రాము కోసం ఎదురు చూస్తున్న మత్స్యకారులు
శ్రీకాకుళం, రణస్థలం: మండలంలోని జీరుపాలెంలో శనివారం పడవ బోల్తా పడి గల్లంతైన మత్స్యకారుడు మైలపల్లి రాము ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. రెండో రోజు ఆదివారం కూడా స్థానిక మత్స్యకారులు తీవ్రంగా గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో రాము కుటుంబంలో ఆందోళన పెరుగుతోంది. స్థానిక మర పడవలతో మత్స్యకారులు రణస్థలం, ఎచ్చెర్ల, గార, పూసపాటిరేగ మండలాల సముద్ర తీరం వెంబడి గాలింపు చేపట్టారు.
మత్స్యశాఖ అధికారులెక్కడ?
మత్స్యకారుడు గల్లంతైనా మత్స్యశాఖ అధికారులు నుంచి కనీసం స్పందించడం లేదని జీరుపాలెం మత్స్యకారులు మైలపల్లి కామరాజు, సర్పంచ్ బడి చిన్న రాములు, దుమ్ము రాముడు, మైలపల్లి లక్షు్మడుతో పాటు పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు. మత్స్యకారుల అభివృద్ధికి పాటు పడతామని ప్రకటనలు ఇవ్వడమే తప్ప మత్స్యకారుల సాదకబాధకాలు కనిపించడం లేదని వాపోతున్నారు. గల్లంతైన తోటి మత్స్యకారుడి కోసం గ్రామమంతా కంటి మీద కునుకు లేకుండా గాలింపు చర్యలు చేపడుతోంది. మత్స్యకారులకు, బాధిత కుటుంబానికి భరోసాగా నిలవాల్సిన మత్స్యశాఖ.. కనీసం మానవత్వాన్ని చాటుకోవడానికి ప్రయత్నించలేదని గ్రామస్తులు, స్థానిక మత్స్యకారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కళ్లెదుటే కనుమరుగైపోయాడు
మైలపల్లి రాము కళ్లెదుటే కనుమరుగైయిపోయాడు. పడవ బోల్తా విషయాన్ని వెనువెంటనే గ్రామస్తులతో పాటు, సంబంధిత అధికారులకు తెలియజేశా. గ్రామస్తులు చర్యలు చేపట్టినా.. అధికారుల నుంచి ఎటువంటి సహకారం లేదు. – మృత్యంజయుడైన మాగుపల్లి లక్షు్మడు
Comments
Please login to add a commentAdd a comment