెక్కి, విమానం దిగడమే పనిగా పెట్టుకున్నారు. అయితే, ప్రాదేశిక ఎన్నికల మలి విడత ప్రచారం కూడా ముగియడంతో ఇప్పుడు ఆశావహులంతా హైదరాబాద్‌కు పరుగులు తీసి, అక్కడే తిష్టవేసే ప్రయత్నం చేస్తున్నారు. టిక్కెట్ ఖరారైన తర్వాతే నియోజకవర్గానికొచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంకొందరు విజయనగరం, హైదరాబాద్ మధ్య చక్కర్లు కొడుతున్నారు. ఇదిలా ఉండగా, టిక్కెట్ వచ్చే అవకాశం లేదని సూచనప్రాయ సంకేతాలు అందుకుంటున్న ఆశావహులు మాత్రం ఒకవైపు ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు ఆంతరంగిక సమావేశాలు నిర్వహించుకుంటున్నారు.
Advertisement