నిందులను మీడియా ముందుకు ప్రవేశపెట్టిన సీఐ సన్యాసినాయుడు, తదితరులు
ఇచ్ఛాపురం రూరల్: స్నేహితులే హంతకులుగా మారారు. ఒకే ప్రాంతానికి చెందిన వారు.. ఒకే దగ్గర పనిచేస్తున్న వారు.. మద్యం మత్తులో విచక్షణ మరిచారు.. స్నేహితుడని చూడకుండానే కర్రతో తలపై మోది హత్య చేసి పరారయ్యారు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్‌లో విలేకరుల ముందుకు నిందితులను పోలీసులు సోమవారం ప్రవేశపెట్టారు. సోంపేట సీఐ ఎన్.సన్యాసినాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 25న లొద్దపుట్టి ఎల్‌సీ గేట్ సమీపంలో గల బాహుదా చానల్‌లో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందారు. రూరల్ ఎస్సై ఎ.కోటేశ్వరరావు కేసు నమోదు చేశారు. అతడు స్థానిక ఇటుకబట్టీలో పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. పోస్టుమార్టంలో హత్యగా నమోదు కావడంతో పోలీసులు ఆ కోణంలో విచారణ ప్రారంభించారు. మృతిచెందిన వ్యక్తి ఒడిశా రాష్ట్రం బొలంగిరి జిల్లాకు చెందిన సూర్యచంద్ర సాహూగా గుర్తించారు. అతడికి అలియాస్ బుల్లూ (40) స్నేహితుడు.
అదే జిల్లాకు చెందిన స్నేహితులు రుక్మన బడియా, హేమంత్ బడియాతో పాటు సాహూ గత నెల 25న మధ్యాహ్నం లొద్దపుట్టి పంచాయతీ జగన్నాథపురం గ్రామానికి దగ్గరలో ఉన్న దుకాణంలో సారా తాగారు. డబ్బులు చెల్లించాలంటూ సూర్య చంద్రసాహూ కోరడంతో ముగ్గురి మధ్య ఘర్షణ చెలరేగింది. తన వద్ద డబ్బులు లేకుండానే నిత్యం తమతో సారా తాగి తమనే డబ్బులు అడుగుతున్నాడని స్నేహితులు రుక్మన, హేమంత్ కక్షగట్టారు. ఒక పథకం ప్రకారం సాహూను ఎల్‌సీ గేటుకు సమీపంలో ఉన్న బాహుదాన చానెల్‌లో స్నానానికి హేమంత్ తీసుకువెళ్లాడు. ఇద్దరూ స్నానం చేస్తుండగా, రుక్మన వెనుక నుంచి లావుపాటి కర్రతో సాహూ తలపై కొట్టారు. అతడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో ఆందోళనకు గురైన రుక్మన, హేమంత్ గుట్టుచప్పుడు కాకుండా ఒడిశాలోని స్వగ్రామాలకు పరారయ్యారు. రూరల్ ఎస్సై ఎ.కోటేశ్వరరావు రెండు రోజుల పాటు సిబ్బందితో గాలించి నిందితులను పట్టుకున్నారు. ఇరువురిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నామని సీఐ తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ ఎస్సై ఎ.కోట్వేశరావు, టౌన్ ఎస్సై మంగరాజు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment