
సమ్మెలోకి విద్యుత్ ఉద్యోగులు
- తొలిరోజు మిశ్రమ స్పందన
- ఉన్నతాధికారులతో చర్చలు విఫలం
- సమ్మె కొనసాగిస్తామంటున్న ఉద్యోగులు
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : ఒప్పందం మేరకు వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లారు. వాస్తవానికి విద్యుత్ ఉద్యోగులకు ఏప్రిల్ నుంచి వేతన సవరణ అమలు కావాల్సి ఉన్నప్పటికీ అది జరగకపోవటంతో రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాల్లో విద్యు త్ ఉద్యోగులు ఆదివారం ఉదయం 6 గంటల నుంచి విధులు బహిష్కరించారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లాలో 825 మంది రెగ్యులర్ సిబ్బందితో పాటు మరో 300 మంది కాంట్రాక్టు సిబ్బంది కూడా సమ్మెలోకి వెళ్లినట్లు విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కన్వీనర్ జి.శివకుమార్ పేర్కొన్నారు.
జాయింట్ యాక్షన్ కమిటీ చెబుతున్న విధంగా పూర్తి స్థాయిలో ఉద్యోగులు తొలిరోజు సమ్మెకు సహకరించలేదని తెలుస్తోంది. గత రెండు రోజులుగా వీచిన ఈదురు గాలులతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగటంతో పలుచోట్ల మరమ్మతు పనులకు ఉద్యోగులు హాజరైనట్లు సమాచారం. తొలిరోజు ఆది వారం సెలవు దినం కావటంతో ఎవరూ సమ్మెలోకి వచ్చింది, ఎవరూ విధులు నిర్వర్తిస్తున్నది తెలియని పరిస్థితి ఉందని ఉద్యోగులే పేర్కొం టున్నారు.
తొలి రోజు సమ్మెను నిలువరించేందుకు భావి ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడుతో పాటు గవర్నర్ నరసింహన్, సీఎస్ మహంతి, విద్యుత్ శాఖ సీఎండీలు విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులతో చర్చించినప్పటికీ ఫలితం లేకపోయింది. పీఆర్‌సీ అమలు పై కచ్చితమైన నిర్ణయాన్ని ప్రభుత్వం ఇవ్వలేకపోవటంతో సమ్మె కొనసాగిస్తామని విద్యుత్ ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. అంతే కాకుం డా సమ్మెలో భాగంగా తొలిరోజు ఆదివారం దాసన్నపేటలో గల విద్యుత్ సహకార సంఘ భవనం ఎదుట ఉద్యోగులు ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ జిల్లా కమిటీ అధ్యక్షుడు జి. శివకుమార్ మాట్లాడుతూ వేతన సవరణను అమలు చేసేంత వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు హామీ ఇచ్చి ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో విఫలం కావటంతో తాము సమ్మె కు దిగినట్లు పేర్కొన్నారు. అంతే తప్ప ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వినియోగదారులను ఇబ్బందులు పెట్టడం తమ ఉద్దేశం కాదని తెలి పారు. తమ సమస్యలపై ప్రభుత్వం, అధికారు లు సానుకూలంగా స్పందిస్తే తక్షణమే విధుల్లో చేరుతామని చెప్పారు. ధర్నాలో జేఏసీ ప్రతిని ధులు బి.కె.వి.ప్రసాద్, ఎం.నిర్మలమూర్తి, రాజేంద్రప్రసాద్, వర్మ పాల్గొన్నారు.
నిలిచిన విద్యుత్ సరఫరా
విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావంతో తొలిరోజు ఆదివారం జిల్లాలోని పలు ప్రాంతా ల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. గత రెండు రోజులుగా ఈదురు గాలులతో చాలా చోట్ల సరఫరా నిలిచిపోగా ఆదివారం నుంచి ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చింది. అధికారులు సమాచారం మేరకు విజయనగరం పట్టణంలో మయూరి జంక్షన్, ఇందిరానగర్, ప్రదీప్ నగర్, రైల్వే న్యూకాలనీ తదితర ప్రాంతాలకు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సరఫరా నిలిచిపోయింది. ఎస్‌కోట డివిజన్‌లో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, నెల్లిమర్ల, పూసపాటిరేగ మండలాల్లోని పలు గ్రామాల్లో కూడా విద్యుత్ సరఫరాకు విఘాతం కలిగినట్లు తెలుస్తోంది.
ఇదే తరహలో మిగిలిన ప్రాంతాల్లో కూడా సరఫరాకు అంతరాయం కలిగినట్లు సమాచారం. ఇదే విషయమై ఏపీఈపీడీసీఎల్ టెక్నికల్ డీఈటీ దైవప్రసాద్ వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా ఓ వైపు సమ్మె, మరోవైపు ఈదురుగాలుల ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచి పోవటం వాస్తవమేనన్నారు. సమస్యను పరిష్కరించేందుకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన 245 మంది సిబ్బందిని తీసుకు వచ్చామని మరమ్మ తు పనులు చేపడుతున్నామని వివరించారు.