అతి కిరాతకంగా హత్య
* మృతుడి ఒంటిపై 23 కత్తిపోట్లు
* విభిన్న కోణాల్లో కేసు దర్యాప్తు
* యువతి వివాదమే హత్యకు కారణం?
నెల్లూరు (క్రైమ్) : స్నేహితుల నడుమ విభేదాలు తారా స్థాయికి చేరాయి. స్నేహితులే ఇర్షాద్‌ను సోమవారం అర్ధరాత్రి బోడిగాడితోటలో అతి కిరాతకంగా హత్య చేశారు. మృతుడి మెడ, ఛాతిపై విచక్షణా రహితంగా 23 సార్లు పొడిచారు. చనిపోలేదని బండరాయితో తలపై మోది మృతి చెందాడని నిర్ధారించుకున్న అనంతరం అక్కడ నుంచి వెళ్లారు. ఈ సంఘటన నిందితుల పైశాచికత్వానికి అద్దం పడుతోంది. పోలీసులు, స్నేహితుల వివరాల మేరకు..
రంగనాయకులపేట ఇసుక డొంకకు చెందిన ఎస్‌కే ఇర్షాద్(19), కోటమిట్టకు చెందిన జహీర్, రంగనాయకులపేటకు చెందిన వాజి నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నారు. గతంలో ఇర్షాద్ కుటుంబం కోటమిట్టలో ఉండేది. ఆ సమయంలోనే ఇర్షాద్‌కు రౌడీషీటర్ రఫి అలియాస్ ఫిత్తల్‌కోడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు స్నేహితులుగా మారారు. కొద్దికాలం కిందట ఇర్షాద్ కుటుంబం రంగనాయకులపేట ఇసుకడొంకకు మారింది. సోమవారం రాత్రి జహీర్ తన ఇంటి ముందు ఉండగా రఫి అతనిపై అకారణంగా దాడి చేశాడు.
దీంతో జహీర్ ఒకటోనగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఇర్షాద్ స్నేహితుడి వద్దకు వచ్చాడు. సర్దిచెప్పి కేసును ఉపసంహరించుకోవాలని కోరాడు. అందుకు జహీర్ తనకు క్షమాపణ చెప్పించాలని కోరడంతో రఫికి ఫోన్ చేసి కోటమిట్టకు రమ్మని ఇర్షాద్ పిలిచాడు. దీంతో రఫి అతని స్నేహితుడు కాలేషాతో కలిసి రంగనాయకులపేట వద్దకు వచ్చి ఇర్షాద్‌కు ఫోన్‌చేసి మాట్లాడాలని పిలిచి బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లారు. బోడిగాడితోటలోకి తీసుకెళ్లి అతనితో గొడవపడ్డారు. రఫి కత్తితో విచక్షణా రహితంగా మెడ, ఛాతిపై 23 చోట్ల పొడిచాడు. చనిపోతాడో లేదోనని బండరాయితో తలపై మోది హత్య చేశాడు. అక్కడ నుంచి జహీర్‌కు ఫోన్ చేసి నాతో డబుల్ గేమ్ ఆడుతున్నందుకే హత్య చేశానని చెప్పాడు.
విభిన్న కోణాల్లో కేసు దర్యాప్తు
మంగళవారం ఉదయం మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టంలో 23 కత్తిపోట్లను గుర్తించినట్లు సమాచారం. రెండో నగర ఇన్‌స్పెక్టర్ వి. సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది విభిన్న కోణాల్లో కేసు దర్యాప్తు చేపట్టారు. తొలుత వాజీ, జహీర్‌ను పోలీసులు విచారించారు. ఇర్షాద్ ప్రవర్తనపై ఆరా తీశారు. రఫితో ఏవైనా గొడవలున్నాయా అని ఆరాతీశారు. రఫి తనకు ఫోన్ చేసి నాతో విభేదించిన వారందరిని ఒక్కొక్కరిగా చంపుతానని బెదిరించినట్లు పోలీసులకు వెల్లడించారు.
ఇదిలా ఉంటే రఫి తన స్నేహితుడి చెల్లెలుతో సన్నిహితంగా ఉండటం చూసి ఇష్టం లేక ఇర్షాద్ ఆమె కుటుంబ సభ్యులకు తెలిపినట్లు, వారు ఆమెను మందలించడంతో రఫి అప్పటి నుంచి ఇర్షాద్‌పై కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇర్షాద్‌ను హత్య చేసి ఉంటాడని ఒక సమాచారం. ఇర్షాద్ పలుమార్లు రఫిని నమ్మించి కేసుల్లో ఇరికించాడ న్న కోపంతోనే హత్య చేసి ఉండొచ్చుననే ప్రచారం కూడా ఉంది. దీంతో అన్నీ కోణాల్లో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుల కోసం గాలింపు
రఫి, అతని స్నేహితుడు కాలేషా కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం రఫి మూడో మైలులో ఉండటంతో అక్కడ సైతం అతని కోసం గాలించారు. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఖుదా దయలేదా...
ఒక్కగానొక్కకుమారుడని అల్లారు ముద్దుగా పెంచుకున్నా. ప్రయోజకుడై చేదోడు వాదోడుగా ఉంటానని ఆశపడ్డా...ఇంతలోనే నానుంచి దూరం చేస్తావా. దేవుడా నీకు దయలేదా అంటూ మృతుడి తండ్రి ఖాదర్‌బాషా రోదించడం చూపురులను కంటతడి పెట్టించింది.