20లోగా పరిహారం
Published Sun, Dec 1 2013 1:29 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు :జిల్లాలోని తుపాను బాధిత రైతాంగానికి డిసెంబరు 20వ తేదీలోగా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి టీజీ వెంకటేశ్ హామీ ఇచ్చారు. 2012-13 సంవత్సరం నుంచి రైతులకు చెల్లించాల్సిన రూ. 28.22 కోట్లతో పాటు అక్టోబరులో కురిసిన భారీ వర్షాల సాయాన్ని కూడా కేంద్రం నుంచి రప్పించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలూ చేస్తామని పేర్కొన్నారు. శనివారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశపు హాల్లో కలెక్టర్ సురేశ్‌కుమార్ అధ్యక్షతన జిల్లా సమీక్షా మండలి(డీఆర్‌సీ) సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి టీజీ వెంకటేశ్ బాధిత రైతాంగానికి ఈ మేరకు హామీ ఇచ్చారు. సమావేశం ప్రారంభం కాగానే ముందుగా ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు జిల్లాలోని 23500 మంది కౌలు రైతులకు రుణాలివ్వాల్సిన బ్యాంకులు కేవలం 9,869 మందికి మాత్రమే రుణాలిచ్చి చేతులు దులుపుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీలం తుపాను సాయాన్ని పలు బ్యాంకులు అవుట్ స్టాండింగ్ సర్దుబాటు చేసుకుంటున్నాయని ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆరోపించారు. డీసీఎంఎస్ చైర్మన్ ఇక్కుర్తి సాంబశివరావు మాట్లాడుతూ, కౌలు రుణ చట్టాన్ని అమలు చేయించడం చేతగాకపోతే ఎలాగంటూ అధికారుల్ని నిలదీశారు. సహకార శాఖ మంత్రి కాసు కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్‌ల తీరు ఆక్షేపణీయంగానే ఉందనీ, విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకుని కౌలు రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకర్లలో అనాసక్తి ఉందన్నారు. వచ్చే రబీ సీజనులో ఎల్‌ఈసీ కార్డులున్న కౌలు రైతులందరికీ రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు సంతృప్తి చెందని ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి సమావేశంలో ఉన్న లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డిని వెంట తీసుకుని హాలు నుంచి బయటకు వెళ్లారు. వెంటనే ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకుల ఏజీఎంలను సమావేశానికి హాజరుకమ్మని ఆదేశించారు.
ఎన్యూమరేషన్ సరిగ్గా లేదు
అక్టోబరులో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను గుర్తించి రైతుల జాబితాలను తయారు చేయడంలో అధికార యంత్రాంగం సక్రమంగా పనిచేయలేదని టీడీపీ ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, కొమ్మాలపాటి శ్రీధర్, యరపతినేని శ్రీనివాసరావులు మంత్రి టీజీకి ఫిర్యాదు చేశారు. గురజాల నియోజకవర్గంలో మిరప పంటకు విపరీతంగా నష్టం జరిగినా ఎన్యూమరేషన్ సరిగ్గా జరగలేదన్నారు. బలుసుపాడు గ్రామంలో సిబ్బంది ఓ ఇంట్లో కూర్చుని గణాంకాలు తయారు చేశారని పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చే ముష్టి కోసం రైతులు ఎన్నాళ్లు ఎదురు చూడాలనన్నారు. వెంటనే మైకందుకున్న మంగళగిరి ఎమ్మెల్యే కాండ్రు కమల మాట్లాడుతూ రైతులకిచ్చే సాయాన్ని ముష్టి అనడం సబబు కాదన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని అరటి రైతులకు లైలా తుపాను సాయాన్ని అందించే విషయంలో ఉద్యాన శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు.
సబ్సిడీ మంజూరు చేయించండి...
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోని రైతులకు సబ్సిడీ కింద పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ.21 కోట్లను వెంటనే విడుదల చేయించాలని జీడీసీసీ బ్యాంకు చైర్మన్ ముమ్మనేని వెంకట సుబ్బయ్య కోరారు. మంగళగిరి ఏరియాలో నిర్మించాలనుకున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని వెంటనే మంజూరు చేయాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఎమ్మెల్యే కాండ్రు కమల కోరారు. వీజీటీఎం ఉడా పరిధిలో అనధికార లే అవుట్లు ఎక్కువయ్యాయనీ అరికట్టకపోతే కష్టమని ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పల్నాడులో రియల్టర్లు వ్యవసాయ భూముల్ని వ్యాపారానికి అనుగుణంగా మార్చి భూ బదలాయింపు పన్నును ఎగ్గొడుతున్నారని ఎంపీ మోదుగుల ఆరోపించారు. పిడుగురాళ్ల యార్డు ఎదుట అనధికార నిర్మాణం జరుగుతుందని గురజాల ఎమ్మెల్యే యరపతినేని ఫిర్యాదు చేశారు. పంచాయతీల్లో వీధిలైట్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మంత్రి దృష్టికి తెచ్చారు.
అన్యాక్రాంతమవుతోన్న జెడ్పీ స్థలం ..
సత్తెనపల్లిలోని రూ.50 కోట్ల విలువైన జిల్లాపరిషత్ స్థలం కబ్జాకు గురవుతోందని ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి సమావేశంలో మంత్రి టీజీ వెంకటేశ్, కలెక్టర్ సురేశ్‌కుమార్‌లకు ఫిర్యాదు చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఏకధాటిన జరిగిన సమావేశంలో జేసీ వివేక్‌యాదవ్, ఎమ్మెల్యేలు గాదే వెంకటరెడ్డి, జీవీఎస్‌ఆర్ ఆంజనేయులు, మస్తాన్‌వలి, ఎమ్మెల్సీలు నన్నపనేని రాజకుమారి, బొడ్డు నాగేశ్వరరావు, సింగం బసవపున్నయ్య వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సీఎం వస్తే అడ్డుకుంటాం
సాక్షి, గుంటూరు : ‘జలయజ్ఞం’ కింద రాష్ట్రంలో మొట్టమొదట చేపట్టిన ప్రాజెక్టు పులిచింతల. తొమ్మిదేళ్లుగా పనులు జరుగుతూనే ఉన్నాయి. పను లన్నీ పూర్తయి ప్రారంభానికి వస్తే ఎవరినైనా సాదరంగా ఆహ్వానిస్తాం. కాదని డిసెంబర్ 5న జరిగే ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరైతే కచ్చితంగా అడ్డుకుంటా’మని నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్, యరపతినేని శ్రీనివాస్‌లు స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులన్నీ పూర్తయ్యాయని రైతాంగాన్ని మభ్యపెట్టి హడావుడిగా ప్రారంభించేసి చేతులు దులుపుకునేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు.
పాజెక్టు నుంచి గుంటూరు జిల్లా వైపు అప్రోచ్ రోడ్డు నిర్మించకపోవడం జిల్లా ప్రజలపై ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పేర్కొన్నారు. ప్రాజెక్టు వద్ద ఇంకా 30 శాతం పనులన్నీ అలాగే ఉన్నాయని ఎంపీ మోదుగుల వివరించారు. వీటన్నింటినీ పూర్తి చే యకుండా ముఖ్యమంత్రి అధికార యంత్రాంగంతో హడావుడిగా ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వస్తే కచ్చితంగా అడ్డుకుంటామన్నారు. కనీసం ప్రాజెక్టును చూసేందుకు వెళ్లే జిల్లా వాసులకు అనుకూలంగా అప్రోచ్ రోడ్డు నిర్మించకపోవడం ఘోరమని సత్తెనపల్లి శాసనసభ్యుడు యర్రం వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు.
కలెక్టర్ సురేశ్‌కుమార్ సమాధానమిస్తూ ప్రాజెక్టు పనులైతే ఇంకా పూర్తి కాలేదన్నారు. మేజర్ పనులన్నీ పూర్తయిన నేపథ్యంలో 20 టీఎంసీల నీరు నిల్వచేసే అవకాశాలున్నాయని చెప్పేందుకు ప్రజాప్రతినిధులు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయమంటున్నారన్నారు. ముంపు గ్రామాల ప్రజలందరినీ 20 రోజుల్లోగా పునరావాస కాలనీలకు తరలిస్తామన్నారు. మంత్రి టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ, టీడీపీ ఎమ్మెల్యేలు, సభ్యుల ఆవేదన ను అర్థం చేసుకున్నానన్నారు. ఈ విషయంలో సభ్యులతో తాను ఏకీభవిస్తున్నానన్నారు. వారం రోజుల్లోగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి వివరిస్తానన్నారు. కాగా పులిచింతల విషయంపై టీడీపీ ఎమ్మెల్యేలు దాదాపు 20 నిమిషాల పాటు సమావేశంలో హడావుడి చేశారు. ఒక దశలో ఎంపీ మోదుగల వేణుగోపాలరెడ్డి అధికారపార్టీ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.
Advertisement
Advertisement