దౌర్జన్యాలు ఆపండి | Stop hooliganism | Sakshi
Sakshi News home page

దౌర్జన్యాలు ఆపండి

Published Thu, Oct 23 2014 2:50 AM | Last Updated on Tue, May 29 2018 4:15 PM

దౌర్జన్యాలు ఆపండి - Sakshi

దౌర్జన్యాలు ఆపండి

అనంతపురం అర్బన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని దాడులు చేస్తారా.. దళితులని కూడా చూడకుండా దౌర్జన్యాలు చేస్తారా.. ఇక మీ దౌర్జన్యాలు ఆపండి.. లేదంటే తగిన గుణపాఠం తప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టీడీపీ నాయకులను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తాడిపత్రి మండలం వీరాపురం గ్రామంలో ఈ నెల 18వ తేదీ దళితులపై జరిగిన దాడి విషయంపై గురువారం జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబును ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మెరుగు నాగార్జున, జిల్లా అధ్యక్షుడు ఎం. శంకర నారాయణ, పార్టీ నేతలు బి.ఎర్రిస్వామిరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఎగ్గుల శ్రీనివాసులు క లిశారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.

అనంతరం వారు మీడియాతో మట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులైన దళితులపై విచక్షణా రహితంగా దాడులకు దిగుతున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే ఫ్యాక్షన్‌ను తరిమికొడతామని చెప్పిన ముఖ్యమంత్రి దానిని మరింత ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆ గ్రామాన్ని సందర్శించినప్పుడు మహిళలు వణికిపోతూ.. తమకు రక్షణ లేదంటూ.. బోరున విలపిస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతల దౌర్జన్యాలను ఎదురించడానికి దళితులకు అండగా జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారన్నారు. దాడిలో గాయపడిన దళిత కుటుంబాలకు నష్ట పరిహారం వచ్చే విధంగా ఎస్పీ చర్యలు తీసుకోవాలని కోరారు.  
 
ఇది జేసీ బ్రదర్స్ పనే....

వీరాపురంలో జరిగిన ఘటనపై జేసి బ్రదర్స్ హస్తం ఉందని జిల్లా అధ్యక్షుడు ఎం. శంకర్‌నారాయణ ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తాడిపత్రి ప్రాంతంలో ఉన్న పరిశ్రమల్లో పని చేస్తున్న వందలాది మంది కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించారన్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు తొలగిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా దాడులు ఆపకపోతే తగిన మూల్యం తప్పదని ఆయన హెచ్చరించారు.
 
న్యాయం చేస్తాం : ఎస్పీ

వీరాపురంలో దళితులపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని, వారికి పూర్తి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా రాజశేఖర్‌బాబు హామీ ఇచ్చారు. సంఘటన అనంతరం ఆ గ్రామంలో ఏలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీని కలిసిన వారిలో పార్టీ నేతలు దిలీప్‌రెడ్డి, రాష్ట్ర విద్యార్థి విభాగం నేత బండి పరుశురాం, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు పెన్నోబులేసు, పురుషోత్తమ్ ఉన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement