వదలని వాన | still heavy rain in nizamabad | Sakshi
Sakshi News home page

వదలని వాన

Published Fri, Mar 7 2014 2:38 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

still heavy rain in nizamabad

 పగబట్టిన రీతిలో జిల్లాను వడగండ్ల వాన వెంటాడుతోంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఏపుగా పెరిగిన పంటలు నేలవాలి పోగా.. మామిడి పిందెలు రాలిపోయాయి. భారీ వృక్షాలు కూలిపోతున్నాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం రాత్రి కురిసిన వడగండ్లు పలు గ్రామాల్లో స్థానికులను భయకంపితులను చేశాయి. పెద్ద సైజులో పడిన రాళ్లు రెండుమూడు గంటల వరకు కూడా కరిగిపోలేదు. బోధన్ మండలం సంగెం, మినార్‌పల్లి గ్రామాలలో రోడ్ల వెంబడి, కాలనీల్లో ఎటుచూసినా ఐస్ గడ్డలే.. సమాచారం అందుకున్న బోధన్ సబ్‌కలెక్టర్ హరినారాయణన్ సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. కుమ్మన్‌పల్లి, సాలంపాడ్, తదితర గ్రామాల్లో  వరి, సన్‌ప్లవర్, మొక్కజొన్న పంటలు నేలమట్టమయ్యాయి.
 
  వర్ని, కోటగిరి మండలాల్లోని పలు గ్రామాల్లో వడగండ్లు పడ్డాయి. పెంకుటిళ్లు కూనలు విరిగిపోయాయి. వివిధ ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. గోవూర్ వద్ద ప్రధాన రహదారిపై చెట్టు  విరిగిపడింది.
 -నిజామాబాద్, న్యూస్‌లైన్
 
 జిల్లాలో నేలమట్టమైన పంటలు ఆందోళనలో రైతులు
 బోధన్ రూరల్; న్యూస్‌లైన్ :
 వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు, వడగండ్ల వానకు జిల్లాలోని ఆయా మండలాల్లో పంట లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. బోధన్ మండలంలోని కుమ్మన్‌పల్లి, సాలంపాడ్, పెంటకుర్దు, కొప్పర్తిక్యాంప్, సాలూరక్యాంప్, నాగన్‌పల్లి, చెక్కిక్యాంప్, శ్రీనివాస్‌నగర్, కల్దుర్కి, బండార్‌పల్లి,  మావందికలాన్, మినార్‌పల్లి, సంగెం, భవానిపేట్  గ్రామాలలో గురువారం సాయంత్రం మళ్ళీ ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. దీంతో వరి, సన్‌ప్లవర్, మొక్కజొన్న పంటలు నేలమట్టమయ్యాయి. పొట్టదశలో ఉన్న వరి నేలవాలింది. అలాగే పొద్దుతిరుగుడు,  మొక్కజొన్న పంటలు కూడా నేల మట్టామయ్యాయి. దీంతో రైతులు ఆందోళన  చెందుతున్నారు.
 
 దెబ్బతిన్న ఆరుతడి పంటలు
 పిట్లం : మండలంలోని ఆయా గ్రామాల్లో  అకాల వర్షాలకు ఆరుతడి పంటలు దెబ్బతిన్నాయి. ఆరుతడి పంటల కింద మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, జొన్న లాంటి పంటలను సాగు చేశారు. వారం రోజుల నుంచి వర్షం కురవడంతో  ప్రస్తుతం చేతికొచ్చే దశలో ఉన్న ఈ పంటలన్నీ దెబ్బతినడంతో రైతులు లబోదిబోమంటున్నారు.వర్షానికి తోడు భారీగా గాలులు వీయడంతో చేతికొచ్చిన పంటలు నేలవాలాయి.
 
 ఆందోళనలో సంగెం
 బోధన్ రూరల్ : బోధన్ మండలం సంగెం, మినార్‌పల్లి గ్రామాలలో గురువారం రాత్రి తీవ్ర వడగండ్ల వాన బీభత్సం సృష్టించడంతో ప్రజలు భయందోళన చెందారు. రెండు గ్రామాలలో రోడ్లు వెంబడి, కాలనీలలో వడగండ్ల  కుప్పలు, తెప్పలు కనిపించాయి.   
 
 గ్రామాన్ని సందర్శించిన సబ్‌కలెక్టర్
 బోధన్ సబ్‌కలెక్టర్ హరినారాయణన్ మినార్‌పల్లి, సంగెం గ్రామాలలో గురువారం రాత్రి కురిసిన వడగండ్లను పరిశీలించారు.  ప్రాణాలతో బయటపడ్డామని సబ్‌కలెక్టర్ ఎదుట గ్రామస్తులు వాపోయారు. వరి పంటలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయని తెలిపారు. రెవెన్యూ అధికారులతో సర్వే చేయిస్తామని హామీ ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement