కడప అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : టపాసులు విక్రయించే యజమానులు నిర్ణయించిన ప్రదేశాల్లో నిబంధనలకు అనుగుణంగా విక్రయాలు చేపట్టేలా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నిర్మల అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. దీపావళి పండుగ సంద ర్భాన్ని పురస్కరించుకుని బహిరంగ ప్రదేశాల్లో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈనెల 29వ తేది సాయంత్రం 5 గంటల వరకు టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జిల్లాలో ఇప్పటికే 205 టపాసుల విక్రయ కేంద్రాలకు దరఖాస్తులు వచ్చాయన్నారు. అగ్నిమాపక, రెవెన్యూ, మున్సిపాలిటీ, విద్యుత్, పోలీసు అధికారుల సహకారంతో టపాసుల విక్రయ కేంద్రాల స్థలాలు గుర్తించి లక్కీ డిప్ ద్వారా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు.
టపాసులు కాల్చేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి సిటీ కేబుల్ నెట్‌వర్క్ ద్వారా ప్రజలకు సమాచారం చేరవేయాలని ఆదేశించారు. టపాసుల విక్రయకేంద్రాలను ఎదురెదురుగా కేటాయించకూడదన్నారు. విక్రయ కేంద్రాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌కాని ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునేలా విద్యుత్ అధికారులు అందుబాటులో ఉంటూ విక్రయదారులకు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. కేంద్రాల వద్ద విక్రయదారులు 200 లీటర్ల నీటిని నిల్వ ఉండే డ్రమ్ములను, మూడు బకెట్ల ఇసుకను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
నవంబరు 1 నుంచి 3వ తేది వరకు విక్రయ కేంద్రాలలో టపాసులను విక్రయించుకోవచ్చన్నారు. పెద్దల పర్యవేక్షణలో పిల్లలు టపాసులను కాల్చేలా చూడాలన్నారు. ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా అధికారులందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, డీఆర్వో ఈశ్వరయ్య, కడప ఆర్డీఓ హరిత, డీఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి, కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ శ్రీలక్ష్మితోపాటు టపాసుల విక్రయ కేంద్రాల నిర్వాహకులు, అగ్నిమాపక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.