
చదువు రాదని బాబా చెప్పాడంటూ..
► సూసైడ్ నోట్ రాసి విద్యార్థి ఆత్మహత్య
► కృష్ణా జిల్లా కోడూరులో ఘటన
సాక్షి, అవనిగడ్డ: తనకు చదువు రాదని ‘బాబా’ చెప్పాడంటూ ఓ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా కోడూరులో జరిగిన ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. మందపాకల గ్రామానికి చెందిన అద్దేపల్లి శేష వెంకటరామకృష్ణ కుమారుడు శివసాయి మణికంఠ(17) కోడూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాగా, తనకు చదువు ఇష్టం లేదంటూ మణికంఠ గత నెల 12న ఇంట్లో నుంచి పారిపోయాడు. దీనిపై అతని తండ్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్సై వై.సుధాకర్ విజయవాడలో మణికంఠ ఆచూకీ కనుగొని.. తల్లిదండ్రులకు అప్పగించారు.
ఎంపీసీ గ్రూప్ చదవలేనని చెప్పడంతో.. తల్లిదండ్రులు అతన్ని సీఈసీకి మార్చారు. ఈనేపథ్యంలో మణికంఠ రెండు రోజుల నుంచి కాలేజీకి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో మణికంఠ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, మణికంఠ వద్ద కుటుంబసభ్యులకు ఓ సూసైడ్‌నోట్ లభించింది. ‘అమ్మనాన్న చదువుకోమని చెబుతున్నారు. కానీ నాకు చదువు రాదని ఓ బాబా చెప్పాడు. దీంతో ఇటు చదువుకు, అటు పనికి దూరమవుతున్నానన్న మనస్తాపంతో చనిపోతున్నాను..’ అంటూ మణికంఠ సూసైడ్ నోట్‌లో రాశాడు.