
సమ్మె విరమించండి ఉపాధ్యాయ సంఘాలకు శైలజానాథ్ వినతి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమైక్యాంధ్ర సమ్మెను విరమించాలని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ ఉపాధ్యాయ సంఘాలను కోరారు. సమ్మెను విరమించినంత మాత్రాన ఉద్యమం ఆగిపోతుందనుకోవద్దని చెప్పారు. ఆయన ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. 60 రోజులుగా చేస్తున్న సమ్మెవల్ల సీమాంధ్రలో జనజీవనం స్తంభించిపోయిందన్నారు. విభజనను వ్యతిరేకిస్తూ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలంటూ వస్తున్న డిమాండ్లను ఆయన తోసిపుచ్చారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని అడ్డుకునే వరకూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు.
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వాస్తవాలు మాట్లాడారే తప్ప కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించలేదన్నారు. ఆయనకు కొత్త పార్టీ పెట్టే ఉద్దేశం కూడా లేదన్నారు. సీఎంను కొందరు నేతలు ఎందుకు తప్పుపడుతున్నారో అర్థమవడం లేదన్నారు. విభజన విషయంలో జరుగుతున్న పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై అక్టోబర్ 3న సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించామని మంత్రి చెప్పారు.