చివరి శ్వాస వరకు ప్రజల కోసమే...
చివరి శ్వాస వరకు ప్రజల కోసమే...
Published Thu, Apr 24 2014 3:21 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
రాష్ట్ర రాజకీయాల్లో తనదైన సేవా మార్గంతో ప్రజలను ఆకట్టుకున్న శోభానాగిరెడ్డి చివరి శ్వాస వరకు ప్రజాసేవకే అంకితమయ్యారు. కర్నూలు జిల్లా రాజకీయాలతో, ప్రజలతో శోభనాగిరెడ్డికి ఎనలేని అనుబంధం ఉంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా షర్మిలతో కలిసి బుధవారం అర్ధరాత్రి వరకు శోభానాగిరెడ్డి ప్రజలతో మమేకమయ్యారు.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి 1996 లో అడుగుపెట్టిన శోభానాగిరెడ్డి ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు. తెలుగుదేశం పార్టీ తరపున 1997లో ఆళ్లగడ్డకు జరిగిన ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో మరోదఫా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆతర్వాత చోటు చేసుకున్న పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీ వీడి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున రాయలసీమలో గెలిచిన ఏకైక మహిళా ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి కావడం విశేషం. పార్టీ, చిరంజీవి ప్రభావం వల్ల కాకుండా, వ్యక్తిగత పరపతి కారణంగానే ఎన్నికల్లో విజయం సాధించారు.
వేదిక ఏదైనా కాని.. రైతుల సమస్యలు, విద్యార్ధుల స్కాలర్ షిప్, ప్రజా ఆరోగ్యం, ఇంకా ఏ అంశమైనా శోభానాగిరెడ్డి ముందుడి తన గళాన్ని వినిపించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాసటగా నిలిచారు. వైఎస్ జగన్ ఆలోచన విధానాన్ని, పార్టీ మార్గదర్శకాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలోనూ శోభానాగిరెడ్డి కృషి ఎనలేనిది. ప్రజా వ్యతిరేక విధానాలపై, ప్రతిపక్ష పార్టీల వ్యవహారతీరును, అధికార పక్ష విధానాలను ఎండకట్టడంలో తనదైన దూకుడును ఆమె ప్రదర్శించారు. రాజకీయం అనూహ్యం ఎదుగుతున్న మహిళానేతగా పేరు తెచ్చకుంటున్న తరుణంలో అతి చిన్న వయస్సులో ప్రజలకు, పార్టీకి, కుటుంబానికి భౌతికంగా దూరమయ్యారు. అయితే ఆమె గళం మూగపోవచ్చు.. వినిపించకపోవచ్చుకాని.. భవిష్యత్ రాజకీయాలకు శోభానాగిరెడ్డి స్పూర్తిగా నిలుస్తుందనేది ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని ఆళ్లగడ్డకు బయలుదేరిన శోభానాగిరెడ్డి దురదృస్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన శోభానాగిరెడ్డిని కేర్ ఆస్పత్రికి తరలించగా.. గురువారం ఉదయం 11.05 మరణించారు.
Advertisement
Advertisement